ప్యాసింజర్‌ రైలును పునరుద్ధరించాలి

19 Jul, 2019 07:22 IST|Sakshi
రైల్వే శాఖ మంత్రికి వినతిపత్రం అందజేస్తున్న ఎంపీ మాలోత్‌ కవిత

కేంద్ర మంత్రికి ఎంపీ కవిత వినతి

ఇల్లెందు/కొత్తగూడెంఅర్బన్‌: ఇల్లెందు ప్యాసింజర్‌ రైలును పునరుద్ధరించాలని కోరుతూ కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్‌గోయల్‌ను మహబూబాబాద్‌ ఎంపీ మాలోత్‌ కవిత కలిసి వినతిపత్రం అందజేశారు. పార్లమెంట్‌ సమావేశాల సందర్భంగా ఢిల్లీలోని రైల్వేశాఖ కార్యాలయంలో మంత్రిని కలిసిన ఆమె.. మహబూబాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని రైల్వే సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఇల్లెందుకు ప్యాసింజర్‌ రైలు పునరుద్ధరణ కోసం స్థానిక  ఎమ్మెల్యే బానోత్‌ హరిప్రియ రెండు నెలలుగా కేంద్ర రైల్వే శాఖ దృష్టికి వినతిపత్రాలు అందించారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే కోరిక మేరకు ఎంపీ కవిత కూడా సమస్యను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఇల్లెందు నుంచి డోర్నకల్‌ జంక్షన్‌ను కలుపుతూ గతంలో కొనసాగిన రైలును పునరుద్ధరిస్తే ఈ ప్రాంత ప్రజలు కొత్తగూడెం, మణుగూరు, విజయవాడ, హైదరాబాద్, కాజీపేట, వరంగల్, బెల్లంపల్లి తదితర ప్రాంతాలకు వెళ్లేందుకు మార్గం సుగమం అవుతుందని మంత్రికి వివరించారు. అలాగే ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయిన భద్రాద్రి శ్రీసీతారామచంద్రస్వామి ఆలయానికి వచ్చిపోయే భక్తుల కోసం రైలు సౌకర్యం కల్పించాలని విన్నవించారు.  దీనికి మంత్రి పీయూష్‌గోయల్‌ స్పందిస్తూ సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని కవిత తెలిపారు. 

మరిన్ని వార్తలు