కెమెరా..యాక్షన్‌..

25 Jul, 2018 11:45 IST|Sakshi
చిత్రీకరణ దృశ్యం (ఫైల్‌) 

రెండు సినిమా, బతుకమ్మ పాటల చిత్రీకరణ

గోదావరి బ్రిడ్జి వద్ద పాటల షూటింగ్‌

జలపాతానికి పెరుగుతున్నపర్యాటకులు

వాజేడు జయశంకర్‌ జిల్లా : బొగత జలపాతం అందాలు ఇంత వరకు పర్యాటకులకే సొంతమయ్యాయి. ఇప్పుడు సినిమా షూటింగ్‌ల పుణ్యమా అని ప్రంపంచవ్యాప్తంగా వెండితెర, బుల్లితెరలమీద దర్శమిస్తున్నాయి. సినిమా హాల్లో, టీవీల్లో బొగత సోయగాలను చూసి ప్రేక్షకులు స్వయంగా స్పాట్‌కు వెళ్లాలని తహతహలాడుతున్నారు.

ఈ జలపాతం జయశంర్‌ భూపాలపల్లి జిల్లా వాజేడు చీకుపల్లి అడవి ప్రాంతంలో ఉంది. చుట్టూ పచ్చని చెట్లు, ఎత్తైన కొండలు, జాలువారే జలపాతం అందాలను చూసి తరించాల్సిందే. జలపాతం వద్ద ఇప్పటికే  సినిమా పాటలతో పాటు బతుకమ్మ పాటలను చిత్రీకరించారు.అయితే గతంలో జలపాతం వద్ద సినిమాలు చిత్రీకరించడానికి కొందరూ టెక్నీషియన్లు వచ్చారు.

హైదరాబాద్‌ నుంచి భద్రాచలం మీదుగా చుట్టూ తిరిగి రావడానికి విముఖత వ్యక్తం చేసి ఇక్కడ షూటింగ్‌లను విరమించుకున్నారు. పూసూరు–ముల్లకట్ట వద్ద గోదావరిపై బ్రిడ్జి నిర్మాణం చేకపట్టడంతో జలపాతం వద్ద సినిమాల చిత్రీకరణకు మార్గం సులువైంది. దీంతో ఇక్కడ షూటింగ్‌ తీయడానికిసినిమా వాళ్లు ఉత్సాహం చూపుతున్నారు.

విదేశీయులు రాక..

ఇప్పటికే ఉమ్మడి వరంగల్‌ జిల్లా వాసులకు సుపరిచితమైన బొగత జలపాతం. సినిమా షూటింగ్‌లతో ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులను సంపాదించుకుంది. ఇటీవల కురిసిన వర్షాలతో జాలు వారుతున్న జలపాతంలో సేదతీరడానికి రాష్ట్రంతో పాటు పక్క రాష్ట్రాల పర్యాకులు విచ్చేస్తున్నారు. అంతేకాకుండా విదేశీ పర్యాటకులు సైతం వచ్చి బొగత అందాలను తనివితీరా ఆస్వాదించి తమ కెమెరాల్లో బంధించుకున్నారు. రోజురోజుకూ పర్యాటకుల రద్దీ పెరుగుతోంది.

జలపాతం వద్ద బతుకమ్మ పాట..

గత సంవత్సరం బొగత జలపాతం వద్ద రెండు సినిమా పాటలు, రెండు బతుకమ్మ పాటలను చిత్రీకరించారు. అనువంశీల ప్రేమ కథ, సరోవరం చిత్రాల్లో పాటలను ఇక్కడ చిత్రీకరించారు. ఆ తర్వాత  దసరా పండుగ సమయంలో బతుకమ్మపై టీవీ యాంకర్‌ మంగ్లీతో ఒక పాటను, మరో బతుకమ్మ పాటను గ్రూపుగా చిత్రీకరించారు. ఈ ఏడాది జూన్‌  నెలలో సావిత్రీ సీరియల్‌ లోని ఒక ఎపిసోడ్‌ సైతం చిత్రీకరించారు.

దీంతో బొగత సినిమా, సీరియళ్ల చిత్రీకరణకు అనువైన ప్రదేశంగా ఉంది. చిన్న సినిమాలు తీసే డైరెక్టర్లు  జలపాతాన్ని ఎంచుకుంటున్నారు.గోదావరి బ్రిడ్జి వద్ద..సినిమాల్లో గోదావరికి సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించాలంటే రాజమండ్రి, పాపికొండలు లాంటి ప్రదేశాలను ఎంచుకునే వారు. ఇప్పుడు ఆ పరిస్థితి మారింది.

వాజేడు మండల కేంద్రానికి మూడు కిలో మీటర్ల దూరంలోని పూసూరు వద్ద గోదావరిపై బ్రిడ్జి నిర్మాణం జరుగడం, బొగత జలపాతం అందుబాటులో ఉండటంతో సినిమా వాళ్లు ఇక్కడ షూటింగ్‌పై దృష్టి సారిస్తున్నారు. గత ఏడాది బొగత జలపాతం వద్ద అనువంశీల ప్రేమ కథ సినిమాలో పాటను చిత్రీకరించిన సమయంలో గోదావరి వద్ద కూడా పాటను చిత్రీకరించారు.

మరిన్ని వార్తలు