అమ్మకే ‘అమ్మ’ అతను..

21 Nov, 2014 01:54 IST|Sakshi

 దేవరకొండ : నిస్వార్థంగా కష్టపడి పెంచిన తల్లిదండ్రులను అనాథ శరణాయాల పాలుచేసే పుత్రరత్నా లు చాలామందే ఉంటారు. చనిపోయాక పున్నామ నరకం నుంచి తప్పిస్తారని ఆశించే తల్లిదండ్రుల ఆశలు అడియాశలు చేసే కొడుకులకు కొదవేలేదు. అలాంటి వారికి భిన్నం ఈ యువకుడు. జబ్బుతో బాధపడుతున్న తల్లికి నిత్యం సేవ చేస్తూ అమ్మ ప్రేమను మరిపిస్తున్నాడు దేవరకొండకు చెందిన  యువకుడు పీడీ ఖాన్.పీడీ ఖాన్ ఉన్నతాభ్యాసం చేశాడు. కన్న తండ్రి చిన్నప్పుడే మరణించడంతో తల్లి ఖాజాబి అన్నీ తానే అయింది. కష్టపడి పెంచి పెద్ద చేసి చదివించింది. ఎంఏ. బీఈడీతో పాటు ఎల్‌ఎల్‌బీ కూడా పూర్తి చేసిన ఖాన్ ప్రభుత్వోద్యోగానికి ప్రయత్నించినా దొరకలేదు. దీంతో స్థానికంగానే ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు.
 
 ఈ క్రమంలో నాలుగేళ్ల క్రితం తల్లి ఖాజాబి పెరాలసిస్ (పక్షవాతం) బారిన పడింది. దీంతోపాటు ఆమె వెన్నముక దెబ్బతినడంతో మంచం నుంచి లేవలేదు. కనీసం ఒక వైపునకు కూడా తిరగలేని పరిస్థితి. ఉన్న ముగ్గురు కొడుకుల్లో ఒక కొడుకు మరణించడం, మరో కొడుకు ఉద్యోగరీత్యా వేరే ప్రాంతంలో ఉండడంతో కన్న తల్లి భారం ఖాన్‌పై పడింది. ఖాన్ కూడా తల్లిని భారంగా భావించలేదు. తన బాధ్యతగా భావించాడు. కన్నతల్లికి అన్నీ తానే అయ్యాడు. నిత్యం తన అవసరాల కన్నా ముందుగా తల్లి అవసరాలు చూస్తున్నాడు. యూరిన్ బ్యాగ్ మార్చడంనుంచి తల్లి దుస్తులు ఉతకడం, పండ్లు తోమడం, అన్నం తినిపించడం వంటి అన్ని పనులు తానే చేస్తున్నాడు.   అతనికి  రెండేళ్ల క్రితం వివాహమైంది.  అంతకుముందు తల్లి కారణంగా చాలా సంబంధాలు తప్పిపోయాయి.
 
 ఎక్కడ తల్లి బాధ్యత వారిపై పడుతుందోనని అతనికి పిల్లనివ్వడానికే చాలా మంది వెనుకంజ వేశారు. తన తల్లి కోసం ఉన్నత చదువులు చదువుకున్న ఖాన్‌కు వేరే ప్రాంతాల్లో మంచి ఉద్యోగాలు వచ్చినా నిరాకరించాడు. ఒకవైపు తల్లిని చూసుకోవడంతో సమయం గడిచిపోవడం.. పాఠశాలకు ఆలస్యంగా వెళ్లేవాడు. యాజమాన్యంతో కొంత ఇబ్బందులు పడ్డాడు. దీంతో చివరికి తానే 60మంది విద్యార్థులతో ఓ పాఠశాలను నిర్వహిస్తున్నాడు. కన్న తల్లిని చూసుకోవడం కోసం ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపానని, ఇప్పటికీ ఆసుపత్రుల చుట్టూ తిప్పుతున్నా ఏ ఒక్క రోజు కన్న తల్లిని భారంగా భావించలేదంటున్నాడు ఖాన్. డబ్బు వ్యామోహంలో ఎంతోమంది కన్న తల్లిదండ్రులను అనాథాశ్రమాల పాలు చేస్తున్న సంఘటనలు తనకు బాధ కలిగిస్తాయంటున్నాడు. ఏది ఏమైనా ఖాన్‌కు తల్లిపై ఉన్న ప్రేమ నిజంగా అనిర్వచనీయం. ఖాన్ ఎంతో మందికి ఆదర్శం కావాలని ఆశిద్దాం.
 
 అమ్మకు సేవచేయడం నా భాగ్యం
 జన్మనిచ్చిన అమ్మకు సేవచేయడం దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నా. అందరికీ ఇలాంటి అవకాశం రాదు. నేను ఏనాడూ మా అమ్మను భారంగా భావించలేదు. ఆమె పనులు చేశాకే నా పని మొదలుపెడతా. నా ప్రాణం ఉన్నంత వరకు మా అమ్మను ఇలాగే చూసుకుంటా.
     - పీడీ ఖాన్
 

మరిన్ని వార్తలు