సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టండి

5 May, 2020 02:48 IST|Sakshi

కరోనా నివారణ, రైతు సమస్యలపై గవర్నర్‌తో అఖిలపక్షం భేటీ

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా కట్టడికి, రైతు సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టేలా చూడాలని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌కు అఖిలపక్ష నాయకులు విజ్ఞప్తి చేశారు. టీజేఎస్‌ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరామ్, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ, సీపీఐ రాష్ట్ర నాయకురాలు పశ్య పద్మ రాజ్‌భవన్‌లో సోమవారం గవర్నర్‌ను కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలను గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లారు. కరోనా వ్యాప్తిని నివారించేందుకు లాక్‌డౌన్‌తో పాటు వైద్య వ్యవస్థను బలోపేతం చేయడానికి లాక్‌డౌన్‌ కాలాన్ని ఉపయోగించేలా చూడాలని పేర్కొన్నారు.

సంక్షేమ పథకాల ద్వారా పేదలకు ఇచ్చే సహాయాన్ని పెంచాలని కోరారు. ప్రభుత్వం పట్ల విశ్వాసాన్ని పెంచేందుకు మరింత పారదర్శకంగా వ్యవహరించాలని కోరారు. ధాన్యం కొనుగోలు అస్తవ్యస్తంగా ఉందని, గోనె సంచులు లేక, ట్రాన్స్‌పోర్టు అందక, హమాలీలు దొరక్క కొనుగోళ్లలో జాప్యం జరుగుతోందని, దాని నివారణకు చర్యలు చేపట్టాలన్నారు. తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని విన్నవించారు. అఖిలపక్ష నాయకులు లేవనెత్తిన ఈ సమస్యలు వెంటనే పరిష్కారం అయ్యేలా చూడాలని ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌ పేర్కొన్నారు.

నేడు టీజేఎస్‌ మౌన దీక్ష
రాష్ట్రంలో కరోనా వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలు, ఆకలి, రైతు, వలస కూలీల అవస్థల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా ఈనెల 5న టీజేఎస్‌ ఆ«ధ్వర్యంలో మౌన నిరసన దీక్ష నిర్వహించనున్నట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జి.వెంకట్‌రెడ్డి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. పార్టీ కార్యాలయంలో టీజేఎస్‌ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం నేతృత్వంలో ఈ దీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు