ఉద్యమ మార్గదర్శి.. టీవీవీ

21 Jul, 2014 01:19 IST|Sakshi
ఉద్యమ మార్గదర్శి.. టీవీవీ

 నల్లగొండ కల్చరల్: తెలంగాణ ఉద్యమానికి మార్గదర్శిగా నిలిచింది తెలంగాణ విద్యావంతుల వేదిక (టీవీవీ) అని ఆ వేదిక రాష్ట్ర గౌరవాధ్యక్షుడు, తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫె సర్ కోదండరాం అన్నారు. ఆదివారం టీవీవీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని లయన్స్ భవన్‌లో నిర్వహించిన వేదిక దశాబ్ది ఉత్సవాలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. జిల్లాలో వేదిక ఆవిర్భవించి పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సంబురాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ పదేళ్లలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటూ వేదిక గమ్యాన్ని చేరుకుందన్నారు.
 
 చంద్రబాబు పరిపాలనలో, తెలంగాణ పేరెత్తాలంటే భయపడే పరిస్థితుల్లో దొంగతనంగా సమావేశాలు నిర్వహించుకోవాల్సి వచ్చేదన్నారు.  అప్పటికీ పోలీసులకు భయపడి, విద్యావంతులు కూడా రాని పరిస్థితుల్లో ప్రొఫెసర్ జయశంకర్‌సార్ మదిలో మెదిలిన ఆలోచన, ఉద్యమానికి మార్గదర్శకత్వం చేయాలనే పిలుపుతో కదలిక వచ్చి అతి కొద్దిమందితో టీవీవీ పురుడుపోసుకుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో సరిపోలేదని, ఇంకా సీమాంధ్రుల ఆర్థిక పెత్తనం పోలేదన్నారు. ఇన్నాళ్లూ కోల్పోయిన అస్థిత్వాన్ని తిరిగి నిర్మించుకోవాలని, గవర్నర్ పెత్తనం పట్ల అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరముందన్నారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడం, ప్రజల అవసరాలను ప్రభుత్వానికి తెలుపుతూ వారధిగా పనిచేయాలన్నారు.
 
 టీవీవీ రాష్ట్ర అధ్యక్షుడు మల్లేపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ భారతదేశ చరిత్రలో తెలంగాణ అస్థిత్వ పోరాటానికి ఒక ప్రత్యేకత ఉందన్నారు. ఒక బలమైన రాచరికపు వ్యవస్థను కూలదోసి ప్రజాస్వామ్యానికి పట్టంగట్టిన పోరాట చరిత్ర తెలంగాణ ప్రజలదన్నారు. సీమాంధ్రుల పాలనలో ఉద్యోగాలు, నిధులు నీళ్లు కొల్లగొట్టారని, ఆ ఆక్రోశంలోనుంచి పుట్టిన ఉద్యమ ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం అందివచ్చిందన్నారు. ఆశించిన మేరకు ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా తెలంగాణ పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మన ప్రభుత్వమైనా సరే తప్పు జరిగితే నిర్భయంగా ఎత్తిచూపుతామని, ఆ దిశగానే టీవీవీ పనిచేస్తుందన్నారు. జిల్లా అధ్యక్షుడు కె.ధర్మార్జున్ మాట్లాడుతూ 2004లో పులిచింతల ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ మొదటిసారిగా కోదాడలో జిల్లా టీవీవీ నిర్మాణం జరిగిందన్నారు.
 
 రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన ప్రతి పిలుపును అందుకుని ఉద్యమాన్ని ఉరకలేయించామన్నారు. టీవీవీ బాధ్యులు వేణు సంకోజు, జి.వెంకటేశ్వర్లు, పందుల సైదులు, ఆర్.విజయ్‌కుమార్, అంబటి నాగయ్య, చిన్న, తిప్పర్తి యాదయ్య ప్రసంగించారు. అంతకుముందు ప్రొఫెసర్ కోదాండరాం టీవీవీ జెండా ఆవిష్కరించారు.ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు గోలి అమరేందర్‌రెడ్డి, అడ్వకేట్ డి.అమరేందర్‌రావు, తెలంగాణ రచయితల సంఘం జిల్లా అధ్యక్షుడు అంబటి వెంకన్న, జవహర్‌లాల్, సోమమల్లయ్య, పి.మధుసూదన్‌రావు, వేముల యల్లయ్య, దేవేందర్, లీల పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు