ఎంపీటీసీ టు విప్

14 Dec, 2014 03:36 IST|Sakshi
ఎంపీటీసీ టు విప్

14 ఏళ్ల ఉద్యమ ఫలితంగా గొంగిడి సునీతకు దక్కిన పదవి
భువనగిరి : ఎమ్మెల్యే గొంగిడి సునీతను శాసనసభలో విప్‌గా నియమిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఆలేరు నియోజకవర్గం నుంచి 2014లో జరిగిన శాసనసభఎన్నికల్లో ఆమె తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అత్యంత సన్నిహితురాలిగా పేరున్న సునీతకు టీఆర్‌ఎస్ అధికారంలోకి రాగానే మంత్రి పదవి వస్తుందని అందరూ భావించారు. అయితే జిల్లాకు చెందిన గుంటకండ్ల జగదీష్‌రెడ్డిని మంత్రిపదవి వరించింది. తాజాగా మంత్రివర్గ విస్తరణలోనైనా సునీతకు అవకాశం వస్తుందనుకున్నారు. అనూహ్యంగానే ఆమెకు విప్ పదవి వచ్చింది.
 
పార్టీ ఆవిర్భావం నుంచి కేసీఆర్ వెంటే...
తెలంగాణ సాధనకోసం టీఆర్‌ఎస్ ఏర్పడిన నాటినుంచి గొంగిడి సునీత ఆ పార్టీలోనే ఉన్నారు. 2001లో జరిగిన స్థానిక సంస్థలఎన్నికల్లో ఆమె యాదగిరిగుట్ట-2 ఎంపీటీసీగా గెలిచి..ఎంపీపీ అయ్యారు. 2006లో స్వగ్రామమైన వంగపల్లి సర్పంచ్‌గా గెలిచి 2011 వరకు ఆ పదవిలో కొనసాగారు. ఈ సమయంలోనే రాష్ర్టపతి నుంచి నిర్మల్ పురస్కారం అందుకున్నారు. అలాగే ప్రజాప్రతినిధుల సంఘం జనరల్‌సెక్రటరీగా, ఆల్‌ఇండియా లోకల్ గవర్నమెంట్ ప్రజాప్రతినిధులసంఘం జాయింట్‌సెక్రటరీగా ఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ సెమినార్‌లో పాల్గొన్నారు.

పార్టీపరంగా 2009లో ఆమె టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యురాలిగా నియమించబడ్డారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా, మహిళా కార్యదర్శిగా పనిచేశారు. ఉపఎన్నికల సందర్భంగా పరకాల, లింగాల ఘణపురం, బాన్స్‌వాడ అసెంబ్లీ ఎన్నికల ఇన్‌చార్జ్‌గా అక్కడి అభ్యర్థుల గెలుపుకోసం కృషి చేశారు. కేసీఆర్ కరీంనగర్ ఎంపీ పదవికి రాజీనామా చేసి ఉపఎన్నికకు వెళ్లారు. ఆసమయంలో సునీత చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా పనిచేశారు. తెలంగాణ ఉద్యమంలో పలుమార్లు అరెస్ట్ కావడంతో పాటు కేసులు నమోదు అయ్యాయి.
 
కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటా
‘‘సీఎం కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటాను. 14 సంవత్సరాల పాటు ఆయన వెంట ఉద్యమంలో నడిచిన నాకు ఆలేరు అసెంబ్లీ టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం ఇచ్చారు. ఇప్పుడు పార్టీ విప్ పదవి ఇచ్చారు.ఉద్యమంలో నడిచిన వారందరికి ప్రాధాన్యం ఇస్తానని చెప్పినట్లుగానే పదవులు ఇస్తున్నారు. కేసీఆర్‌కు నాకుటుంబం తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు. పార్టీ కోసం పనిచేసి పదవికి వన్నె తెస్తా. ఆలేరు ప్రజలకు మరిన్ని సేవలు చేస్తాను’’.

మరిన్ని వార్తలు