ఎమ్మెల్యే చెబితేనే జాయినింగ్‌!

3 Jun, 2018 07:06 IST|Sakshi
మోహన్‌ను బదిలీ చేస్తూ కలెక్టర్‌  జారీ చేసిన ప్రొసీడింగ్స్‌

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల : ‘బదిలీపై వచ్చావా..? ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సిఫారసు లెటర్‌ ఉందా? బదిలీ లెటర్‌ తెచ్చినా... వారు చెపితేనే విధుల్లో చేర్చుకుంటా!’ అని ఓ తహసీల్దార్‌ గిర్ధావర్‌ (రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ను వెనక్కు పంపడం మంచిర్యాల జిల్లా రెవెన్యూ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఇటీవల జిల్లాలో చేపట్టిన రెవెన్యూ ప్రక్షాళనలో భాగంగా జన్నారం మండలంలో ఆర్‌ఐగా పనిచేసిన ఎం.మోహన్‌ను తొలుత భీమినికి బదిలీ చేశారు. మోహన్‌ విజ్ఞప్తి మేరకు స్వల్ప మార్పులతో భీమిని నుంచి జైపూర్‌ మండలానికి బదిలీ చేస్తూ గత నెల 29న కలెక్టర్‌ ఆర్‌వీ.కర్ణన్‌ ప్రొసీడింగ్స్‌ ఇచ్చారు.

ఈ మేరకు మోహన్‌ మే 31న జైపూర్‌ తహసీల్దార్‌ శేఖర్‌ను కలిసి విధుల్లో చేర్చుకోవాలని కోరగా, అందుకు నిరాకరించడం వివాదాస్పదమైంది. ‘ఎన్నికల సంవత్సరం ఇది. ఎమ్మెల్యే (నల్లాల ఓదెలు), ఎమ్మెల్సీ (పురాణం సతీష్‌)ల అనుమతి లేకుండా నిన్ను విధుల్లో చేర్చుకోలేను. వారి ఆదేశాలకు అనుగుణంగా పనిచేయాల్సి ఉంటుంది. వారి నుంచి లెటర్‌ తీసుకువస్తేనే జాయిన్‌ చేసుకుంటా’ అని తహసీల్దార్‌ శేఖర్‌ తనను వెనక్కు పంపారని శనివారం ‘సాక్షి’ కార్యాలయానికి వచ్చిన మోహన్‌ వివరించారు. ఆరోజు జైపూర్‌ తహసీల్‌ కార్యాలయం పరిశీలనకు వచ్చిన జాయింట్‌ కలెక్టర్‌కు ఈ విషయాన్ని తెలియజేశానని, కలెక్టర్‌ ప్రొసీడింగ్స్‌ను తిరస్కరించకూడదని జేసీ హితువు చెప్పారని వివరించారు. జేసీ ముందు జాయిన్‌ చేసుకుంటానని చెప్పి తరువాత మళ్లీ వెనక్కు పంపారని తెలిపారు.

ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం కలెక్టర్‌ ఆర్‌వీ.కర్ణన్‌ను కలిసి ఫిర్యాదు చేస్తే ఏవో, ఆర్‌డీవోలకు కలెక్టర్‌ ఆదేశాలిచ్చారని మోహన్‌ తెలిపారు. కాగా శనివారం తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొనేందుకు గిర్ధావర్‌ హోదాలో జైపూర్‌కు వెళ్లగా, ఆఫీసులో కూర్చున్న తనను జాయిన్‌ చేసుకోలేనని చెప్పి మళ్లీ తహసీల్దార్‌ వెనక్కు పంపారని తెలిపారు. కలెక్టర్‌ బదిలీ ఉత్తర్వులను తీసుకొని వెళితే తనను విధుల్లో చేరకుండా అడ్డుకొని వెనక్కు పంపడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. 

తనను బెదిరిస్తూ అబద్ధాలు ప్రచారం చేస్తున్నాడు : తహసీల్దార్‌ శేఖర్‌
బదిలీ ఉత్తర్వులతో వచ్చిన గిర్దావర్‌ మోహన్‌ విధుల్లో చేరకముందే తన పై అధికారి అనే గౌరవం కూడా ఇవ్వకుండా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని జైపూర్‌ తహసీల్దార్‌ శేఖర్‌ ‘సాక్షి’కి తెలిపారు. గిర్ధావర్‌ ఆరోపణలపై వివరణ కోరగా... తనకు తెలియకుండా ఎవరిని విధుల్లో చేర్చుకోవద్దని ఓ ప్రజాప్రతినిధి చెప్పిన మాటలనే మోహన్‌కు చెప్పానని స్పష్టం చేశారు. ఈ మాటలకు తప్పుడు ప్రచారం చేస్తూ అధికార పార్టీ పేరును, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, జిల్లా కలెక్టర్‌ పేర్లను వివాదాస్పదం చేశాడని పేర్కొన్నారు. ‘జరిగిన పరిణామాలను కలెక్టర్‌కు నివేదించాను. కలెక్టర్‌ నుంచి నాకు తదుపరి ఆదేశాలు ఇంకా రాలేదు. ఈ నేపథ్యంలోనే శనివారం మండల కార్యాలానికి వచ్చిన గిర్ధావర్‌ మోహన్‌ను విధుల్లో చేర్చుకోలేదు’ అని వివరించారు.  

మరిన్ని వార్తలు