కాకతీయ వైభవం ‘మట్టి’పాలు!

9 Feb, 2017 00:49 IST|Sakshi
కాకతీయ వైభవం ‘మట్టి’పాలు!
  • అక్రమాలకు ‘చిక్కి’పోతున్న మట్టికోటలు
  • నిర్మాణాలకు తరలుతున్న మట్టి
  • పట్టించుకోని అధికారులు
  • సాక్షి, వరంగల్‌: చారిత్రక ప్రసిద్ధి పొందిన కాకతీయుల కోట భవిష్యత్తు తరాలకు కనిపించకుండా పోతుందా..? ఓరుగల్లును రాజధానిగా చేసుకొన్న కాకతీయుల గురించి.. వారు శత్రుదుర్భేద్యంగా నాడు నిర్మించిన ఏడు వరుసల కోట గురించే పుస్తకాల్లో మాత్రమే చదువుకోగలమా? అన్న ప్రశ్నలకు అవుననే సమాధానమే వస్తోంది. ప్రభుత్వం పట్టించుకోకపోవడం.. అధికారులు మనకెందుకులే అని మిన్నకుండటం.. ఇదే అదనుగా కోటను తవ్వేస్తుండటంతో రానున్న రోజుల్లో కాకతీయుల కోట కాలగర్భంలో కలసి పోనుంది. చారిత్రక నిర్మాణాలను పరిరక్షించి.. భావితరాలకు అందించేందుకు కేంద్రం హృదయ్‌ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకానికి కాకతీయుల రాజధానిగా ఉన్న వరంగల్‌ను ఎంపిక చేసింది.

    చారిత్రక కట్టడాలను పరిరక్షించడం కోసం రూ. కోట్లు కేటాయిస్తోంది. ఈ నిధులతో చారిత్రక కట్టడాల పరిరక్షణ జరగాల్సి ఉంది. అయితే, ఇక్కడ కాకతీయుల ప్రాచీన కట్టడాలను అక్రమార్కులు వదలడం లేదు. నిర్మాణ రంగ అవసరాల కోసం పురాతన కోటలను తవ్వి మట్టి తీసుకెళ్తున్నారు. ఇదే అదనుగా ప్రభుత్వ రోడ్ల నిర్మాణ పనులు చేస్తున్న పలువురు కాంట్రాక్టర్లు సైతం కాకతీయ మట్టి కోటలను పెద్ద పెద్ద ప్రొక్లెయిన్లతో తవ్వేస్తున్నారు. కాకతీయుల రాజధాని ఓరుగల్లు రక్షణ కోసం.. ఈ నగరం చుట్టూ అప్పట్లోనే ఏడు వరుసలుగా కోటలు నిర్మించారు. ఒకటి తప్ప మిగతా అన్నింటినీ మట్టితోనే నిర్మిం చారు. ఇపుడీ మట్టికోటలన్నీ దాదాపుగా లేకుండా పోయాయి. కాకతీయుల చారిత్రక కట్టడాలు, శిల్ప సంపదను కేంద్ర పురావస్తుశాఖ పర్యవేక్షిస్తోంది.

    చారిత్రక ప్రదేశాలు, కోటలకు వందమీటర్ల దూరం వరకు నిషేధిత ప్రాంతంగా పరిగణిస్తోంది. కాకతీయుల ప్రధాన రాతికోట చుట్టూ ఉన్న ఇతర కోటలు పురావస్తు శాఖ అధీనంలో లేవు. దీంతో ఇష్టారాజ్యంగా వాటిని తవ్వేస్తున్నారు. వరంగల్‌(ఓరుగల్లు) నగరం చుట్టూ ఉన్న మామునూరు, బొల్లికుంట, కోట వెంకటాపురం, వంచనగిరి, ధర్మారం, మొగిలిచర్ల, ఆరెపల్లి, పెద్దమ్మగడ్డ, పద్మాక్షీ ఆలయాల ప్రాంతాల మీదుగా అల్లిపురం వరకు ఉన్న మట్టికోటలు ఆనవాళ్లు లేకుండా పోతున్నాయి.

    కోటల నిర్మాణం తీరు ఇదీ...
    రాతికోట: ఓరుగల్లు నగరంతో పాటే ఈ కోటను గ్రానైట్‌ రాయితో నిర్మించారు. మీటరు పొడవు, మీటరు వెడల్పు, 12 కి.మీ. పొడవుతో ఓరుగల్లు నగరం చుట్టూ ఈ కట్టడం ఉంది. ఈ రాతికోటకు 77 బురుజులను, 4 వైపులా ప్రధాన ద్వారాలను ఏర్పాటు చేశారు. ప్రతి ద్వారానికి ఎదురుగా అర్ధ చంద్రాకారపు రక్షణ కోట కన్పిస్తుంది.
    కందకం: రాతికోట చుట్టూ లోతైన కందకం (అగడ్త) ఉంది. ఈ అగడ్తలో అన్ని కాలాల్లోనూ నీరు ఉండేలా నిర్మించారు. కాకతీయులు నిర్మించిన చెరువుల నుంచి నీరు అగడ్తలలోకి, కోట లోపల తోటల్లోకి ప్రవహించేలా ఏర్పాటు చేశారు. శుత్రువుల దాడిని ఎదుర్కునేందుకు అగడ్తలో మొసళ్లను పెంచేవారట.
    భూమికోట: రాతికోట వెలుపల అగడ్త దాటిన తరువాత మట్టికోటను నిర్మించారు. రాతిగోడకు మట్టికోటకు మధ్య సామాన్య ప్రజల ఇళ్లు ఉండేవట. దీన్నే భూమికోట అనేవారట. 10 మీటర్ల ఎత్తున్న ఈ మట్టికోట ఇప్పటికీ చెక్కుచెదరలేదు. ఈ కోట గోడను 12,546 అడుగుల వైశాల్యంతో నిర్మించారు.
    కంపకోట: మట్టికోట వెలుపల కంపకోట ఉండేది. కంప మొక్కలను నాటి దీన్ని ఏర్పాటు చేశారు. శత్రు సైనికులు ఈ కంపను దాటిరావడంలో కొంత ఆలస్యమవుతుంది. ఈ సమయంలో వాళ్లను నిలువరించడానికి కంపకు నిప్పు పెట్టడం అనే యుద్ధ నైపుణ్యాన్ని ప్రదర్శించేవారని చరిత్రకారులు చెబుతారు.
    పుట్టకోట: కంపకోటకు ఆనుకుని పుట్టకోట ఉండేది. పుట్టకోటను మట్టి ఇటుకలతో నిర్మించారని పురావస్తు శాఖ పరిశోధనలు చెబుతున్నాయి. ప్రస్తుతం కంపకోట, పుట్టకోట ఆనవాళ్లేవీ కనిపించడం లేదు.
    మట్టికోట: ఇది ఐదు మీటర్ల ఎత్తులో ఉండేది. 30 కిలోమీటర్ల విస్తీర్ణంలో నిర్మించారు. ప్రస్తుత వరంగల్‌ శివారు ప్రాంతాలను చుడుతూ, 8 ద్వారాలతో, చుట్టూ నీటి కందకాలతో దీన్ని నిర్మించారు.
    కంచుకోట: ఓరుగల్లు కోట మధ్యలో ఏకశిల ఉండేదని, దీని పేరుతోనే ఏకశిలాపురం అని పిలిచేవారని పురావస్తు నిఫుణులు చెబుతున్నారు. కాకతీయుల కోటపై శత్రువుల దండయాత్ర జరిగితే చిట్టచివరిగా రక్షణ స్థావరంగా దీన్ని ఉపయోగించుకునేవారని, దీని కోసం పెద్ద కొండరాయిపై నిర్మాణాలు చేశారని చెబుతారు. ప్రస్తుతం దీని ఆనవాళ్లేవీ కనిపించవు.
    మా పరిధిలో లేవు: కాకతీయ కోటలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పర్యవేక్షణలో ఉన్నాయని కేంద్ర పురా వస్తు శాఖ పరిరక్షణ అధికారి ఎం. మల్లేశం చెప్పారు. కోట చుట్టూ ఏడు వరుసల్లో ఉన్న కోటల పరిరక్షణ కోసం ప్రభుత్వాలకు నివేదించామన్నారు. వాటిని తమ పరిధిలోకి ఇవ్వాలని కోరామన్నారు.

మరిన్ని వార్తలు