‘వారిని బొంద పెట్టడం ఖాయం’

13 Sep, 2017 20:34 IST|Sakshi
‘వారిని బొంద పెట్టడం ఖాయం’

హైదరాబాద్‌: రైతు రాజుగా బతకాలన్న ధ్యేయంతో సీఎం కేసీఆర్‌ రైతాంగ సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారని పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్‌ తెలిపారు.  రైతు సమన్వయ సమితులను రాబందుల్లా అడ్డుకునేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ఆయన మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌ ఎల్పీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

ప్రతీ దానికి కోర్టు గుమ్మం తొక్కడం విపక్షాలకు పరిపాటిగా మారిందని, రైతు సమన్వయ సమితులపై పిటిషనర్లకు చివాట్లు పెట్టినా విపక్ష నేతలు  సిగ్గు లేకుండా గవర్నర్‌ కలిశారని మండిపడ్డారు. రైతు సమన్వయ సమితుల్లో సామాజిక న్యాయం పాటించామని, ఒక్కసారి జీవో 39 మళ్లీ చదువుకుంటే విపక్షాలకు మంచిదని హితవు పలికారు. అసంఘటితంగా ఉన్న రైతులను సంఘటితం చేసేందుకు రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేస్తున్నామని ఆయన అన్నారు.

వీటి ఏర్పాటు తర్వాత ఒక్క రైతు కూడా తమ వెంట రారనే భయంతోనే విపక్షాలు అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. సింగరేణిలో కలిసి పోటీ చేస్తామని కాంగ్రెస్‌, టీడీపీ, లెఫ్ట్‌ అనుబంధ సంఘాలు ప్రకటించడం రాజకీయ వ్యభిచారమేనని, ఇది కిచిడి కూటమి అని, వారి పప్పులు సింగరేణిలో ఉడకవని అన్నారు. సింగరేణి ఎన్నికలతోనే విపక్షాల పతనానికి నాంది అవుతుందని, వీరిని సింగరేణి బొందల గడ్డలో కార్మికులు బొంద పెట్టడం ఖాయమని ఆయన అన్నారు. మిషన్‌ భగీరథలాగే రైతు సమన్వయ సమితులు దేశానికి రోల్‌ మోడల్‌ కావడం ఖాయమని సుమన్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు