సినిమా ఆగింది

3 Mar, 2018 02:52 IST|Sakshi
బోసిపోయిన ఐమాక్స్‌

నగరంలో మూతపడిన సినిమా థియేటర్లు

డిజిటల్‌ ప్రొవైడర్‌ చార్జీల పెంపునకు వ్యతిరేకంగా బంద్‌

మద్దతు తెలిపిన థియేటర్లు, మల్టీప్లెక్స్‌ల యాజమాన్యాలు

గ్రేటర్‌లోని సుమారు 200 థియేటర్లలో నిలిచిన ప్రదర్శనలు

బోసిపోయిన ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, ఐమాక్స్, కూకట్‌పల్లి, దిల్‌సుఖ్‌నగర్‌  

సాక్షి, హైదరాబాద్‌: ప్రతి శుక్రవారం కొత్త సినిమాలతో కళకళలాడే థియేటర్లు బోసిపోయాయి. సినిమా థియేటర్ల యజమానులు బంద్‌ పాటించడంతో గ్రేటర్‌ హైదరాబాద్‌లో సినిమా ఆగిపోయింది. దక్షిణాది రాష్ట్రాల్లో భారంగా మారిన డిజిటల్‌ కంటెంట్‌ ప్రొవైడర్స్‌ చార్జీలకు వ్యతిరేకంగా చేపట్టిన ఈ బంద్‌ కారణంగా.. నగరంలోని సుమారు 200 సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్‌ల్లో ప్రదర్శనలు నిలిపేశారు. వీపీఎఫ్‌ క్రమంగా ఎత్తేయాలని, విరామ సమయంలో ప్రదర్శించే రెండు ప్రకటనలను సినిమా పరిశ్రమకు ఇవ్వాలనే డిమాండ్‌తో పంపిణీదారులు, ప్రదర్శనకారులు, నిర్మాతలు నిరవధిక బంద్‌కు దిగారు. దక్షిణ భారత సినీ పరిశ్రమ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన బంద్‌కు థియేటర్లు సంపూర్ణ మద్దతునివ్వడంతో ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్, దిల్‌సుఖ్‌నగర్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, కూకట్‌పల్లి, కొత్తపేట్, సరూర్‌నగర్, బంజారాహిల్స్, అమీర్‌పేట్, పంజగుట్ట తదితర ప్రాంతాల్లోని థియేటర్లు, మల్టీప్లెక్స్‌లు మూతపడ్డాయి. నిత్యం సందర్శకులు, ప్రేక్షకులతో కళకళలాడే నెక్లెస్‌ రోడ్‌ ఐమాక్స్, ఆర్‌టీసీ క్రాస్‌ రోడ్‌లోని థియేటర్లలో ప్రదర్శనలు నిలిపేయడంతో బోసిపోయాయి. పలు థియేటర్ల వద్ద ప్రదర్శనలు నిలిపేస్తున్నట్లు బోర్డులు ఏర్పాటు చేశారు. శుక్రవారం హోలీ సందర్భంగా సెలవు కావడంతో మధ్యాహ్నం వరకు రంగుల్లో మునిగితేలిన యువత.. సాయంత్రం సినిమాకు వెళ్లే అవకాశం లేకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యింది. థియేటర్లకు సమీపంలోని హోటళ్లు, చాట్‌ భండార్లు, టీ, జ్యూస్‌ సెంటర్లు, పాన్‌డబ్బాలు బోసిపోయి కన్పించాయి.

జేఏసీ నిర్ణయం మేరకే..
సౌత్‌ ఇండియన్‌ ఫిలిం ఇండస్ట్రీ జేఏసీ నిర్ణయం మేరకే థియేటర్లను మూసివేశాం. వారం పాటు థియేటర్లు మూసేసినా మేము సిబ్బందికి వేతనాలు ఇవ్వాల్సిందే. సర్వీస్‌ ప్రొవైడర్లు రేట్లు తగ్గిస్తే జేఏసీ నిర్ణయం మేరకు థియేటర్లను మళ్లీ తెరిచేందుకు అవకాశం ఉంటుంది.  – రామారావు, సంధ్య 70 ఎంఎం థియేటర్‌ మేనేజర్‌

వీకెండ్‌లో వినోదం కోల్పోయాం..
శుక్రవారం హోలీ, శని, ఆదివారాల్లో సెలవు రావడంతో కుటుంబా లు, స్నేహితులతో కల సి థియేటర్లలో సినిమా కు వెళదామనుకున్నాం. కానీ మాలాంటి వారికి బంద్‌ వల్ల నిరాశే ఎదురైంది. వీకెండ్‌లో వినోదం కోల్పోయాం.   – కె.వంశీకృష్ణ, ప్రేక్షకుడు

>
మరిన్ని వార్తలు