రైతులపై కేసులు ఉపసంహరించుకోవాలి

16 Apr, 2017 01:09 IST|Sakshi
రైతులపై కేసులు ఉపసంహరించుకోవాలి

ఉచిత ఎరువులకు దేశవ్యాప్తంగా ప్రశంసలు: ఎంపీ వినోద్‌

సాక్షి, సిరిసిల్ల: రైతు సంక్షేమంపై కాంగ్రెస్‌ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే ప్రాజెక్టు నిర్మాణాలను అడ్డుకునే కోర్టు కేసులను ఉపసంహరించు కోవాలని కరీంనగర్‌ ఎంపీ బి.వినోద్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రొఫెసర్‌ కోదండరాం, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి హైకోర్టులో కేసులు వేయిస్తున్నారని ఆరోపించారు. సుందిళ్ల, మేడిగడ్డ, కాళేశ్వరం వద్ద నిర్మించే ప్రాజెక్టులను అడ్డుకోవడానికి కేసులు వేశారని గుర్తు చేశారు.

రైతులకు పరిహారం పెంచాలని డిమాండ్‌ చేస్తే తప్పు లేదని అన్నారు. తొలకరి జల్లుపడగానే మే చివరలో రైతులు ఎరువులు కొనుగోలు చేయడానికి ఎకరాకు రూ.4 వేలు ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ ప్రకటించగానే దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తాయని చెప్పారు. ఉచిత ఎరువుల పథకాన్ని తమ వద్ద కాపీ కొట్టారని కాంగ్రెస్‌ నేతలు ఆరోపిస్తున్నారని, కానీ, కాంగ్రెస్‌ బుర్రలకు అలాంటి ఆలోచనలు రావని అన్నారు.

మరిన్ని వార్తలు