‘టి​కెట్ల’ సందడి షురూ..

13 Mar, 2019 12:23 IST|Sakshi

నాగర్‌కర్నూల్‌ లోక్‌సభ టికెట్‌పై ఉత్కంఠ

కాంగ్రెస్‌ పార్టీ నుంచి పలువురు పోటాపోటీ

స్థానికులకే ఇవ్వాలని కాంగ్రెస్‌ నాయకుల ఆందోళనలు

సాక్షి, నాగర్‌కర్నూల్‌: లోక్‌సభ ఎన్నికలకు షెడ్యూల్‌ రావడంతో రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు వేగవంతం చేశాయి. ప్రధాన పార్టీలకు చెందిన ఆశావహులు తమ యత్నాలను ముమ్మరం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయాన్ని సొంతం చేసుకుని సత్తా చాటిన టీఆర్‌ఎస్‌ నాగర్‌కర్నూల్‌ ఎంపీ స్థానాన్ని సైతం తన ఖాతాలో వేసుకోవాలన్న లక్ష్యంతో ముందుకెళుతోంది.

అభ్యర్థి ఎంపిక విషయంలోనూ ఆచితూచి అడుగులు వేస్తోంది. అలాగే మూడు పర్యాయాలు వరుసగా విజయఢంకా మోగిస్తున్న కాంగ్రెస్‌ పార్టీ ఈసారీ తన ఖాతాలోనే జమ చేసుకోవాలని చూస్తోంది. అభ్యర్థిగా పోటీ చేయాలనుకునే ఆశావహులు అధికంగా ఉండటంతో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది.

రెండు, మూడు రోజులుగా సంపత్‌కుమార్, మల్లు రవి, సతీష్‌మాదిగల పేర్లు వినపడగా తాజాగా తెరపైకి మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ వచ్చారు. అభ్యర్థుల ఎంపికకు కాంగ్రెస్‌ అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఈ నియోజకవర్గానికి 14సార్లు ఎన్నికలు జరిగితే కేవలం రెండుసార్లు మాత్రమే స్థానికులకు అవకాశం వచ్చింది. మిగతా 12సార్లు స్థానికేతరులకే పార్టీలు అవకాశం కల్పించాయి.

ఈసారి స్థానికులకే టికెట్లు కేటాయించాలనే డిమాండ్లు పెరిగాయి. ప్రధాన పార్టీలు ఎవరిని అభ్యర్థులుగా నిలుపుతారనేది ఉత్కంఠ నెలకొంది. ఒకవైపు కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ఎంపిక విషయంలో కసరత్తు చేస్తుండగా బీజేపీ, ఇతర పార్టీలకు సంబంధించి ఎలాంటి హడావుడి కనిపించడం లేదు.

సత్తా చాటేందుకు టీఆర్‌ఎస్‌ సిద్ధం

ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో నాగర్‌కర్నూల్‌ ఎంపీ పరిధిలోని ఏడింటికిగాను ఆరు నియోజకవర్గాల్లో గులాబీ జెండాను ఎగురవేసి టీఆర్‌ఎస్‌ మంచి జోష్‌లో ఉంది. ప్రస్తుత పార్లమెంట్‌ ఎన్నికల్లోనూ తన సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. అందులో భాగంగానే ఈనెల 9న నాయకులు, కార్యకర్తలతో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ సారథ్యంలో సన్నాహక సమావేశం నిర్వహించారు.

టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ ఇప్పటికే అభ్యర్థుల ఎంపికకు కసరత్తు ప్రారంభించారు. వివిధ సర్వేలు చేయించి అభ్యర్థి విషయంలో స్పష్టతకు వచ్చినట్టు సమాచారం. మాజీ మంత్రి పోతుగంటి రాములు లేదా ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మందా జగన్నాథం లేదా గాయకుడు సాయిచంద్‌ను బరిలో నిలపాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. అయితే మూడు పర్యాయాలుగా ఇక్కడ టీఆర్‌ఎస్‌ విజయం సాధించలేకపోయింది. ఈసారి ఎలాగైనా పాగా వేయాలనే దిశగా ప్రణాళికలు రచిస్తున్నారు. 

వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్‌

ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లోనూ విజయం సాధిం చాలని కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్న ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. 36మంది దరఖాస్తులు చేసుకోగా ఐదుగురి పేర్లను మాత్రం ఏఐసీసీకి పంపినట్టు సమాచా రం. ముఖ్యంగా సతీష్‌మాదిగ, మల్లు రవి, మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ పేర్లు వినిపిం చాయి.

తాజాగా మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజ నర్సింహ పేరు తెరమీదికి వచ్చింది. వీరిలో ఎవరు బరిలో ఉంటారనేది త్వరలో తేలనుంది. నాగర్‌కర్నూల్‌ ఎంపీ పరిధిలోని ఏడు అ సెంబ్లీ నియోజకవర్గాల్లో కేవలం కొల్లాపూర్‌లో మాత్రమే ఇటీవల కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించడం గమనార్హం.

స్థానికేతరులే అత్యధికం 

1962 నుంచి 2014 వరకు 14సార్లు జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీలుగా గెలిచిన వారిలో పార్టీలకతీతంగా స్థానికేతరులే ఎక్కువగా ఉన్నారు. వీరిలో రాజారామేశ్వర్‌రావు (వనపర్తి), ముత్యాలరావు (తిరుమలగిరి), భీమ్షాదేవ్‌ (హైదరాబాద్‌), మల్లు అనంతరాములు (వైరా మండలం–ఖమ్మం), మల్లు రవి (వైరా మండలం–ఖమ్మం), మందా జగన్నాథం (ఇటిక్యాల మండలం–అలంపూర్‌), నంది ఎల్లయ్య (మెదక్‌ జిల్లా) ఉన్నారు.

కేవలం మందా జగన్నాథం మాత్రమే స్థానికుడు. మిగతావారంతా స్థానికేతరులే. కాంగ్రెస్‌ పార్టీ ఇంతవరకు తొమ్మిది పర్యాయాలు విజయం సాధించగా టీపీఎస్‌ ఒకసారి, నాలుగు పర్యాయాలు టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు.

మరిన్ని వార్తలు