పరిషత్‌ ఎన్నికలకు కసరత్తు షురూ 

21 Feb, 2019 10:49 IST|Sakshi

సాక్షి, వరంగల్‌ రూరల్‌: అసెంబ్లీ, పంచాయతీ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఏప్రిల్‌ మాసంలో లోకసభ ఎన్నికలు జరుగనుండడంతో.. వెనువెంటనే మునిసిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదలయ్యే అవకాశం ఉంది. ఎన్నికలకు సంబంధించి ఓటరు నమోదు.. ఓటరు జాబితా.. పోలింగ్‌కు అవసరమయ్యే సామగ్రి.. ఉద్యోగుల నియామకంపై ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఈ మేరకు బుధవారం మండల స్థాయిలో ఎంపీటీసీ స్థానాలు, జిల్లా స్థాయిలో జెడ్పీ స్థానాలు వివరాలతో కూడిన ముసాయిదాను జాబితాను కలెక్టర్ల ఆమోదంతో విడుదల చేసింది.

ఈ నెల 22 వరకు అభ్యంతరాలు స్వీకరించి 25న తుది జాబితాను ప్రకటించనున్నారు. ఈ అభ్యంతరాలను ఆయా మండల పరిషత్‌ కార్యాలయాల్లో స్వీకరించనున్నారు. కొత్త జిల్లాలు, కొత్తగా ఏర్పడ్డ మండలాలు, పంచాయతీలను దృష్టిలో ఉంచుకొని ఎంపీటీసీలు, జెడ్పీటీసీల స్థానాలను పునర్విభజించాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ ఈ నెల 16న జిల్లా అధి కారులకు ఉత్తర్వులను జారీ చేసింది. 2011 జనా భా లెక్కల ప్రకారం ఈ ప్రాదేశిక నియోజకవర్గాలను గుర్తించాలని ఆదేశించింది. ఈ మేరకు రం గంలోకి దిగిన పంచాయతీరాజ్‌ అధికారులు బుధవారం పునర్‌ వ్యవస్థీకరించిన జెడ్పీ,మండల స్థానాలతో కూడిన ముసాయిదా జాబితాను వెల్లడించారు. ఈనెల 21, 22వ తేదీల్లో అభ్యంతరా లను స్వీకరిస్తారు. 23, 24వ తేదీల్లో వాటిని పరి శీలించి పరిష్కరిస్తారు. ఈ నెల 25న తుది జాబి తాను ప్రకటించనున్నారు. పూర్వపు వరంగ ల్‌ జిల్లాలో 705ఎంపీటీసీలు, 50జెడ్పీటీసీలున్నాయి.

3500 జనాభాకు ఒక ఎంపీటీసీ..
జిల్లాలో మండలం యూనిట్‌గా 2011 జనాభా ప్రాతిపదికన 3500 మంది జనాభాకు ఒక ఎంపీటీసీని కేటాయించారు. ఈ నెల నెల 25న తుది జాబితాను సిద్ధం చేసి తర్వాత ప్రభుత్వ ఆదేశానుసారం రిజర్వేషన్లను ప్రకటించనున్నారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఈవీఎంల కొరతను అధిగమించేందుకు ఈ సారి బ్యాలెట్‌ విధానంలోనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నాయి.

మరిన్ని వార్తలు