కన్నీటి ధారల మధ్య ఖననం

3 Oct, 2016 06:17 IST|Sakshi
ఒకే గోతిలో ఆరుగురి మృతదేహాలను ఖననం చేస్తున్న దృశం

కంగ్టి: తడ్కల్ తల్లడిల్లింది. వరద మృతులకు కన్నీటి వీడ్కోలు పలికేందుకు జనం వేలాదిగా తరలివచ్చారు. శనివారం నిజామాబాద్ జిల్లా పిట్లం మండలం కారేగాం పిల్లివాగులో తల్లితో సహా ఐదుగురు చిన్నారులు జల సమాధి అయిన విషయం విదితమే. శనివారం రాత్రి మృతులకు బాన్సువాడలోని ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం చేసి ఆదివారం ఉదయం శవాలను స్వగ్రామమైన తడ్కల్‌కు తీసుకువచ్చారు. గ్రామానికి చెందిన జంగం రాజు కుటుంబాన్ని విద్యుత్ శాఖ డిప్యూటీ ఈ ఈ శ్రీనివాస్‌రావు పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ఖన నం నిమిత్తం రూ. 5వేలు అందజేశారు. తహసీల్దార్ రాజయ్య, ఎస్‌ఐ నానునాయక్ మృతుల కుటుంబాలను పరామర్శించారు.  

పిల్లల శవాలను చేతులపైనే మోసి..
ఐదుగురు పిల్లలు ఏడేళ్లలోపు వయస్సు వారే కావడంతో  బంధువులు ఖననం నిర్వహించే స్థలానికి చేతులపైనే అంతిమయాత్ర నిర్వహించారు. వందల సంఖ్యలో ప్రజలు పాల్గొని వారికి కన్నీటి వీడ్కోలు పలికారు.
 
ఒకే గోతిలో ఆరుగురి ఖననం
పిల్లలు ప్రియా(7), జ్యోతి(6), జ్ఞాన హంసిక(3), జ్ఞాన సమిత(3)(కవలలు), దీంపాంక్ష(13 నెలలు)తో పాటు తల్లి జంగం రాజమణిని  ఒకే గోతిలో ఉంచి ఖననం చేశారు. కాగా, రాజమణితో పాటు ఐదుగురు చిన్నారుల మృ తదేహాలను ఆదివారం మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి చూసి చలించిపోయారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ జిల్లా బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించగా, ఆయన వచ్చి చూశారు. ఇంత కష్టం ఎవరికీ రావద్దని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు