తల్లి కుక్క.. పిల్లలు క్షేమం!

12 Mar, 2019 03:26 IST|Sakshi
చికిత్సకు ముందు..., చికిత్స తరువాత...

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ నగరం మాసాబ్‌ట్యాంకు నుంచి విజయనగర్‌ కాలనీ వెళ్లే ప్రధాన మార్గంలోని జీహెచ్‌ఎంసీ వెటర్నరీ ఆస్పత్రి ఫుట్‌పాత్‌పై ఓ కుక్క నిస్తేజంగా పడి ఉంది. అనారోగ్యం, తీవ్ర నీరసంతో కదలలేని కొనఊపిరితో ఉంది. అటుగా వెళ్తున్న ఓ యువకుడు దానికి ప్రాథమిక చికిత్స చేయాల్సిందిగా ఆ ఆస్పత్రి సిబ్బందిని కోరగా, దాని బాధ్యత పూర్తిగా తీసుకునే వారుంటేనే చికిత్స చేస్తామని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చి చేతులెత్తేశారు. ఆ కుక్క పక్కనే దాని రెండు పిల్లలు పాల కోసం అల్లాడుతున్నాయి.

తల్లి కుక్క వద్ద పాలు రాకపోతుండటంతో అవి రోడ్డుపైకి వచ్చి ప్రమాదానికి గురయ్యే పరిస్థితి ఉండటంతో ఆ యువకుడు వెంటనే పీపుల్‌ ఫర్‌ యానిమల్స్‌సంస్థ సిబ్బందికి ఫోన్‌ చేసి వివరించడంతో పాటు ఫోన్‌లో దాని వీడియో తీసి పంపించాడు. సంస్థ ప్రతినిధి లత దాన్ని వాట్సాప్‌ గ్రూపులో ఉంచటంతో చేరువలో ఉన్న వలంటీర్లు సయ్యద్‌ తఖీ అలీ రజ్వీ, షబ్బీర్‌ అలీఖాన్‌లు అరగంటలో అక్కడికి చేరుకుని అట్టడబ్బాలో శునకం, దాని కూనలను తీసుకుని బేగంబజార్‌లోని రెస్క్యూహోమ్‌కు తీసుకెళ్లి అత్యవసర చికిత్స అందించారు. దీంతో కుక్క కోలుకుంది. మూగజీవాల పట్ల జాలితో వ్యవహరించాలని, ప్రమాదంలో ఉన్న వాటి ప్రాణాలు కాపాడాలని వారు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు