కొండంత ఆత్మస్థైర్యం!

23 Jan, 2019 05:30 IST|Sakshi

ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించడమే ధ్యేయం   

ఆ లక్ష్య సాధనకు రూ.30 లక్షలు అవసరం  

ఆర్థిక ఇబ్బందుల్లో పర్వతారోహకుడు తిరుపతిరెడ్డి  

దాతలు ఆపన్నహస్తం అందించాలని వేడుకోలు

అతనో ఆటో డ్రైవర్‌ కుమారుడు. కానీ మంచి పర్వతారోహకుడు. పేదరికం వెంటాడుతున్నా తన అభిరుచిని, ఆసక్తిని మానుకోలేదు. ఇప్పటికే ఎన్నో పర్వతాలను అధిరోహించాడు. కిలిమంజారో, కొజియాస్కీ మౌంటెరెనాక్‌ వంటివి ఆయనకు పాదాక్రాంతం అయ్యాయి. కానీ తన అసలు లక్ష్యం. ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించడం. అందుకు ఆర్థికంగా వెసులు లేకపోవడంతో దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నారు తిరుపతిరెడ్డి. ఇందుకు దాదాపు రూ.30 లక్షలు అవసరమవుతాయని ఆయన చెబుతున్నారు.  

సాక్షి, సిటీబ్యూరో: వికారాబాద్‌ జిల్లా నవాబుపేట మండలం ఎల్లకొండకు చెందిన గుంతల తిరుపతిరెడ్డి ప్రస్తుతం దూరవిద్యలో డిగ్రీ చేస్తూ ఆటో నడుపుతున్నారు. తండ్రి కూడా ఆటో డ్రైవరే. చిన్నప్పటినుంచీ తిరుపతిరెడ్డికి పర్వతారోహణమంటే ఎంతో ఇష్టం. ఈ క్రమంలోనే 2015 మార్చి 24న ప్రఖ్యాత పర్వతారోహకుడు మస్తాన్‌ బాబు పర్వతారోహణ చేస్తూ మృతి చెందారు. దీంతో తిరుపతిరెడ్డి ఆలోచనలు మస్తాన్‌బాబు చుట్టే తిరిగాయి. ఐదంకెల జీతం, హాయిగా సాగిపోయే జీవితం.. అవన్నీ వదిలిపెట్టి ఓ వ్యక్తి పర్వతారోహణ చేయడమేంటి? అని ఆలోచించారు. ప్రపంచంలోని ఎత్తయిన శిఖరాలను అధిరోహించాలని అప్పుడే నిర్ణయించుకున్నారు. ఆ దిశగా అడుగులు వేశారు. భవనగిరిలోని రాక్‌ క్లైంబింగ్‌ స్కూల్‌లో చేరారు. ప్రొఫెషనల్‌ మౌంటనీర్‌ శేఖర్‌బాబు వద్ద శిక్షణ పొందారు. ఎత్తయిన గుట్టలు ఎలా ఎక్కాలి? ఎలాంటి జాగ్రత్తలు పాటించాలనే విషయాలన్నీ తెలుసుకున్నారు. భువనగిరిగుట్టను తిరుపతిరెడ్డి తొలి ప్రయత్నంలోనే అధిరోహించి.. పర్వతారోహణకు బాటలు వేసుకున్నారు.  


లైఫ్‌టైం అచీవ్‌మెంట్‌అవార్డు అందుకుంటూ..
విన్నర్స్‌ ఫౌండేషన్‌ వెన్నుదన్ను..

విన్నర్స్‌ ఫౌండేషన్‌ ప్రెసిడెంట్‌ రఘు, జాయింట్‌ సెక్రటరీ రమేష్‌ కాంబ్లీలు తిరుపతిరెడ్డి ప్రతిభను గుర్తించి ఆయనకు వెన్నుదన్నుగా నిలిచారు. నిధుల సేకరణకు తోడ్పడుతున్నారు.  భారత డైనమిక్స్‌ లిమిటెడ్‌ ఉద్యోగులైన రఘు, రమేష్‌ కాంబ్లీఉ విన్నర్స్‌ ఫౌండేషన్‌ ద్వారా ఎందరో అభాగ్యులకు అండగా నిలిచారు. తిరుపతిరెడ్డికి సైతం ఆపన్నహస్తం అందించేందుకు సాయపడుతున్నారు.   

రూ.30 లక్షలు అవసరం..
ఎవరెస్ట్‌ శిఖరం అధిరోహించే అవకాశం రావడమంటే మామూలు విషయం కాదు. ఇప్పటికే అనేక వ్యయ ప్రయాసలతో మూడు శిఖరాలను అధిరోహించిన తిరుపతిరెడ్డి ప్రస్తుతం ఎవరెస్ట్‌ అధిరోహించాలంటే దాదాపు రూ.30 లక్షలు అవసరమయ్యాయి. ట్రాన్సన్డ్‌ అడ్వంచర్స్‌ సంస్థకు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. వీటిని రెండు విడతల్లో అందించాలి. మొదటి విడత డబ్బును ఇప్పటికే ఇవ్వాలి కానీ తన వద్ద డబ్బు లేకపోవడంతో దాతల కోసం ఎదురుచూస్తున్నారు.   

నాన్న ఆటోడ్రైవర్‌. ప్రస్తుతం ఆయన అనారోగ్యంతో ఉన్నారు. కుటుంబం గడవడటమే గగనంగా మారింది. ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించడమే నా జీవిత లక్ష్యం. దాతలు ఆదుకుంటే ఆ లక్ష్యాన్ని పూర్తి చేసి రాష్ట్ర ప్రతిష్టను ఇనుమడింపజేసా.– గుంతల తిరుపతిరెడ్డి, పర్వతారోహకుడు  

తిరుపతిరెడ్డి బ్యాంక్‌ ఖాతా వివరాలు
ఎస్‌బీఐ అకౌంట్‌ నంబర్‌ 37778643692, ఐఎఫ్‌ఎస్‌సీ: ఎస్‌బీఐఎన్‌0020966, శంకరపల్లి బ్రాంచ్‌. ఫోన్‌: 90008 24190, 96761 47611. 

మరిన్ని వార్తలు