నేటి నుంచి ‘పరిషత్‌’ నామినేషన్లు

22 Apr, 2019 05:35 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తొలి విడత నిర్వహించే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో భాగంగా సోమవారం నుం చి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. ఉదయం 10 గంటలకు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ప్రాదేశిక నియోజకవర్గాల వారీగా ఓటర్ల జాబితా ప్రచురణతోపాటు తొలివిడత ఎన్నికల నోటీసు జారీ చేస్తారు. నోటీసు జారీచేసిన అనంతరం సాయంత్రం 5 గంటలవరకు మండల, జిల్లా పరిషత్‌ కార్యాలయాల్లో నామినేషన్లు స్వీకరిస్తారు. తొలివిడత ఎన్నికల్లో భాగంగా 197 జెడ్పీటీసీ, 2,166 ఎంపీటీసీ స్థానాలకు మే6న ఎన్నికలు జరగనున్నాయి. జెడ్పీటీసీ జనరల్, బీసీ అభ్యర్థులకు రూ.5వేలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.2,500, ఎంపీటీసీ జనరల్, బీసీ అభ్యర్థులకు రూ.2,500, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.1,250 డిపాజిట్‌ రుసుముగా తీసుకుంటారు.

ఈనెల 24 నామినేషన్లకు తుది గడువు. 25న పరిశీలన ఉంటుంది. అదే రోజు సాయంత్రం ఐదు గంటలకు అర్హులైన అభ్యర్థుల జాబితా ప్రచురిస్తారు. వాటిపై అప్పీల్‌కు 26 సాయంత్రం ఐదు గంటల వరకు అవకాశం ఉంటుంది. 27న సాయంత్రం ఐదు గంటల్లోగా ఆ అప్పీళ్లను పరిశీలించి, పరిష్కరించిన అనంతరం నామినేషన్ల ఉపసంహరణ గడువు 28న మూడు గంటల వరకు ఉంటుంది. అదేరోజు పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు. మే 6న ఉదయం 7 గంటల నుంచి, సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ నిర్వహిస్తారు.

మరిన్ని వార్తలు