హక్కుల కోసం ఉద్యమించాలి

19 Feb, 2018 02:23 IST|Sakshi

కురుమలకు ఆర్‌.కృష్ణయ్య పిలుపు

కందుకూరు: కురుమ కులస్తులు ఐక్యంగా ఉండి హక్కులను సాధించుకుని రాజ్యాధికారం వైపు అడుగులు వేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్‌.కృష్ణయ్య పిలుపునిచ్చారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా కందుకూరులో కురుమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎగ్గిడి సత్తయ్య అధ్యక్షతన జరిగిన సంఘం మహాసభలో ఆయన మాట్లా డారు.

కురుమ కులస్తులు తమ పిల్లల్ని బాగా చదివించాలని, చదువుతోనే అన్ని సాధ్యమవుతాయన్నారు. జనాభా దామాషా ప్రకారం విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో న్యాయమైన వాటా కోసం పోరాడాలన్నారు. పోరాటాల ఫలితంగానే తెలుగు రాష్ట్రాల్లో ఆరువేల వసతి గృహాలు, వెయ్యికి పైగా రెసిడెన్షియల్‌ పాఠశాలలు ఏర్పాటయ్యాయని, అర్హులకు ఉచితంగా చదువు అందుతోందన్నారు.  

కులాలను విభజించే కుట్ర: విమలక్క  
పాలక వర్గాలు కులాలను విభజించేందుకు కుటిల యత్నాలు చేస్తున్నాయని, అందరూ ఐక్యంగా ఉండి తిప్పికొట్టాలని తెలంగాణ యునైటెడ్‌ ఫ్రంట్‌ కన్వీనర్‌ విమలక్క అన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ పొలిట్‌ బ్యూరో సభ్యుడు దేవర మల్లప్ప కురుమ, బీసీ ఫ్రంట్‌ చైర్మన్‌ గొరిగె మల్లేశ్, సదానంద్, జూకంటి రవి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు