బిడ్డ కడుపు నిండగా..

31 Jul, 2018 11:16 IST|Sakshi
మదర్స్‌ మిల్క్‌ బ్యాంకులో పాల నిల్వ...

శిశువుల ఆకలి తీర్చే కల్పవల్లి..తల్లిపాల నిధి

నిలోఫర్‌లో సత్ఫలితాలిస్తున్న ధాత్రి–తల్లిపాల నిధి సేవలు

నెలకు సగటున 400 మంది పిల్లలకు పాలు సరఫరా

ఆగస్టు 1 నుంచి 7 వరకు తల్లిపాల వారోత్సవాలు

సాక్షి, సిటీబ్యూరో: నెలలు నిండకముందే తక్కువ బరువుతో జన్మించి, తల్లికి దూరంగా ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్న నిరుపేద శిశువుల పాలిట ‘ధాత్రి– తల్లిపాల నిధి’ ఓ వరంగా మారింది. ఆస్పత్రిలో ప్రసవించి పాలు సంమృద్ధిగా ఉన్న తల్లుల నుంచి ముర్రుపాలు సేకరించి, ఆకలితో బాధపడుతున్న శిశువులకు సరఫరా చేసేందుకు నిలోఫర్‌ ఆస్పత్రిలో మదర్స్‌ మిల్క్‌ బ్యాంకు ఏర్పాటు చేశారు. ఇది పిల్లల ఆకలి తీర్చడమే కాకుండా పరోక్షంగా తల్లుల ఆరోగ్యాన్నీ కాపాడుతోంది.

ధాత్రి ఫౌండేషన్, ప్రభుత్వం సంయుక్తంగా రూ.కోటితో గతేడాది నిలోఫర్‌ నవజాత శిశువుల ఆరోగ్య కేంద్రంలో మదర్స్‌ మిల్క్‌ బ్యాంక్‌ను నెలకొల్పింది. ఈ ఆస్పత్రిలో నిత్యం వెయ్యి మందికిపైగా శిశువులు చికిత్స పొందుతుండగా, వీరిలో సగానికిపైగా నెలలు నిండకముందు, తక్కువ బరువుతో జన్మించిన వారే ఉంటున్నారు. వీరిలో చాలా మంది రోజుల తరబడి తల్లికి దూరంగా చికిత్స పొందుతుంటారు. ఇలా తల్లికి దూరంగా ఉన్న.., వైద్యులు సిఫార్సు చేసిన 1.5 కేజీల లోపు శిశువులకు మదర్స్‌ మిల్క్‌ బ్యాంకు ముర్రు పాలు సరఫరా చేస్తుంది. ఇలా నెలకు సగటున 400 మంది పిల్లల ఆకలి తీర్చతుండటం విశేషం. ఆగస్టు ఒకటి నుంచి ఏడు వరకు తల్లిపాల వారోత్సవాల సందర్భంగా నిలోఫర్‌ మదర్స్‌ మిల్క్‌ బ్యాంక్‌ సేవలపై ప్రత్యేక కథనం.

తల్లుల ఆరోగ్యానికి భరోసా
ఆస్పత్రిలో రోజుకు సగటున 25 ప్రసవాలు జరుగుతుండగా, వీరిలో చాలా మందికి ప్రసవం తర్వాత రెండు మూడురోజుల వరకు పాలు పడటం లేదు. పాలు పడని తల్లులే కాకుం డా పాలు సమృద్ధిగా లభించే తల్లుల పాలి ట ఈ కేంద్రం ఓ వరం గా మారింది. పాలు పడని తల్లులకు కౌన్సి లింగ్‌ ఇవ్వడంతో పా టు అవసరమైన వైద్య సేవలు అందజేస్తుంది. తల్లి వద్ద సమృద్ధిగా పాలు ఉన్నప్పటికీ..శిశువు అనారోగ్యంతో బాధపడుతుండటంతో తాత్కాలికంగా ఫీడింగ్‌ నిలిపి వేయాల్సి ఉంటుంది. ఇలాంటి వారంతా స్వచ్ఛందంగా తల్లిపాల నిధికి చేరుకుని తమ పాలను దానం చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో వీరు రొమ్ము కేన్సర్‌ బారి నుంచి బయటపడే అవకాశం ఉంది. ఇలా రోజుకు 15 నుంచి 20 మంది వరకు ఈ కేంద్రానికి వస్తుండటం విశేషం. ఇక్కడ రోజుకు 450 మంది పిల్లలకు సరిపడా పాలను నిల్వ చేసే సౌలభ్యం ఉంది.  

అత్యంత భద్రంగా నిల్వ
పాల సేకరణకు ముందే వీరికి హెచ్‌ఐవీ, వీడీఆర్‌ఎల్, హెచ్‌ఎస్‌బీసీ వంటి వైద్య పరీక్షలు చేసి, ఎలాంటి వ్యాధులు లేవని నిర్ధారించుకున్న తర్వాతే పాలను సేకరిస్తున్నారు. ఇలా వీరి నుంచి సేకరించిన పాలను ప్రాసెస్‌ చేసి మైనస్‌ 20 డిగ్రీల వద్ద భద్రపరుస్తున్నారు. వీటిని ఆరు మాసాల వరకు వాడుకునే అవకాశం ఉంది. ఇక్కడ దేశంలోనే అత్యధికంగా మూడు వేల లీటర్ల పాలు నిల్వ చేసే సామర్థ్యం ఉండటం విశేషం. తల్లిపాలలో రోగనిరోధక శక్తిని పెంపొందించే ప్రొటీన్లతో పాటు శారీరక, మానసిక, ఆరోగ్య వికాసానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. 100 గ్రాముల తల్లిపాలలో 65 కిలో కేలరీల శక్తినిస్తాయి. ఇందులో విటమిన్‌ ఎ సహా థయామిన్, రైబోఫ్లెవిన్, బి12, బి6, సెనథోనిక్‌ ఆమ్లం, బయో టిక్, ఫోలిక్‌ ఆమ్లం, సీ,డీ,ఇ విటమిన్లు, క్యాల్షియం, ఇనుము, మెగ్నీషియం, వంటి ఖనిజ లవ ణాలు లభిస్తాయి. బిడ్డకు రోజుకు కనీసం 8 నుంచి 10 సార్లు పాలు తాగించాల్సి ఉంది. ఇలా కనీసం ఆరు మాసాల పాటు తల్లి పాలే అందించాలి. 

మరిన్ని వార్తలు