పోలీసులకు వాహనదారుల ఝలక్‌

9 Mar, 2020 08:11 IST|Sakshi
డ్రంకన్‌ డ్రైవ్‌లో భాగంగా తనిఖీ నిర్వహిస్తున్న పోలీసులు 

బైక్‌లకు ఇతరుల నంబర్లు

ట్రాఫిక్‌ చలానాలు తప్పించుకునేందుకు కొత్తమార్గం

పోలీసులకు ఇబ్బందికరంగా మారుతున్న కేసులు

పోలీసులను ద్విచక్రవాహనదారులు ముప్పుతిప్పలు పెడుతున్నారు. ట్రాఫిక్‌ చలానా నుంచి తప్పించుకునేందుకు కొందరు నంబర్లు మార్చి రోడ్డుపై తిరుగుతున్నారు. దీంతో ఫొటోలు తీసి చలానా వేస్తుండగా అసలైన యజమాని పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నారు. 

సాక్షి, పాలకుర్తి(రామగుండం): రహదారిపై భద్రతా నియమాలు పాటించకుండా ట్రాఫిక్‌రూల్స్‌ అతిక్రమిస్తున్న వాహనదారులపై ప్రస్తుతం పోలీసులు కొరడా ఝులిపిస్తున్నారు. పోలీసులు విధించే ఆన్‌లైన్‌ జరిమానాల నుంచి తప్పించుకునేందుకు వాహనదారులు కొత్తమార్గాన్ని ఎంచుకున్నారు. వాహనాలకు ఇతరుల వాహన నంబర్లు  రాయించుకొని తిరుగుతున్నారు. పోలీసులకు పట్టుబడినపుడు వారు విధించే జరిమానాకు సంబంధించిన సమాచారం అదేనెంబర్‌ కలిగిన అసలు వాహనదారులకు వెళ్తుండడంతో వారు ఖంగుతింటున్నారు. దీంతో సంబంధిత వాహన యజమానులు తమ వాహనం ఆ స్టేషన్‌ పరిధిలో వెళ్లలేదని, తాము ఎలాంటి ట్రాఫిక్‌ రూల్స్‌ అతిక్రమించలేదని పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నారు.

ఇలాంటి ఘటన ఇటీవల బసంత్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. బసంత్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఇటీవల పోలీసుల వాహన తనిఖీల్లో హెల్మెట్‌ లేకుండా ప్రయాణిస్తూ కుక్కలగూడుర్‌కు చెందిన వ్యక్తి చిక్కాడు. పోలీసులు అతడికి జరిమానా విధిస్తూ ఆన్‌లైన్‌ రసీదు అందించారు. అయితే పోలీసులు విధించిన జరిమానా సమాచారం హైదరాబాద్‌కు చెందిన మరోవ్యక్తికి సెల్‌ఫోన్‌లో మెసేజ్‌ వెళ్లింది. దీంతో ఖంగుతిన్న వాహన యజమాని సంబంధిత స్టేషన్‌కు కాల్‌చేసి వివరాలు అడిగాడు. తాను హైదరాబాద్‌లో ఉంటానని, నా వాహనం మీ స్టేషన్‌ పరిధిలో ఎక్కడికి రాలేదని, తనకు జరిమానా ఎలా విధిస్తారని వాగ్వాదానికి చేశాడు. దీంతో పోలీసులు సీరియస్‌గా తీసుకొని వాహన నెంబర్‌ ఎంట్రీ చేయడంలో ఏదైనా పొరపాటు దొర్లిందా అని పునరాలోచనలో పడి వివరాలు సరి చూసుకున్నారు. కానీ వాహన వివరాలు కరెక్ట్‌గా ఉండడంతో విస్తుపోయారు. వాహనదారుడు అంతటితో ఆగకుండా కమిషనరేట్‌లో ఫిర్యాదు చేశాడు. కమిషనర్‌ ఆదేశాల మేరకు పోలీసులు మరోసారి తాము ఎంట్రీ చేసిన వివరాలు పరిశీలించారు.

జరిమానా విధించిన వాహనదారుడిని స్టేషన్‌కు పిలిపించి విచారణ జరపడంతో అసలు విషయం బయటకు వచ్చింది. తన బైక్‌కు నంబర్‌లేదని, ఫ్యాన్సీగా ఉంటుందని ఒకనంబర్‌ తగిలించుకుని తిరుగుతున్నానని, ఇది గత మూడేళ్లుగా చేస్తున్నానని తెలుపడంతో పోలీసులు అవాక్కయ్యారు. అతడి వాహననంబర్‌ ప్లేటు తొలగించి సదరు వ్యక్తితో జరిమానా కట్టించారు. గతంలో కూడా ఇలాంటి సంఘటన బసంత్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని రాణాపూర్‌ గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి జరిగింది. కరీంనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ట్రాఫిక్‌రూల్స్‌ అతిక్రమించినందుకు జరిమానా విధించినట్లు అతడి సెల్‌కు మేసేజ్‌ వెళ్లింది. ఈవిధంగా నాలుగైదు సార్లు రావడంతో సంబంధిత వివరాలు పరిశీలించిన వ్యక్తికి అతడి వాహన నెంబర్‌తో కలిగిన మరో వాహనం ఫొటో కనిపించడంతో అవాక్కయ్యారు. ప్రస్తుతం ట్రాఫిక్‌ నిబంధనల విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో కొంతమంది ఆకతాయిలు ఇలాంటి చర్యలకు పాల్పడుతుండడం అటు పోలీసులను, అసలు వాహనదారులను ఆందోళనకు గురిచేస్తోంది.

మరిన్ని వార్తలు