ఫోన్‌ కాల్‌ రచ్చ!

17 Nov, 2019 03:39 IST|Sakshi
ఎంపీ బండి సంజయ్, సర్ఫరాజ్‌ అహ్మద్‌

ఎంపీ సంజయ్, కలెక్టర్‌ సర్ఫరాజ్‌ సంభాషణ వైరల్‌ 

అసెంబ్లీ ఎన్నికల్లో ఓడాక కలెక్టర్‌కు సంజయ్‌ ఫోన్‌ 

మంత్రి కమలాకర్‌ ఎన్నికల ఖర్చుపై రాద్ధాంతం 

వైరల్‌ అయిన 1.30 నిమిషాల సంభాషణ 

సంజయ్‌కి కలెక్టర్‌ సహకారం, నన్ను డిస్‌క్వాలిఫై చేసే కుట్ర: గంగుల  

8 నిమిషాల సంభాషణ అది.. ఒరిజినల్‌ రికార్డ్‌ నా దగ్గరుంది: కలెక్టర్‌  

కేసు కోర్టులో ఉంది.. నేనేమీ మాట్లాడను : ఎంపీ సంజయ్‌ 

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్‌ నుంచి పోటీ చేసి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గంగుల కమలాకర్‌ చేతిలో ఓడిపోయిన బీజేపీ అభ్యర్థి, ప్రస్తుత ఎంపీ బండి సంజయ్‌ కలెక్టర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌తో జరిపిన సంభాషణ దాదాపు ఏడాది తరువాత రచ్చకెక్కింది. ఆ ఎన్నికల్లో కమిషన్‌ నిబంధనలకు విరుద్ధంగా కమలాకర్‌ పరిమితికి మించి ఖర్చు చేశారని కోర్టును ఆశ్రయించిన సంజయ్‌.. కలెక్టర్‌ సహకారం కోరినట్లుగా లీకైన ఆడియోలో ఉంది. కలెక్టర్‌ స్పష్టత లేని తెలుగులో మాట్లాడగా, సంజయ్‌ కలెక్టర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌కు కృతజ్ఞతలు తెలిపేందుకే ఎక్కువ సమయం కేటాయించారు. గంగుల పరిమితికి మించి ఎన్నికల్లో ఖర్చు చేసిన అంశం, దానికి సంబంధించిన పత్రాల సమర్పణ వంటి విషయాలే చర్చకు వచ్చినట్లుగా ఉంది. టేప్‌లో 1.30 నిమిషాల సంభాషణ ఉంది.

ఈ లీకైన ఆడియో టేపుపై మంత్రి గంగుల కమలాకర్‌ తీవ్రంగా స్పందించారు. తనను ఎన్నికల్లో ఓడించేందుకు మొదట కుట్ర చేశారని, అది సాధ్యం కాకపోవడంతో గెలిచిన తరువాత డిస్‌క్వాలిఫై చేసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. బండి సంజయ్‌ కలెక్టర్‌తో కలసి కుట్ర చేశారని ఆరోపించారు. రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్న కలెక్టర్‌ తనపై ఓడిపోయిన అభ్యర్థికి సహకరించే విధంగా ఫోన్‌లో మాట్లాడటాన్ని తప్పు పట్టారు. ఈ ఆడియో టేపుపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఫిర్యాదు చేస్తానని స్పష్టం చేశారు. కాగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కమలాకర్‌ పరిమితికి మించి ఎన్నికల్లో ఖర్చు చేశారని కోర్టును ఆశ్రయించినట్లు బండి సంజయ్‌ ‘సాక్షి’కి చెప్పారు. ఈ అంశం కోర్టులో ఉన్నందున లీకైన ఆడియో టేప్‌ గురించి తానేమీ మాట్లాడనని స్పష్టం చేశారు. సంజయ్‌తో జరిగిన సంభాషణకు లీకైన ఆడియో టేప్‌కు సంబంధం లేదని కలెక్టర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ స్పష్టం చేశారు. ఎనిమిది నిమిషాల తమ సంభాషణను కటింగ్, మిక్సింగ్‌ ద్వారా 1.30 నిమిషాలకు కుదించి వైరల్‌ చేశారని ఆయన పేర్కొన్నారు. ఒరిజినల్‌ ఆడియో టేప్‌ను ప్రభుత్వానికి పంపనున్నట్లు తెలిపారు.  

మల్లికార్జున్‌ ఫోన్‌ నుంచే ఆడియో లీక్‌? 
కలెక్టర్, ఎంపీ మధ్య జరిగిన సంభాషణ చర్చనీయాంశంగా మారింది. సంజయ్‌ వాడే ఫోన్‌లో వాట్సాప్‌గానీ, వాయిస్‌ రికార్డర్‌ ఆప్షన్‌ గానీ ఉండదు. కలెక్టర్‌ ఫోన్‌ నుంచి ఆడియో లీకయ్యే అవకాశం లేదు. దీనిపై విచారిస్తే .. ఫోన్‌ సంభాషణలో కలెక్టర్‌ మాట్లాడుతూ ‘మీ నంబర్‌ నాకు మెసేజ్‌ చేస్తే సేవ్‌ చేస్తా.. వాట్సాప్‌ పంపిస్తా’అని చెప్పగా, తనకు వాట్సా ప్‌ లేదని సంజయ్‌ చెప్పారు. దాంతో కలెక్టర్‌ ‘నేను మల్లికార్జున్‌కు చేస్తా. ఆయన మీకు చూపిస్తారు’అని అంటారు. దీన్ని బట్టి సంజయ్‌.. మల్లికార్జున్‌ అనే వ్యక్తి ఫోన్‌ నుంచి మాట్లాడినట్లు స్పష్టమవుతోంది. మల్లికార్జున్‌ ప్రస్తుతం ఓ పత్రికకు మేనేజర్‌గా వ్యవహరిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఒక పత్రిక (ప్రస్తుతం మూతపడింది)కు విలేకరిగా వ్యవహరించారు. ఆయన ఫోన్‌ నుంచే సంజయ్‌ మాట్లాడినట్లు స్పష్టమవుతోంది. ఈ విషయాన్ని కలెక్టర్‌ ‘సాక్షి’ తో మాట్లాడుతూ ధ్రువీకరించారు. తానెవరి ఫోన్‌ నుంచి కలెక్టర్‌తో మాట్లాడలేదని, తన ఫోన్‌తోనే మాట్లాడినట్లు సంజయ్‌ ‘సాక్షి’కి వివరణ ఇచ్చారు.  

కలెక్టర్‌ తన విధులను అపహాస్యం చేశారు: గంగుల 
ఎంపీ బండి సంజయ్, కలెక్టర్‌ సర్ఫరాజ్‌ల మధ్య ఫోన్‌ సంభాషణపై మంత్రి గంగుల కమలాకర్‌ స్పందించారు. కొంతమంది అధికారులు, నాయకులు కలసి తనను ఓడించేందుకు ప్రయత్నించారన్నారు. ఈ అంశాన్ని సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్తానని, రాజ్యాంగబద్ధ హోదాలో ఉన్న కలెక్టర్‌ ప్రభుత్వ ఆంతరంగిక అంశాలను బయట వ్యక్తులకు చెప్పడం సరికాదన్నారు. కుట్రలు, కుతంత్రాల మధ్య ఎంపీ సంజయ్‌ ఉన్నారని..ప్రజల మధ్య తానున్నానని స్పష్టం చేశారు. ఈ  ఆడియో వంద ప్రశ్నలకు సమాధానం చెప్తుందని, ప్రజా దీవెనలు లేకపోతే ఎప్పుడో బలయ్యే వాడినన్నారు. ఎన్నికల అధికారిగా ఉన్న కలెక్టర్‌ లీకులకు పాల్పడితే ప్రజలకు ప్రజాస్వా మ్యం మీద నమ్మకం పోతుందన్నారు. 

అది 8 నిమిషాల సంభాషణ: కలెక్టర్‌ 
అసెంబ్లీ ఎన్నికలు ముగిసి, ఫలితాలు విడుదలైన 2018 డిసెంబర్‌ 11 తరువాత బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిన బండి సంజయ్‌ నాతో మాట్లాడారు. సంజయ్‌ వేరే వ్యక్తి ఫోన్‌ నుంచి 8 నిమిషాలు మాట్లాడారు. అప్పుడు గెలిచిన కమలాకర్‌ సమర్పించే ఎన్నికల ఖర్చును తగ్గించడానికి ఎవరైనా ప్రయత్నిస్తారేమోనని సంజయ్‌ అనుమానం వ్యక్తం చేస్తే, అలాంటిదేమీ ఉండదని ఎవరూ ఏమీ చేయలేరని చెప్పాను. చాలా విషయాలపై సంజయ్‌ మాట్లాడితే, రిటర్నింగ్‌ అధికారిగా ఆయన అనుమానాలు నివృత్తి చేశాను. రాజ్యాంగబద్ధ హోదాలో దానికి కట్టుబడే మాట్లాడాను. నేను సంజయ్‌తో ఎనిమిది నిమిషాలు మాట్లాడగా, లీకైనట్లు చెపుతున్న ఆడియో కాల్‌ 1.30 నిమిషాలే ఉంది. ఎనిమిది నిమిషాల కాల్‌లో కట్, పేస్ట్‌ విధానం ద్వారా ఎవరో వాళ్లకు అవసరమైన సంభాషణను మిక్స్‌ చేసి ఆడియోగా రూపొందించి, వైరల్‌ చేశారు. గతంలోనే నాకు ఒకరు 8 నిమిషాల ఆడియో టేప్‌ పంపించారు. అది ప్రభుత్వానికి సమర్పిస్తా. మీడియాకు ఇవ్వాల్సిన అవసరం లేదు. తాను సంజయ్‌తో కలసి కుట్ర చేశానని మంత్రి గంగుల వ్యాఖ్యానించడం బాధాకరమని, ఆ ఆడియో టేపులో సంజయ్‌ను ఫోన్‌ నంబర్‌ పంపించమని చెప్పడం స్పష్టంగా తెలుస్తుందని, ఫోన్‌ నంబరే లేని వ్యక్తితో కలసి కుట్రలు ఎలా పన్నుతానని చెప్పారు.

మరిన్ని వార్తలు