కూతుర్ని కొట్టిన తల్లికి జైలు

25 Sep, 2019 05:45 IST|Sakshi

ఏడాది శిక్ష విధించిన కోర్టు

కుషాయిగూడ: ఏడాదిన్నర వయసున్న కూతురిపై చెయ్యి చేసుకున్న ఓ తల్లికి ఏడాది జైలుశిక్షను విధిస్తూ మల్కాజిగిరి కోర్టు తీర్పునిచ్చింది. కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధి లో 2016లో నమోదైన కేసుపై విచారణ జరిపిన కోర్టు మంగళవారం తన తీర్పును వెలువరించింది. 2016 డిసెంబర్‌ 1న కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని రాధికా చౌరస్తాలో జయ, కె.అజయ్, కె.లక్ష్మి అనే ముగ్గురు గొడవ పడుతున్నారు. ఈ క్రమంలో మద్యం మత్తులో ఉన్న జయ తన ఏడాదిన్నర కూతుర్ని విచక్షణారహితంగా కొట్టడంతో చిన్నారి తలకు గాయమై రక్తస్రావమైంది.

గతంలో కూడా చిన్నారిపై పలుమార్లు ఇదే విధంగా దాడికి పాల్పడింది. ఈ ఘటనపై జిల్లా చైల్డ్‌ ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌ పానుగంటి సతీష్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కుషాయిగూడ పోలీసులు కేసు నమోదు చేసి జయ, అజయ్, లక్షీ్మలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సమర్పించిన ఆధారాలను పరిశీలించిన కోర్టు.. తల్లి జయకు ఏడాది జైలుశిక్ష, రూ.1,050 జరిమానా విధించింది. ఏ2, ఏ3లకు 3నెలల జైలుశిక్ష, రూ.250 జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. పోలీసులు నిందితులను జైలుకు తరలించారు. 

మరిన్ని వార్తలు