ఎట్టకేలకు మరమ్మతులు

19 Jul, 2019 10:26 IST|Sakshi
అందుబాటులోకి వచ్చిన ఎమ్మారై స్కానింగ్‌ యంత్రం

‘గాంధీ’లో అందుబాటులోకి ఎమ్మారై స్కానింగ్‌  

క్యాత్‌లాబ్, సీటీ స్కానింగ్‌ యంత్రాలు సైతం   

మరమ్మతులకు ఆరు నెలలు పట్టిన వైనం  

గాంధీఆస్పత్రి: సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రి రేడియాలజీ విభాగంలో ఎమ్మారై స్కానింగ్‌ యంత్రం అందుబాటులోకి వచ్చింది. కార్డియాలజీ విభాగంలోని క్యాత్‌ల్యాబ్, సీటీ స్కానింగ్‌ యంత్రాలకు సైతం మరమ్మతులు పూర్తయ్యాయి. జనవరి చివరి వారంలో ఎమ్మారై, సీటీ స్కానింగ్‌ యంత్రాలతో పాటు క్యాత్‌ల్యాబ్‌ మరమ్మతులకు గురయ్యాయి. నిర్వహణ సంస్థ ఫెబర్‌ సింధూరి మరమ్మతులు తమ వల్ల కాదని చేతులు ఎత్తేయడంతో ఆరు నెలలుగా యంత్రాలు మూలనపడ్డాయి. యంత్రాలను సరఫరా చేసిన సిమెన్స్‌ సంస్థ తమకు బకాయిపడ్డ సుమారు రూ.90 లక్షలు చెల్లిస్తేనే మరమ్మతులు చేస్తామని స్పష్టం చేసింది. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు శస్త్ర చికిత్సలు వాయిదా పడ్డాయి.

క్యాత్‌ల్యాబ్‌ పనిచేయకపోవడంతో గుండె సంబంధ వ్యాధులతో ఇక్కడకు వచ్చిన రోగులు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆస్పత్రి పాలనా యంత్రాంగం చొరవ తీసుకొని పరిస్థితిని ఉన్నతాధికారులకు వివరించింది. ఆస్పత్రి అభివృద్ధి నిధులు వెచ్చించి ఈ మూడు యంత్రాలను అందుబాటులోకి తేవాలని జిల్లా కలెక్టర్‌ లిఖితపూర్వకంగా ఆదేశాలు జారీ చేశారు. సిమెన్స్‌ సంస్థ ప్రతినిధులతో ఆస్పత్రి యంత్రాంగం పలుమార్లు ప్రత్యేకంగా సమావేశమై చర్చించింది. వారం రోజుల క్రితం సుమారు రూ.78 లక్షలు చెల్లించడంతో సిమెన్స్‌ సంస్థ ఇంజినీర్లు రంగంలోకి దిగారు. విదేశాల నుంచి యంత్ర భాగాలను తెప్పించి సిటీ, ఎమ్మారై, క్యాత్‌ల్యాబ్‌లను అందుబాటులోకి తెచ్చారు. ప్రతిరోజు సుమారు 20 ఎమ్మారై, 120–135 సీటీ స్కానింగ్‌లు నిర్వహిస్తున్నామని రేడియాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్‌ శ్రీహరి తెలిపారు. క్యాత్‌ల్యాబ్‌ పూర్తిస్థాయిలో పనిచేస్తోందని కార్డియాలజీ వైద్యులు పేర్కొన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అతి ముఖ్యమైన మూడు యంత్రాలకు మరమ్మతులు చేపట్టి అందుబాటులోకి తెచ్చామని, సదరు యంత్రాలకు సంబంధించి నిర్వహణ బాధ్యతలను సిమెన్స్‌ సంస్థకే అప్పగించామని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ ప్రొఫెసర్‌ శ్రవణ్‌కుమార్‌ తెలిపారు. 

>
మరిన్ని వార్తలు