టీచర్‌ ఫెయిల్‌..!

18 Sep, 2019 01:59 IST|Sakshi

లక్షన్నర మంది ప్రైవేట్‌ టీచర్లలో అనర్హులే ఎక్కువ

బీఎడ్, డీఎడ్, టెట్‌ అర్హతలను తేల్చేందుకు విద్యాశాఖ కసరత్తు

ప్రైవేటు స్కూళ్లలో టీచర్‌గా బోధించాలంటే టెట్‌ తప్పనిసరి 

వచ్చే నవంబర్‌ నుంచి తేల్చనున్న 2019–20 విద్యా సంవత్సర లెక్కలు

పాఠశాలల వారీగా టీచర్ల వివరాలు ఆధార్‌తో లింక్‌

రాష్ట్రంలోని మొత్తం ప్రైవేట్‌ పాఠశాలలు..10,834

అధికారిక లెక్కప్రకారం వీటిలో టీచర్ల సంఖ్య..1,04,874

అనధికారిక అంచనా ప్రకారం టీచర్ల సంఖ్య..1,50,000

వోచర్‌ పేమెంట్లతో పనిచేస్తున్న వారు..33,000

అసలు ఉపాధ్యాయ శిక్షణే పొందని వారి సంఖ్య..4,000

రెండేళ్ల క్రితం లెక్కల ప్రకారం టెట్‌ అర్హత లేనివారు..64శాతం

కేంద్రం చెప్పిందిది..
ప్రైవేటు పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు సంబంధించి ఇంటర్మీడియెట్, డిగ్రీ, పీజీ, డీఎడ్, బీఎడ్, టెట్‌ అర్హతలు తదితర అన్ని వివరాలను తీసుకోవాలి. వీటిని ఆధార్‌తో అనుసంధానం చేసి ఒక పాఠశాలలో పనిచేసే టీచర్‌ మరో పాఠశాలలో లేకుండా చూసేందుకు (డూప్లికేషన్‌) ఆన్‌లైన్‌ లింకేజీ చేయాలని స్పష్టం చేసింది. 2010లో ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌)ను అమల్లోకి తెచ్చినపుడు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో బోధించాలంటే సదరు అభ్యర్థి టెట్‌లో అర్హత సాధించా లన్న నిబంధనను జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్‌సీటీఈ) విధించింది. అయితే ప్రభుత్వాలు ఇన్నాళ్లూ ఆ నిబంధన విషయంలో సీరియస్‌గా వ్యవహరించలేదు. 

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ నగరం మధ్యలో ఉన్న ఓ కార్పొరేట్‌ స్కూల్లో 950 మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. అందులో దాదాపు 35 మంది టీచర్లు పనిచేస్తున్నారు. వారిలో 10 మంది వరకు టీచర్లకు నెలవారీ వేతనం రూ.10 వేల లోపే. కారణం వారిలో ఎక్కువ మందికి డీఎడ్‌ లేదా బీఎడ్‌ లేకపోవడం, ఇంకొందరు టెట్‌లో అర్హులు కాకపోవడం. ఇలాంటి టీచర్లు రాష్ట్రంలో వందల స్కూళ్లలో వేల సంఖ్యలో పనిచేస్తున్నట్లు విద్యా శాఖ అం చనా. ఐఐటీ చదువులు.. సింగిల్‌ డిజిట్‌ ర్యాంకులు అంటూ ఆకర్షణీయంగా ఎరవేస్తాయి ప్రైవేట్, కార్పొరేట్‌ పాఠశాలలు. వేలకు వేలు ఫీజులు చెల్లించి పిల్లలను చేరి్పస్తే ఆశించిన చదువులు మాత్రం రావడం లేదు. ఎందుకలా అంటే.. అందులో శిక్షణ పొం దిన ఉపాధ్యాయులే ఉండరు. ఏదో ఇంటరో.. డిగ్రీ సర్టిఫికెటో పట్టుకుని టీచర్లుగా పనిచేస్తుంటారు. ఇలాంటి వారికి వేతనం కూడా రూ.10వేల లోపే. ఇక ఇలాంటి వాటికి చెక్‌ పెట్టాలని కేంద్రం నిర్ణయించింది. ఉపాధ్యాయ శిక్షణ పొందిన వారే ప్రైవేట్‌ స్కూళ్లలో టీచర్లుగా పనిచేసేలా చర్యలు తీసుకుంటోంది. ఇందులో అక్రమాలకు తావులేకుండా ఆధార్‌ను అనుసంధానం చేయాలని రాష్ట్రాలకు సూచించింది.  

ఆధార్‌తో లింక్‌... 
ఇప్పటివరకు ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న ఆధార్‌ ఆధారిత టీచర్ల లెక్కలు ఇకపై ప్రైవేటు స్కూళ్లు చెప్పాల్సిందే. 2019–20 విద్యాశాఖ లెక్కల సేకరణలో (యూ–డైస్‌) కచ్చితంగా ఆ వివరాలు ఇవ్వాల్సిందే. విద్యార్థుల సంఖ్యకు, ఉపాధ్యాయులకు సంఖ్య సరిపోలాల్సిందే. ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ఉందా? లేదా? అడ్డగోలు ప్రవేశాలు చేపడుతున్నారా? అన్నది తేల్చేందుకు, వాటికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ సిద్ధమైంది. దీంతో అర్హతల్లేని టీచర్లకు చెక్‌ పడనుంది. అర్హులైన వారితోనే బోధన చేపట్టేలా కార్యాచరణను అమలు చేసేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది. వచ్చే నవంబర్‌ నుంచి చేపట్టనున్న 2019–20 యూ–డైస్‌లో ప్రైవేటు పాఠశాలకు చెందిన టీచర్ల సమగ్ర వివరాలు ఇవ్వాల్సిందేనని, అదీ ఆన్‌లైన్‌లో ఆధార్‌తో లింక్‌ చేయడం డూప్లికేషన్‌ లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్రంలో అవసరమైన చర్యలు తీసుకునేందుకు పాఠశాల విద్యాశాఖ సిద్ధమవుతోంది.  

పక్కాగా చర్యలు చేపట్టినా.. 
దేశవ్యాప్తంగా పాఠశాలల్లో విద్యార్థులకు బోధించే వారు కచి్చతంగా సుశిక్షితులైన వారే ఉండాలని కేంద్రం 2017 ఆగస్టులో స్పష్టం చేసింది. 2019, మార్చి 31 నాటికి పాఠశాలల్లో పని చేసే ప్రతి ఒక్కరు ఉపాధ్యాయ విద్యను అభ్యసించిన వారై ఉండాలని సూచించింది. గుర్తింపు పొందిన పాఠశాలల్లో పని చేస్తున్న వారు నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఓపెన్‌ స్కూలింగ్‌ ద్వారా ఉపాధ్యాయ విద్యను అభ్యసించేలా అవకాశం కల్పించింది. అయితే పాఠశాలల్లో వారు బోధిస్తున్నట్లు సరి్టఫై చేసిన వారికే ప్రవేశాలు కల్పించింది. మొదట్లో 3,905 మంది మాత్రమే అన్‌ట్రైన్డ్‌ టీచర్లు ఉన్నట్లు విద్యాశాఖ లెక్కలు వేసినా, ఓపెన్‌ స్కూల్‌లో ఉపాధ్యాయ విద్యను అభ్యసించేందుకు అర్హత ఉందంటూ ఆధారాలతో 17 వేల మందికిపైగా దరఖాస్తు చేసుకుని చదువుకున్నారు. 

రికార్డుల్లో లేని వారు 33 వేలపైనే.. 
పాఠశాలల రికార్డుల్లో లేకపోయినా టీచర్లుగా పని చేస్తున్న వారు మరో 33 వేల మందికి పైగా ఉన్నట్లు విద్యాశాఖ వర్గాలు భావిస్తున్నాయి. వారికి ఉపాధ్యాయ విద్య అర్హతలు లేనందున రికార్డుల్లో చూపడం లేదు. మరోవైపు మరికొంత మందికి తక్కువ వేతనాలు ఉండటంతో వోచర్‌ పేమెంట్ల సరిపుచ్చుతున్నట్లు అధికారులే పేర్కొంటున్నారు. ఇక టెట్‌లో అర్హత సాధించని వారైతే 64 శాతం ఉన్నట్లు విద్యాశాఖ పరిశీలనల్లోనే తేలింది. ఈ పరిస్థితులన్నింటి నేపథ్యంలో ప్రభుత్వంతోపాటు ప్రైవేటు రంగంలో విద్యా బోధన చేస్తున్న టీచర్ల లెక్కలను పక్కాగా చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది.    

మరిన్ని వార్తలు