రిజర్వేషన్లు తీసేసే కుట్ర జరుగుతోంది : ఎంపీ కవిత

14 Apr, 2018 15:57 IST|Sakshi

రిజర్వేషన్లు ఎత్తేయాలని చూస్తున్నారు

ఎస్సీ ఎస్టీ చట్టంలో అక్షరం మార్చినా ఊరుకొనేది లేదు : ఎంపీ కవిత

సాక్షి, నిజామాబాద్‌ : ఎస్సీ-ఎస్టీ చట్టంలో ఒక్క కామా, ఫుల్‌స్టాప్‌ మార్చినా ఊరుకొనేది లేదని నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. భారత రాజ్యాంగ సృష్టికర్త బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ జయంతి సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాలను విభజించే అధికారం కేంద్రానికి ఇవ్వటంలో ఒక తార్కిక విధానం ఉందని, దాని గురించి అంబేద్కర్‌ అప్పుడే ఆలోచించారని పేర్కొన్నారు. మహిళ హక్కుల గురించి కూడా అప్పడే ఎంతో గొప్పగా ఆలోచించిన గొప్ప వ్యక్తి అంబేద్కర్‌ అని కొనియాడారు. తెలంగాణ ప్రభుత్వం అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తోందని, 

ఇప్పటి వరకూ తెలంగాణ ప్రభుత్వం 22,400 కోట్ల రూపాయలు దళితుల సంక్షేమం, ఉన్నతి కోసం ఖర్చు చేసిందని వెల్లడించారు. వారి అభివృద్ధికి కేటాయించిన నిధులను వారికే ఖర్చు చేస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుతం రిజర్వేషన్లు తీసేయడానికి కుట్ర జరుగుతోందని, ఎస్సీ ఎస్టీ చట్టంలో ఒక్క కామా, ఫుల్‌స్టాప్ కూడా మార్చినా ఊరుకునేది లేదని వ్యాఖ్యానించారు. ఇది దళితులతో ప్రారంభమైన ఇది తర్వాత అందరి విషయంలో ఇదే విధంగా కొనసాగుతుందని, ఎస్సీ ఎస్టీలకు ఇతర కులాలు, మతాల వారు కూడా బాసటగా నిలవాలని కవిత కోరారు.

మరిన్ని వార్తలు