ఎమ్మెల్సీగా ఎంఎస్‌ ప్రభాకర్‌ ఎన్నిక

9 Mar, 2019 03:05 IST|Sakshi

ఎన్నికల అధికారి నుంచి గెలుపు ధ్రువీకరణ పత్రం స్వీకరణ

సాక్షి,హైదరాబాద్‌: హైదరాబాద్‌ జిల్లా స్థానిక సంస్థల కోటా నుంచి ఎమ్మెల్సీగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎంఎస్‌ ప్రభాకర్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన తప్ప మరెవ్వరూ నామినేషన్‌ దాఖలు చేయకపోవడంతో ఉపసంహరణ గడువు ముగిశాక శుక్రవారం సాయంత్రం ప్రభాకర్‌రావుకు ఎన్నికల అధికారి అద్వైత్‌ కుమార్‌ సింగ్‌ గెలుపు పత్రం అందజేశారు. ఈ కార్యక్రమానికి హోంమంత్రి మహమూద్‌ అలీ, మేయర్‌ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్‌ బాబా ఫసియుద్దీన్, తదితరులు హాజరయ్యారు. అనంతరం జీహెచ్‌ఎంసీలోని పలువురు కార్పొరేటర్లు ప్రభాకర్‌ను సత్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రూపాయి ఖర్చు లేకుండా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యానని ఇదంతా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చలవేనన్నారు. ఆయన చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలు, జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లు తదితరులందరి సహకారం వల్లనే ఏకగ్రీవంగా ఎన్నికయ్యానన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో కేంద్ర మంత్రులుగా పనిచేసిన నాయకులు సైతం రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీచేసేందుకు వెనుకాడుతున్నారన్నారు. కాంగ్రెస్‌ నాయకుడు జైపాల్‌రెడ్డి పేరును ఈ సందర్భంగా ప్రస్తావించారు. లోక్‌సభ ఎన్నికల్లో 16 స్థానాలు టీఆర్‌ఎస్‌ గెలుచుకోవడం ఖాయమన్నారు. నగర మేయర్‌గా పనిచేసిన తొలి దళితుడు తన తండ్రి శామ్‌రావని గుర్తుచేశారు.

మరిన్ని వార్తలు