జబ్బుల మాటున ఇన్ఫెక్షన్లు!

28 Nov, 2019 02:58 IST|Sakshi

దేశంలో ఎక్కువగా ఇన్ఫెక్షన్ల ద్వారానే రోగాలు

ఆ తర్వాతి స్థానం గాయాలదే.... 

గుండె జబ్బులు 9 శాతమే

గుండె జబ్బులకన్నా పేగు సంబంధిత రోగాలే అధికం

సగటున ఒక్కో ఇన్ఫెక్షన్‌ చికిత్సకు రూ. 9 వేల ఖర్చు

కేన్సర్‌ వైద్యానికి కనీసం రూ. 61 వేల పైనే.. 

గుండె జబ్బులకు రూ. 36 వేలు

నేషనల్‌ స్టాటిస్టికల్‌ ఆఫీస్‌ సర్వేలో వెల్లడి  

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో ఎక్కువ జబ్బులు ఇన్ఫెక్షన్ల ద్వారానే వస్తున్నాయని నేషనల్‌ స్టాటిస్టికల్‌ ఆఫీస్‌ (ఎన్‌ఎస్‌వో) వెల్లడించింది. గతేడాది జూన్‌ వరకు నిర్వహించిన సర్వే వివరాలను ఎన్‌ఎస్‌వో అధికారికంగా తాజాగా ప్రకటించింది. ఈ సర్వే ప్రకారం దేశంలో ఎక్కువ జబ్బులు ఇన్ఫెక్షన్ల ద్వారానే వస్తున్నాయని తేలింది. ఇన్‌పేషెంట్లుగా ఆసుపత్రుల్లో చేరుతున్న వారిలో 31.4 శాతం మంది ఇన్ఫెక్షన్‌ సంబంధిత రోగాలతోనే వస్తున్నారని వెల్లడైంది.

ఇన్ఫెక్షన్ల తర్వాత ఎక్కువ మంది గాయాలతో వస్తున్నారని, ఆ తర్వాతి స్థానాల్లో పేగు, గుండె సంబంధిత రోగులు ఉన్నారని సర్వే వెల్లడించింది. అయితే ఇన్ఫెక్షన్ల బారినపడుతున్న వారిలో పురుషులకన్నా మహిళలే ఎక్కువని సర్వే తేల్చింది. సర్వే గణాంకాలను పరిశీలిస్తే పట్టణ ప్రాంతాల్లో 31.4 మంది మగవారు, 31.8 శాతం మంది మహిళలు ఇన్ఫెక్షన్‌ సంబంధిత జబ్బులతో ఆసుపత్రుల్లో చేరుతున్నారు. అదే గ్రామీణ ప్రాంతాల్లో అయితే 31.3 శాతం మంది పురుషులు, 31.4 శాతం మంది మహిళలు ఇన్ఫెక్షన్‌ జబ్బులకు గురువుతున్నారని వెల్లడైంది.

కేన్సర్‌కే అత్యధిక ఖర్చు...
ఖర్చుల విషయానికి వస్తే అన్నింటికన్నా కేన్సర్‌ చికిత్స కోసం ఎక్కువ ఖర్చవుతోందని సర్వే వెల్లడించింది. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందిన రోగులు ఇచ్చిన సమాచారం ప్రకారం సగటున ప్రతి కేన్సర్‌ రోగికి కనీసం రూ. 61,216 ఖర్చవుతోందని సర్వే తేల్చింది. ఆ తర్వాత గుండె జబ్బులకు ఎక్కువ ఖర్చవుతుండగా రోగాల సంఖ్యలో ఎక్కువగా ఉన్న ఇన్ఫెక్షన్‌ సంబంధిత వ్యాధులకు అతితక్కువ ఖర్చుతో వైద్యం అందుతోందని వెల్లడించింది.

మరిన్ని వార్తలు