మృత్యువులోనూ వీడని పేగుబంధం 

15 Mar, 2019 16:32 IST|Sakshi
తల్లీ, కొడుకుల మృతదేహాలు

చెరువులో మునిగిన బాలుడు

కాపాడబోయిన తల్లి మృత్యువాత

బాలుడి ఈత సరదా ఇద్దరి ప్రాణాలు తీసింది. ఈత కోసం చెరువులోకి దిగిన కొడుకు తన కళ్లెదుటే నీటమునుగుతుంటే కన్నతల్లి తల్లడిల్లింది. కొడుకును కాపాడేందుకు ఆమె చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. తల్లీకొడుకులను చెరువు మింగేసింది. తాను చూస్తుండగానే భార్య, కొడుకు నీట మునిగిపోతుంటే వికలాంగుడైన భర్త నిస్సహాయ స్థితిలో ఉండిపోయాడు. తల్లి, తమ్ము డిని కాపాడేందుకు మరో బాలుడు సాహసం చేసినా ప్రమాదాన్ని పసిగట్టిన తండ్రి వారించాడు. దీంతో ఆ బాలుడి నిండు ప్రాణాలు దక్కాయి.

సాక్షి, ఆత్మకూరు(పరకాల): పోలీసులు, బాధితుల  కథనం ప్రకారం... వరంగల్‌ నగరంలోని సుందరయ్య కాలనీకి చెందిన బుధవారపు రామకృష్ణ తన భార్య భాగ్యలక్ష్మి(40), కుమారులు సంతోష్, రాహుల్‌(11)తో కలిసి గురువారం తన తోడల్లుడు రాజు దశదినకర్మకు ములుగు జిల్లా పస్రా వెళ్లారు. కార్యక్రమం పూర్తయిన తర్వాత బైక్‌పై తిరిగి వస్తుండగా మార్గమధ్యంలో మండలంలోని కటాక్షపూర్‌ సమీపంలో హైవేను ఆనుకుని ఉన్న చెరువు వద్దకు కాసేపు సేదతీరుదామని ఆగారు.

అందరూ కలిసి కూల్‌డ్రింక్‌ తాగారు. చెరువులో కాళ్లు చేతులు కడుక్కున్నారు. ఇంతలో రాహుల్‌ ఈత కొడతానని బట్టలు విప్పి చెరువులోకి దిగాడు. కొద్ది దూరంలోనే మునుగుతుండగా గమనించిన తల్లి భాగ్యలక్ష్మి కొడుకును కాపాడేందుకు నీటిలోకి దిగింది. అప్పటికే రాహుల్‌ చెరువులో మునిగిపోగా, భాగ్యలక్ష్మి కూడా నీటముగినింది. ఇది గమనించిన పెద్దకుమారుడు సంతోష్‌ నీటిలో దిగేందుకు ప్రయత్నించగా ప్రమాదాన్ని పసిగట్టిన తండ్రి అతడిని వారించాడు.

రామకృష్ణ వికలాంగుడు కావడంతో ఏమీ చేయలేక నిస్సహాయ స్థితిలో ఉండిపోయాడు. కొద్దిసేపటల్లోనే తల్లీకొడుకులు మృత్యువాతపడ్డారు. రాహుల్‌ ఆరో తరగతి, సంతోష్‌ ఏడో తరగతి చదువుతున్నారు. సీఐ మహేందర్‌ సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను స్థానికుల సాయంతో తీయించి మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు