నడిచే కారులో అకస్మాత్తుగా మంటలు

23 Aug, 2019 10:46 IST|Sakshi
పెద్దపల్లిలో మంటలకు దగ్ధమవుతున్న కారు

సాక్షి, పెద్దపల్లిరూరల్‌: నడుస్తున్న కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి వాహనం పూర్తిగా దగ్ధమైంది. ఈ సంఘటన పెద్దపల్లి జిల్లా కేంద్రంలో గురువారం జరిగింది. వివరాలు.. మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం మందంపల్లికి చెందిన సిద్ధం నానయ్యకు కాలు విరగడంతో కొద్దిరోజుల క్రితం హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స చేయించేందుకు అతని భార్య మల్లక్క, కొడుకు మల్లేశ్‌తో కలసి వారి సొంత కారు ఏపీ 30ఏ3880లో వెళ్లారు. చికిత్స అనంతరం గురువారం హైదరాబాద్‌ నుంచి ఇంటికి బయల్దేరారు. మల్లేశ్‌ నడుపుతున్న కారులో నానయ్య, మల్లక్క ప్రయాణం చేస్తున్నారు.

పెద్దపల్లి సమీపంలోని కల్వల క్యాంపు దాటుతున్న సమయంలో కారు ఇంజిన్‌లో నుంచి ఒక్కసారిగా పొగలు రావడాన్ని గమనించిన మల్లేశ్‌.. వెంటనే కారును రోడ్డుపై నిలిపి తల్లి మల్లక్క సహయంతో తండ్రి నానయ్యను కిందకు దించారు. కారును రోడ్డు పక్కన ఆపేందుకు మల్లేశ్‌ ప్రయత్నిస్తున్న సమయంలోనే మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. దీంతో కారును వదిలేసి మల్లేశ్‌ చాకచక్యంగా వ్యవహరించడం వల్లే అందరూ ప్రాణాలతో బయటపడ్డారు. రాజీవ్‌రహదారిపై మంటల్లో కారు కాలిపోతుండటంతో ట్రాఫిక్‌ నిలిచిపోయింది. పెద్దపల్లి అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. అప్పటికే కారు పూర్తిగా కాలిపోయింది. పోలీసులు వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు