హెల్త్‌ వారియర్స్‌కు సహోద్యోగులతోనే కరోనా ముప్పు!

26 Jun, 2020 03:54 IST|Sakshi

ఆస్పత్రి నుంచి సోకిన కేసుల్లో 70 శాతం వాటికి కారణమిదే..

అమెరికాలోని డ్యూక్‌ యూనివర్సిటీ పరిశోధనలో వెల్లడి

21,104 మంది వైద్య సిబ్బందికి కోవిడ్‌ సోకిన విధానంపై అధ్యయనం

ఐసీయూలో పనిచేసే వైద్యులకు 4 రెట్లు రిస్క్‌ ఎక్కువ: ఐసీఎంఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: కరోనాపై పోరాడుతున్న యోధుల్లో ముందుండే వైద్యులు, వైద్య సిబ్బందికి కోవిడ్‌ ఎక్కువగా రోగుల నుంచి కాకుండా సహోద్యోగులతోనే వస్తోంది. ఆస్పత్రి నుంచి వైరస్‌ సంక్రమించిన కేసుల్లో దాదాపు 70 శాతం మందికి సహోద్యోగులు, తోటి సిబ్బందితోనే వ్యాప్తి చెందుతోంది. హెల్త్‌ వారియర్స్‌కు కరోనా సోకుతున్న తీరుపై అమెరికాలోని డ్యూక్‌ యూనివర్సిటీ అధ్యయనం చేసింది. మార్చి 15వ తేదీ నుంచి జూన్‌ 6వ తేదీ వరకు జరిపిన ఈ పరిశోధనలో 21,104 మంది వైద్యులు, వైద్య సిబ్బందికి కరోనా వైరస్‌ సోకిన విధానంపై అధ్యయనం చేశారు. వైరస్‌ వ్యాప్తి చెందినట్లు నిర్ధారణ అయిన తర్వాత వారితో ఫోన్, ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా సంభాషించి పరిస్థితిని విశ్లేషించగా పలు ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. (మాస్క్ అనేది సరిగ్గా వేసుకుంటేనే..)

రోగులతో జాగ్రత్తగా ఉండటంతో... 
కోవిడ్‌–19 పేషెంట్లకు చికిత్స అందిస్తున్న సమయంలో వైద్యులు, వైద్య సిబ్బంది పూర్తిస్థాయిలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మాస్కులు పెట్టుకోవడం, చేతికి గ్లౌజ్‌లు తొడుక్కోవడంతో పాటు పీపీఈ కిట్లు ధరించిన తర్వాతే రోగి ఉంటున్న వార్డుల్లోకి వెళ్లి చికిత్స అందిస్తున్నారు. ఇలాంటి పూర్తిస్థాయి జాగ్రత్తలు తీసుకోవడంతో రోగుల నుంచి డాక్టర్లు, ఇతర సిబ్బందికి వైరస్‌ తక్కువగా సోకుతుంది. అయితే రోగిని పరిశీలించిన తర్వాత వైద్యులు, వైద్య సిబ్బంది వారి గదుల్లోకి వెళ్లిన తర్వాత పీపీఈ కిట్లు, మాస్కులు, గ్లౌజ్‌లు తొలగిస్తున్నారు. ఇదే సమయంలో సహోద్యోగులతో ఎలాంటి జాగ్రత్తలు లేకుండా, కనీసం భౌతిక దూరాన్ని సైతం పాటించకుండా ఉండటంతో వైరస్‌ వ్యాప్తికి అనుకూలంగా మారుతోందని పరిశీలనలో తేలింది. (ఆగస్టు 12 వరకు రైళ్లు బంద్)

వైద్యులు, వైద్య సిబ్బందికి వైరస్‌ సోకిన తీరును మూడు కోణాల్లో పరిశీలన చేశారు. సమాజం నుంచి, సహచరుల నుంచి, ఆస్పత్రుల నుంచి సోకుతున్నట్లు నిర్ధారించి ఆమేరకు విభజన చేసి పరిశోధన సాగించారు. హెల్త్‌ వారియర్స్‌కు సోకుతున్న వైరస్‌ ప్రధానంగా 38 శాతం సమాజం నుంచే సోకుతుండగా.. మరో 22 శాతం మేర ఆస్పత్రుల నుంచి సోకుతుంది. మిగతా 40 శాతం మందికి సమాజం, ఆస్పత్రులతో పాటు ఇతర అంశాల వల్ల వైరస్‌ వ్యాప్తి చెంది ఉండవచ్చని అభిప్రాయపడింది. ఇక ఆస్పత్రి ద్వారా కరోనా సోకిన వారిలో 70 శాతం మందికి కేవలం సహోద్యోగుల వల్లే వైరస్‌ వ్యాప్తి చెందినట్లు గుర్తించారు. మాస్కులు ధరించకుండా, ఫిజికల్‌ డిస్టెన్స్‌ పాటించకుండా వచ్చినట్లు తేల్చారు. ఈ క్రమంలో ఫిజికల్‌ డిస్టెన్స్‌ పాటించడంతో పాటు మాస్కులు ధరించాలనే నిబంధన కఠినతరం చేయడంతో వారం తర్వాత వారియర్స్‌కు వైరస్‌ సోకడం గణనీయంగా తగ్గిందని కనుగొన్నారు. దీంతో ఆస్పత్రిలో ఉన్నంతసేపు జాగ్రత్తలు తప్పకుండా పాటిస్తూ వస్తున్నట్లు ఆ యూనివర్సిటీ స్పష్టం చేసింది. (మేలుకుంటేనే కోలుకుంటాం)

ఐసీయూలోని వారియర్స్‌కు హైరిస్క్‌: ఐసీఎంఆర్‌ 
కరోనా సోకుతున్న హెల్త్‌ వారియర్స్‌లో అధికంగా ఐసీయూలో డ్యూటీ చేస్తున్న వాళ్లున్నట్లు ఐసీఎంఆర్‌ (భారత వైద్య పరిశోధన మండలి) పరిశీలనలో తేలింది. ఐసీయూ విధుల్లో భాగంగా పేషెంట్‌ కు ఆక్సిజన్‌ పెట్టడం, పైపులు మార్చడంతో పాటు రోగిని మరింత దగ్గరగా పరిశీలించాల్సి రావడంతో ఈ పరిస్థితి ఏ ర్పడుతున్నట్లు ఐసీఎంఆర్‌ శా స్త్రవేత్తలు గుర్తించారు. సాధార ణ వార్డులో పనిచేసే వారితో పోలిస్తే ఐసీయూ వైద్యు లు, వైద్య సిబ్బంది నాలు గు రెట్లు అధిక రిస్క్‌లో ఉ న్నట్లు స్పష్టంచేసింది. అదే విధంగా పీపీఈ కిట్లు ధరి స్తున్న వారు జాగ్రత్తలు పాటించకపోవడం కూడా రిస్క్‌కు కారణమని తెలిపింది. (లాక్డౌన్లో ఎంత డౌన్?)

చిరిగిన పీపీఈ కిట్లు ధరించడం, సరైన పద్ధతిలో మాస్క్‌ పెట్టుకోకపోవడం, గ్లౌజ్‌లు సరిగ్గా వేసుకోని వాళ్లలో రిస్క్‌ 3 రెట్లున్నట్లు తెలిపింది. జనాభా నిష్పత్తితో పోలిస్తే మన దగ్గర వైద్యులు, సిబ్బంది తక్కువగా ఉన్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఈక్రమంలో వైద్యులు, వైద్య సిబ్బందిని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని, వైద్యులు, సిబ్బందికి విధుల్లో ఉన్నంతసేపు మాస్క్‌ ధరించాలనే నిబంధనను పూర్తిస్థాయిలో అమలు చేయాలని, అదేవిధంగా బయటకు వెళ్లినప్పుడు కూడా మాస్క్‌ ధరిస్తే మంచి ఫలితముంటుందని నిజామాబాద్‌ వైద్య కళాశాల క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌ విభాగాధిపతి డాక్టర్‌ కిరణ్‌ మాదల ‘సాక్షి’తో అభిప్రాయపడ్డారు.

మరిన్ని వార్తలు