రైల్వే స్టేషన్లలో సినిమాలు!

16 Dec, 2018 02:37 IST|Sakshi

మినీ మొబైల్‌ థియేటర్లు ఏర్పాటుచేసిన ద.మ.రైల్వే

సాక్షి, హైదరాబాద్‌: ప్రయాణికులకు అత్యున్నత ప్రయాణ అను భవం కలిగించేందుకు భారతీయ రైల్వే పలు కార్యక్రమాలు రూపొందించింది. ఇందులోభాగంగా వేచిఉండే ప్రయాణికులకు ఉచిత వై–ఫై సౌకర్యాన్ని అందించిన దక్షిణ మధ్య రైల్వే, ఇపుడు స్టేషన్‌ పరిసరాల్లో ప్రయాణికులకు సినిమా వినోదం అందించేందుకు కూడా సిద్ధమైంది. తెలంగాణ, ఏపీల్లో 8 మొబైల్‌ థియేటర్లను ప్రారంభించింది. 

ఎక్కడెక్కడ..  
ప్రయాణికులకోసం మొత్తం 8 థియేటర్లు అందుబాటులోకి తీసుకువచ్చింది దక్షిణ మధ్య రైల్వే. పిక్చర్‌ టైమ్‌ పేరుతో ప్రారంభమైన ఈ మొబైల్‌ సినిమాహాళ్లు నగరంలో కాచిగూడ, మల్కాజిగిరి, బొల్లారం, కామారెడ్డి, మహబూబ్‌నగర్, బాసర, ఏపీలోని కర్నూల్‌ సిటీలోని రైల్వేస్టేషన్లలో వీటిని ఏర్పాటు చేశారు. ఈ సినిమా థియేటర్లు నిజంగా ప్రత్యేకమైనవే. భారతీయ రైల్వే చరిత్రలోనే ప్రత్యేకంగా నిలిచిన ఈ థియేటర్లు శుక్రవారం నుంచి అధికారికంగా పనిచేస్తున్నాయి. ఇందులో తెలుగు, హిందీ సినిమాలు ప్రదర్శిస్తున్నారు. 

ప్రత్యేకతలేంటి? 
పిక్చర్‌ టైమ్‌ సంస్థతో దేశంలోనే ఇలాంటి సదుపాయాన్ని మొదటిసారిగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నడిపిస్తుండటం విశేషం. వీటిలో సినిమాలు, విద్యా, ప్రభుత్వ సంబంధ కార్యక్రమాలను ప్రదర్శిస్తారు. ఒక డిజిటల్‌ స్క్రీన్, 5.1 డాల్బీ సౌండ్‌ సిస్టం, 120 నుంచి 150 సీట్ల సామర్థ్యం ఈ థియేటర్ల ప్రత్యేకత. వీటిని ఎక్కడికంటే అక్కడికి తరలించుకుపోయే సదుపాయం ఉంది. కావాల్సినచోట వీటిలో ఉండే ప్లాస్టిక్‌ గోడలను అప్పటికప్పుడు నిలబెట్టే సాంకేతికత ఉంది. అందువల్ల తిరునాళ్లు, జాతరలు జరిగే చోట ఈ థియేటర్లు సందడి చేయనున్నాయి. అంతేకాదు, మారుమూల పల్లెలు, సినిమాహాళ్లకు దూరంగా ఉన్న టౌన్‌షిప్పులు, శివారు ప్రాంతాలకూ ఇవి భవిష్యత్తులో విస్తరించనున్నాయి. ఇందులో పాత సినిమాలు వేస్తారనుకుంటే తప్పే. ఇది కేవలం పరిమాణంలో మాత్రమే చిన్నగా ఉంటుంది. ఇప్పటికే ఈ థియేటర్లలో రోబో 2.0, థగ్స్‌ ఆఫ్‌ హిందుస్తాన్‌ తదితర సినిమాలు ప్రదర్శితమవుతున్నాయి. టికెట్‌ ధర కూడా సామాన్యులకు అందుబాటులోనే ఉంటుందంటున్నారు నిర్వాహకులు. 

గిరిజన ప్రాంతాల్లో కీలకం.. 
ఈ థియేటర్లు భవిష్యత్తులో గిరిజన, మారుమూల ప్రాంతాల్లో కీలక పాత్ర పోషించే అవకాశాలున్నాయి. ముఖ్యంగా నైపుణ్యాభివృద్ధికి, తాగునీరు, పరిశుభ్రత ప్రాధాన్యం వివరించేందుకు, అంటువ్యాధులు, బాల్యవివాహాలు వంటి సామాజిక రుగ్మతలపై అవగాహన కల్పించేందుకు ఈ మొబైల్‌ థియేటర్లు చాలా కీలకం కానున్నాయి. 

మరిన్ని వార్తలు