కరోనా బాధితుల్లో మగవారే ఎక్కువ

30 Mar, 2020 02:24 IST|Sakshi

ఇప్పటివరకు నమోదైన  కేసుల్లో 71% పురుషులే

మహిళలకు రిస్క్‌ తక్కువ... చిన్న పిల్లలకు రిస్క్‌ లేనట్లే

గుండె వ్యాధిగ్రస్తులే కరోనాకు మొదటి శత్రువులు

పొగతాగే అలవాటున్న వారికి మరింత ప్రమాదం

చనిపోయిన వారిలో 29.9 శాతం 70 ఏళ్లు పైబడినవారే

కరోనా అప్‌డేట్స్‌ ఇచ్చే ‘వరల్డోమీటర్‌’ నివేదిక వెల్లడి 

సాక్షి, హైదరాబాద్‌: కరోనాకు ప్రభావితం అవుతున్న వారిలో అధికంగా పురుషులే ఉంటున్నారు. ఇప్పటివరకు నమోదైన కేసుల్లో 71 శాతం మగవారే ఉన్నట్లు అంతర్జాతీయ కరోనా అప్‌డేట్స్‌ను అందించే ‘వరల్డో మీటర్‌’అనే వెబ్‌సైట్‌ ఇటీవల నివేదికలో వెల్లడించింది. కరోనాతో మహిళలకు రిస్క్‌ తక్కువగా ఉన్నట్లు తెలిపింది. పొగతాగే అలవాటుండటం, కాలుష్యానికి అధికంగా ప్రభావితం కావడం తదితర కారణాలతో మగవారిలో శ్వాసకోశ, ఊపిరితిత్తుల సమస్యలు ఏర్పడటం వల్ల కరోనా మరణాల సంఖ్య అధికంగా ఉన్నట్లు తెలిపింది. ఈ వైరస్‌ అత్యంత వేగంగా వ్యాపిస్తుందని తెలిపింది.

చైనా నేషనల్‌ హెల్త్‌ కమిషన్‌ (ఎన్‌హెచ్‌సీ) అంచనాల ప్రకారం, మరణించిన వారిలో 80 శాతం మంది 60 ఏళ్లు పైబడిన వారు. వారిలో 75 శాతం మందికి గుండె సంబంధిత సమస్యలు, డయాబెటీస్‌ వంటివి ఉన్నాయని తేలింది. అలాగే ప్రపంచంలో ఇప్పటివరకు నమోదైన కేసుల్లో ఎక్కువ మంది కరోనాకు గురయ్యేది పురుషులేనని నివేదిక వెల్లడించింది. అంటే 71 శాతం మంది ఈ వైరస్‌కు మగవారు ప్రభావితం అవుతున్నారని తెలిపింది. అయితే కరోనా వైరస్‌ అన్ని వయస్సుల వారిని ప్రభావితం చేస్తుంది. ప్రధానంగా వృద్ధులు, ఉబ్బసం, డయాబెటీస్, గుండె సమస్యలు ఉన్న వారికి అధికంగా సోకుతుందని నివేదిక తెలిపింది. కాలానుగుణంగా ఫ్లూ, వైరస్‌ల వల్ల ప్రతీ ఏడాది ప్రపంచంలో 6.50 లక్షల మంది వరకు చనిపోతున్నారని తెలిపింది.

70 ఏళ్లకు పైబడిన వారిలోనే మరణాలు అధికం...
కరోనా వైరస్‌కు చనిపోతున్నవారిలో అధికంగా 70 ఏళ్లకు పైబడినవారే ఉన్నారని నివేదిక తెలిపింది. చైనాతోపాటు ప్రపంచంలో ఇప్పటివరకు కరోనాతో చనిపోయినవారి లెక్కలను విశ్లేషిస్తే, 70 ఏళ్లకు పైబడినవారు 29.9 శాతం ఉన్నారు. పిల్లల్లో చాలా తక్కువ కరోనా కేసులు కనిపిస్తున్నాయి. లింగ నిష్పత్తిని లెక్క వేస్తే చైనాలో ధూమపానం మగవారిలో ఎక్కువగా ఉందని నివేదిక తెలిపింది. ధూమపానం శ్వాసకోశ సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి కరోనా మరణాల రేటు పురుషుల్లో అధికంగా ఉందని నివేదిక తెలిపింది. కేసుల సంఖ్యను, మరణాల సంఖ్యను లెక్కలోకి తీసుకుంటే... పురుషుల్లో మరణ రేటు 4.7 శాతం, మహిళల్లో 2.8 శాతంగా మరణ రేటు ఉందని తెలిపింది.

గుండె వ్యాధులున్న వారిపైనే ప్రభావం
కరోనా బారినపడేవారు అధికంగా ఇతరత్రా అనారోగ్య సమస్యలున్నవారే ఉన్నారని నివేదిక తెలిపింది. గుండె వ్యాధులున్నవారు అధికంగా చనిపోయారు. ఇతరుల వివరాలపై స్పష్టత లేదు.

పొగతాగే వారిపై తీవ్ర ప్రభావం
పొగతాగే వారికి కరోనా సోకే అవకాశం ఎక్కువగా ఉంది. కరోనా ఊపిరితిత్తులకు సంబంధించిన వైరస్‌. పొగతాగే వారికి ఊపిరితిత్తుల సమస్య ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ వైరస్‌ ప్రధానంగా పొగతాగే అలవాటున్నవారిపై ఎక్కువగా ప్రభావం చూపుతుంది. కాబట్టి పొగతాగడాన్ని నిలిపివేయాలి. – నాగ శిరీష, యాంటీ టొబాకో యాక్టివిస్ట్, హైదరాబాద్‌

మరిన్ని వార్తలు