వేసవి మోత విద్యుత్ కోత

27 Mar, 2014 00:33 IST|Sakshi
వేసవి మోత విద్యుత్ కోత
 •     అనధికారిక కోతలతో సిటీజనులకు ఇక్కట్లు
 •        దోమల మోతతో కునుకు కరువు
 •      కాలిపోతున్న ఫ్రిజ్‌లు, ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు
 •      ఊపందుకున్న ఇన్వర్టర్ల విక్రయాలు
 •  సాక్షి, సిటీబ్యూరో : నగరంలో ఇష్టం వచ్చినట్లు కోతలు అమలవుతున్నాయి. అసలే వేసవి.. పైగా పరీక్షల సమయం.. అయినా పగలు రాత్రి అనే తేడా లేకుండా ఎడాపెడా విద్యుత్ కోతలు అమలు చేస్తుండటంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూడు గంటల పాటు కోతలు అమలు చేస్తామని అధికారికంగా ప్రకటించిన సీపీడీసీఎల్.. ముందస్తు సమాచారం లేకుండా అనధికారికంగా మరో మూడు గంటలు కరెంటు కట్ చేస్తోంది. నిన్న మొన్నటి వరకు పగటి పూటకే పరిమితమైన ఈ కోతలు... తాజాగా విద్యార్థులు చదువుకునే కీలకమైన రాత్రి సమయంలోనూ అమలు చేస్తుండటంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  
   
  48 మిలియన్ యూనిట్లు అవసరం


   ప్రస్తుతం గ్రేటర్ వాసుల అవసరాలు తీర్చాలంటే ప్రతి రోజూ కనీసం 48 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరం కాగా.. 43 మిలియన్ యూనిట్లకు మించి సరఫరా కావడం లేదు. ఫలితంగా కోతలు తప్పవని ప్రకటించిన సీపీడీ సీఎల్... ఆ మాటకైనా కట్టుబడి ఉండటం లేదు. ఉదాహరణకు మెహిదీపట్నం, అజామాబాద్, గ్రీన్‌ల్యాండ్స్, రాజేంద్రనగర్, చంపాపేట్ డి విజన్లలో ఉదయం 11 నుంచి 12.30 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 5 నుంచి 6.30 గంటల వరకు అధికారిక కోతలు అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. అనధికారికంగా ఇక్కడ మరో మూడు గంటలు కోత విధిస్తోంది.

  అలాగే బేగంబజార్, చార్మినార్, ఆస్మాన్‌ఘడ్, హబ్సిగూడ, మేడ్చల్ డివిజన్ల పరిధిలో ఉదయం 9.30 నుంచి 11 వరకు, తిరిగి మధ్యాహ్నం 3.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కోత విధిస్తున్నట్లు చెప్పినా.. అనధికారికంగా మరో రెండు గంటలు కట్ చేస్తోంది. కనీసం రాత్రి పూటైన ప్రశాంతంగా నిద్రపోదామని భావించే వారికి ఆ భాగ్యం దక్కనీయడం లేదు. దోమలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అప్పుడే మొదలైన ఉక్కపోతకు దోమలు కూడా తోడవుతున్నాయి.

  ఈ సమయంలో ఇంట్లోని ఫ్యాన్లు, ఏసీలు, కూలర్లు పనిచేయక పోవడంతో సిటీజనులు విలవిల్లాడుతున్నారు. ఇక శివారు ప్రాంతాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. సమయం సందర్భం లేకుండా ఎడాపెడా కరెంట్‌ను కట్ చేస్తుండటంతో ఇంట్లో విలువైన ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు, ఫ్రిజ్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ యంత్రాలు కాలిపోతున్నాయి. ఈ విషయంపై సమీపంలోని అధికారులకు ఫిర్యాదు చేసినా, వారు పట్టించుకోవ డం లేదు. ఈ కోతలను తట్టుకోలేక కొంతమంది తల్లితండ్రులు ముందస్తు జాగ్రత్త కోసం ఇన్వర్టర్లు కొనుగోలు చేస్తుండటంతో ఇటీవ ల వీటి విక్రయాలు ఊపందుకున్నాయి.
   
  సంక్షోభం దిశగా పరిశ్రమలు
   
  వరుస ఆందోళనలతో అసలే ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పరిశ్రమలు.. తాజా అధికారిక సెలవులతో మరిన్ని నష్టాలను చవి చూడాల్సి వస్తోంది. ఆర్డర్లు చేతికి వచ్చే సమయంలో విద్యుత్ సరఫరా నిలిపివేయడం వల్ల ఉత్పత్తి నిలిచిపోవడంతో పాటు ఇంతకాలం వాటినే నమ్ముకుని కాలం వెళ్లదీస్తున్న కార్మికుల జీవితాలు మళ్లీ రోడ్డున పడే దుస్థితి నెలకొంది. ఇప్పుడే పరిస్థితి ఇంత అధ్వానంగా ఉంటే భవిష్యత్తులో ఎలా ఉండనుందోనని యజమానులతో పాటు కార్మికులూ ఆందోళన చెందుతున్నారు.
   
  మంత్రుల క్వార్టర్స్‌కు కరెంట్ కట్
   
  బిల్లు కట్టలేదనే నేపంతో ఇటీవల గోల్కొండకోటకు విద్యుత్ సరఫరా నిలిపివేసిన డిస్కం.. తాజాగా ఇదే కారణంతో బంజారాహిల్స్ రోడ్ నెం.12లోని మంత్రుల నివాస సముదాయానికి బుధవారం విద్యుత్ సరఫరా నిలిపి వేసింది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు క్వార్టర్లకు కరెంటు లేకపోవడంతో మాజీ మంత్రుల కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి.  ఈ సముదాయం రెండు మాసాల కాలానికి రూ.24 లక్షలు బకాయిపడింది. మూడుసార్లు నోటీసులిచ్చినా ఆర్‌అండ్‌బి అధికారులు స్పందించలేదు. దీంతో ఫిలింనగర్ ట్రాన్స్‌కో ఏఈ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది కరెంటు నిలిపివేశారు. ఉన్నతాధికారుల జోక్యంతో 8 గంటల తర్వాత కరెంటును పునరుద్ధరించారు.
   

మరిన్ని వార్తలు