అంజలికి అండ 

4 Nov, 2017 02:46 IST|Sakshi
సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ వద్ధ అంజలికి రూ. లక్ష చెక్కును అందచేస్తున్న జాగృతి ప్రతినిధులు , సాక్షి దినపత్రికలో వచ్చిన కథనాన్ని చదువుతున్న అంజలి

సాక్షి కథనానికి అనూహ్య స్పందన

ఆదుకునేందుకు ముందుకొచ్చిన ఎంపీ కవిత

అంజలి పిల్లల పేరిట రూ.లక్ష ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌

గురుకుల పాఠశాలలో ప్రవేశం

 అంజలికి శాశ్వత ఉపాధికి ఏర్పాట్లు

ఆమెను పరామర్శించిన జాగృతి ప్రతినిధులు

‘సాక్షి’ రుణాన్ని ఎప్పటికీ తీర్చుకోలేను: అంజలి  

సాక్షి, హైదరాబాద్‌: ఏ ఆధారం లేక నిస్సహాయ స్థితిలో రోడ్డునపడి బిచ్చమెత్తుకుంటున్న దివ్యాంగురాలు అంజలికి అండ లభించింది. ఆమె ఉపాధికి, పిల్లల భవితవ్యానికి భరోసా దొరికింది. నగరంలో బిచ్చగాళ్ల దుస్థితి, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కూతురు ఇవాంకా ట్రంప్‌ రాక నేపథ్యంలో యాచకుల తరలింపు, ఈ క్రమంలో అంజలి దైన్యస్థితి తదితర పరిణామాలపై ‘సాక్షి’దినపత్రిక శుక్రవారం ప్రచురించిన ‘ఇవాంకా రావొద్దు’ప్రత్యేక కథనంతో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత చలించిపోయారు. అంజలిని అన్ని విధాలా ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. ఆమె ఇద్దరు కూతుళ్లు సిరి, కీర్తి పేరిట ఒక్కొక్కరికీ రూ.50 వేల చొప్పున బ్యాంకులో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసేందుకు ఏర్పాట్లు చేశారు.

ఎంపీ ఆదేశాల మేరకు తెలంగాణ జాగృతి ఉపాధ్యక్షుడు రాజీవ్‌ సాగర్, గ్రేటర్‌ కన్వీనర్‌ ప్రశాంత్, రైల్వే పోలీస్‌ డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్‌ తదితరులు శుక్రవారం సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ వద్ద అంజలిని కలిశారు. అంజలిని పరామర్శించిన ఆమె దయనీయమైన పరిస్థితులను గురించి అడిగి తెలుసుకున్నారు. తనను ఆదుకునేందుకు వచ్చిన జాగృతి నేతలను చూడగానే అంజలి కన్నీరుమున్నీరుగా విలపించింది. తన బాధలను, కష్టాలను వారికి ఏకరువు పెట్టింది. పిల్లలను చదివించేందుకు తాను పడుతున్న ఇబ్బందులను వారికి వివరించింది. కొద్దిరోజుల వరకు బిచ్చమెత్తుకున్న డబ్బులతో పిల్లల్ని పోషించానని, ఇప్పుడు బిచ్చగాళ్ల తరలింపుతో ఆ అవకాశం కూడా లేకుండాపోయిందని తెలియజేసింది. బరువు చూసుకునే మెషీన్‌ తెచ్చిపెట్టుకున్నప్పటికీ ఎలాంటి ఆదాయం లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. అంజలి వివరాలన్నీ తెలుసుకున్న రాజీవ్‌సాగర్‌ ఇక నుంచి భయపడవద్దని, ఎంపీ కవిత ఆమెకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందజేస్తారని చెప్పారు. ఎంపీ ఆదేశాల మేరకే తాము అంజలిని కలిసేందుకు వచ్చినట్లు చెప్పారు. ఈ మేరకు రూ.లక్ష చెక్కును కూడా అందజేశారు. త్వరలో ఆ డబ్బును ఆమె ఇద్దరు కూతుళ్లు సిరి, కీర్తి పేరిట ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయనున్నట్లు పేర్కొన్నారు. 

అంజలి ఉపాధికి కిరాణా దుకాణం.. 
పదో తరగతి వరకు చదువుకున్నప్పటికీ ఎలాంటి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేని అంజలికి జీడిమెట్లలోని తన నివాసానికి దగ్గర్లో ఆమె కోరుకున్న విధంగా కిరాణా షాపు పెట్టించి ఇవ్వనున్నట్లు రాజీవ్‌ తెలిపారు. ఎంపీ కవిత చేతుల మీదుగానే ఆ షాపును ఆమెకు అప్పగిస్తామన్నారు. ఆమె ఇద్దరు కూతుళ్లను ప్రభుత్వ గురుకుల పాఠశాలలో చేర్పించనున్నట్లు తెలిపారు. ఆమెకు ఏ బాధ, ఇబ్బంది కలిగినా తమను ఫోన్‌ ద్వారా సంప్రదించవచ్చని ఫోన్‌ నంబర్లు అందజేశారు. జాగృతి ప్రతినిధులతో పాటు పలువురు ప్రయాణికులు, ఇతరులు అంజలి దీనస్థితి పట్ల చలించిపోయారు. తమకు తోచిన విధంగా ఆర్థిక సహాయం అందజేశారు. కాగా, ‘సాక్షి’వల్లే తనకు ఇంత ఆర్థిక సాయం లభించిందని, సాక్షి రుణాన్ని తాను ఎప్పటికీ తీర్చుకోలేనని ఈ సందర్భంగా అంజలి పేర్కొంది. 

మరిన్ని వార్తలు