దేశానికే ఆదర్శం ‘గొర్రెల’ పథకం

10 May, 2019 01:18 IST|Sakshi

కర్ణాటక గొర్రెలు–మేకల అభివృద్ధి సంస్థ చైర్మన్‌ సీవీ లోకేశ్‌గౌడ కితాబు 

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సబ్సిడీ గొర్రెల పంపిణీ పథకం దేశానికే ఆదర్శమని, ఇలాంటి పథకాన్ని కర్ణాటకలో కూడా అమలు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని కర్ణాటక గొర్రెలు–మేకల అభివృద్ధి సంస్థ చైర్మన్‌ సీవీ లోకేశ్‌గౌడ అన్నారు. తెలంగాణ రాష్ట్ర గొర్రెలు–మేకల అభివృద్ధి కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో అమలవుతున్న పథకం తీరుతెన్నులను అధ్యయనానికి గురువారం లోకేశ్‌గౌడ రాష్ట్రంలో పర్యటించారు. తెలంగాణ గొర్రెలు–మేకల అభివృద్ధి కార్పొరేషన్‌ సంస్థ రాష్ట్ర కార్యాలయంలో ఎండీ డాక్టర్‌ వి.లక్ష్మారెడ్డి, సంస్థ అధికారులతో లోక్‌శ్‌గౌడ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో అమలుచేస్తున్న సబ్సిడీ గొర్రెల పంపిణీ పథకం లక్ష్యం, నిధుల వినియోగం, లబ్ధిదారుల ఎంపిక, గొర్రెల సేకరణ, పథకం అమలుతీరు,వివరాలను వి.లక్ష్మారెడ్డి లోకేశ్‌గౌడకు వివరించారు. అనంతరం లోకేశ్‌గౌడ విలేకరులతో మాట్లాడుతూ... సబ్సిడీ ద్వారా యాదవ, కురుమ కుటుంబాలకు గొర్రెలు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. వ్యవసాయంలో నష్టాల వల్ల దేశ వ్యాప్తంగా వేలాదిమంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడినప్పటికీ కోలార్‌ జిల్లాలో ముగ్గురే ఆత్మహత్యలకు పాల్పడ్డారని, దీనికి ప్రధాన కారణం పాడిపశువుల పెంపకమే నని తెలిపారు. మాంసం దిగుబడి మరింత పెరిగేలా మేలుజాతి రకాలను దిగుమతి చేసుకోవాలని లోకేశ్‌గౌడ సూచించారు. ఆ రకాలను అందించేందుకు కర్ణాటక సిద్ధంగా ఉందని చెప్పారు. 

మేకపాలతో మంచి లాభాలు... 
మాంసం దిగుబడితో పాటు మేక పాల సేకరణపై దృష్టి సారిస్తే మంచి లాభాలను సాధించవచ్చని లోకేశ్‌గౌడ సూచించారు.  దేశంలోని ప్రధాన నగరాలలో మేక పాలకు మంచి డిమాండ్‌ ఉందని, ఔషధ గుణాలు ఉండటంతో లీటరు మేకపాలు రూ.2,000 వరకు ఉందని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం గొర్రెలు–మేకల పెంపకం దారుల పిల్లలకు 6 నుంచి 12 తరగతి వరకు ఏడాదికి రూ.1.50 లక్షల వరకు ఆర్థికసాయం అందించే ‘బేడ్‌ పాలక్‌ యోజన’ పథకాన్ని ఇటీవల నిలిపివేసిందని, దీన్ని పునరుద్ధరణకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నించాలని ఆయన సూచించారు.  

మరిన్ని వార్తలు