పండుగపూట ఫాస్టాగ్‌ పరేషాన్‌

3 Jan, 2020 02:07 IST|Sakshi

సంక్రాంతి వేళ ‘హై వే టెన్షన్‌’ 

వీలైనన్ని ట్యాగ్లు అమ్మేందుకు ప్రత్యేక చర్యలు

నెల తర్వాత  50 శాతానికి చేరిన ట్యాగ్‌ వాహనాల సంఖ్య

75 శాతానికి చేరుకుంటేనే పండుగ వేళ సాఫీ ప్రయాణం

కొత్త విధానంతో భారీగా పెరిగిన టోల్‌ ఆదాయం

నెల రోజుల్లో రూ.4.50 కోట్ల పెరుగుదల  

‘సంక్రాంతి పండుగకు సొంత కారులో ఊరు వెళ్తున్నారా..? అయితే ఫాస్టాగ్‌ తీసుకోవడం మాత్రం మరవకండి. అది లేకుంటే పండుగ వేళ టోల్‌ ప్లాజాల వద్ద పడిగాపులు కాయాల్సి రావచ్చు. టోల్‌ గేట్ల వద్ద రుసుము చెల్లించేందుకు గంటల తరబడి క్యూలో ఎదురు చూడాల్సిన దుస్థితి ఎదురుకావచ్చు. పండుగ వేళ ప్రశాంతంగా ఊరెళ్దామని బయలుదేరితే, ఆ రద్దీలో చిక్కుకుని మీ సహనానికి పరీక్ష పెట్టుకుని పరేషాన్‌ అయ్యే పరిస్థితి రావొచ్చు’

సాక్షి, హైదరాబాద్‌: సంక్రాంతి రద్దీ టెన్షన్‌ ఎన్‌హెచ్‌ఏఐ అధికారులను ఉరుకులు పరుగులు పెట్టిస్తోంది. సంక్రాంతి వేళ హైదరాబాద్‌ నుంచి లక్షల మంది సొంతూళ్లకు వెళ్లనుండటంతో వేల సంఖ్యలో వాహనాలు రోడ్డెక్కను న్నాయి. ఫాస్టాగ్‌ లేని వాహనాల కోసం తక్కువ గేట్లు ఉండటం.. టోల్‌ప్లాజాల వద్ద కిలోమీటర్ల మేర క్యూలు ఏర్పడే పరిస్థితి రానుండటంతో అధికారులు ఆగమేఘాల మీద పరిస్థితిని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. రానున్న 10 రోజుల్లో వాహనదారులు ఎక్కువ మంది ఫాస్టాగ్‌లు తీసుకుంటేనే పరిస్థితి సాఫీగా ఉండనుంది. లేని పక్షంలో రోడ్లపై ప్రత్యక్ష నరకం కనిపించటం ఖాయం. ఫాస్టాగ్‌ విధానం వచ్చిన తొలి వారంలో వాహనాలు బారులుగా ఏర్పడి, టోల్‌ రుసుము చెల్లించేందుకు గంటల సమయం ఎదురు చూడాల్సి వచ్చింది. అలాంటిది ఒకేసారి వేల సంఖ్యలో వాహనాలు రోడ్డెక్కే సంక్రాంతి వేళ పరిస్థితి పూర్తిగా అదుపు తప్పనుంది.

పండుగకు క్యాష్‌ లేన్‌ ఒకటే..
ప్రస్తుత విధానాన్ని పొడిగించని పక్షంలో 14వ తేదీ తర్వాత ఒక్క(ఇరువైపులా ఒక్కొక్కటి) లేన్‌ మాత్రమే క్యాష్‌ చెల్లింపు విధానానికి వదలనున్నారు. మిగతావన్నీ ఫాస్టాగ్‌ లేన్లుగా మారనున్నాయి. దీంతో ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు వీలైనన్ని ఫాస్టాగ్‌లు విక్రయించేందుకు చర్యలు తీసుకున్నారు. 

50 శాతానికి ట్యాగ్లు..
ఫాస్టాగ్‌ విధానం వచ్చి నెల గడిచినప్పటికీ టోల్‌ ప్లాజాల గుండా వెళ్తున్న వాహనాల్లో 45 నుంచి 47 శాతం వాహనాలు మాత్రమే ఫాస్టాగ్‌ గేట్ల నుంచి వెళ్లటం విశేషం. అయితే తొలిసారి వాటి సంఖ్య 50 శాతానికి చేరుకుంది. గురువారం రాష్ట్రంలోని జాతీయ రహదారులపై 17 చోట్ల ఉన్న టోల్‌ ప్లాజాలను పరిశీలిస్తే 50.50 శాతం వాహనాలు ఫాస్టాగ్‌ లేన్ల నుంచి దూసుకెళ్లినట్టు నమోదైంది. టోల్‌ కలెక్షన్లలో 61 శాతం వీటి నుంచే వసూలైంది. సంక్రాంతి నాటికి ఇది ట్యాగ్‌ వాహనాల సంఖ్య 75 శాతానికి చేర్చాలని అధికారులకు ఎన్‌హెచ్‌ఏఐ ప్రాంతీయ అధికారి కృష్ణప్రసాద్‌ లక్ష్యంగా నిర్దేశించారు. ఈ మేరకు అధికారులు, బ్యాంకర్లతో గురువారం ఆయన ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. గురువారం నాటికి కేవలం 84 వేల ట్యాగ్‌లు మాత్రమే అమ్ముడయ్యాయి. సంక్రాంతికి ఊళ్లకు వెళ్లే వాహనదారులు వెంటనే మేల్కొనకపోతే పండగ సమయంలో టోల్‌ గేట్ల వద్ద ట్రాఫిక్‌లో చిక్కుకుని ఇబ్బంది పడాల్సి వస్తుందంటూ ముమ్మరంగా ప్రచారం చేపట్టారు. 

అధికమైన ఆదాయం..
ఫాస్టాగ్‌ వచ్చిన తర్వాత ఒక్కసారిగా టోల్‌ ఆదాయం భారీగా పెరిగింది. అక్టోబర్‌లో జాతీయ రహదారులపై ఉన్న 17 టోల్‌ప్లాజాల ద్వారా టోల్‌ రుసుము రూపంలో రూ.85.96 కోట్లు వసూలు కాగా, డిసెంబర్‌లో ఆ మొత్తం రూ.90.51 కోట్లుగా నమోదైంది. అంటే దాదాపు రూ.4.50 కోట్ల మేర ఆదాయం పెరిగింది. అన్ని వాహనాలు ట్యాగ్‌లు ఏర్పాటు చేసుకుంటే రూ.10 కోట్లకుపైగా అదనపు ఆదాయం నమోదవుతుందని అంచనా వేస్తున్నారు. 

భారీగా టెండర్లు..
టోల్‌ గేట్ల ఆదాయం ఎంత పెరిగితే.. తదుపరి టెండర్లలో మూల విలువను అంతమేర పెంచనున్నారు. రాష్ట్రంలోని 17 టోల్‌ప్లాజాల్లో 9 చోట్ల ఆన్యుటీ విధానం అమలులో ఉంది. అంటే అక్కడ వసూలయ్యే టోల్‌ మొత్తాన్ని అంచనాగా వేసుకుని దాన్ని బేస్‌ వ్యాల్యూగా నిర్ధారించి టెండర్లు పిలుస్తారు. టెండర్‌ దక్కించుకున్న సంస్థ దాన్ని మించి కోట్‌ చేస్తుంది. ఆ మొత్తాన్ని ఎన్‌హెచ్‌ఏఐకి చెల్లించి టోల్‌ వసూలు చేసుకుంటుంది. ఇప్పుడు ఫాస్టాగ్‌ వల్ల టోల్‌ కలెక్షన్లు భారీగా పెరుగుతుండటంతో తదుపరి టెండర్‌ల్లో భారీ మొత్తాలు నమోదు కానున్నాయి.  

మరిన్ని వార్తలు