మల్టీటాలెంటెడ్‌ కిడ్‌

24 Oct, 2018 08:39 IST|Sakshi

మోడలింగ్‌లో రాణిస్తున్న షణ్ముఖ్‌  

చిత్రలేఖనంలోనూ ప్రతిభ యాడ్స్‌తో నటనలోనూ ప్రమేయం  

పలు సంస్థలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఎంపిక  

నాలుగో తరగతి చదువుతోన్న చిన్నారి విభిన్న రంగాల్లో రాణిస్తున్నాడు. ఓవైపు మోడలింగ్, మరోవైపు యాడ్స్‌లోనటిస్తూ, ఇంకోవైపు చిత్రలేఖనంలోనూ ప్రతిభ చాటుతున్నాడీ మల్టీటాలెంటెడ్‌ కిడ్‌ షణ్ముఖ్‌. అతి తక్కువ సమయంలోనే మంచి పేరు తెచ్చుకొని పలు సంస్థలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా కూడాఎంపికయ్యాడు.  


 
మియాపూర్‌: ఆదిలాబాద్‌ నుంచి పదేళ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చి మియాపూర్‌ దీప్తిశ్రీనగర్‌లో నివసిస్తున్న సురేష్, ఆశలత దంపతుల కుమారుడు షణ్ముఖ్‌. స్థానిక శ్రీనిధి గ్లోబల్‌ స్కూల్‌లో నాలుగో తరగతి చదువుతున్నాడు. ఫ్యాషన్‌పై షణ్ముఖ్‌ ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు కుమారుడిని ప్రోత్సహించారు. ఫేస్‌బుక్‌లో ఓ యాడ్‌ చూసిన సురేష్‌ ‘గ్లామర్‌ ఎరా’ కాంపిటీషన్‌కు షణ్ముఖ్‌ ఫొటోలు పంపించాడు. అప్పటికే సమయం దాటిపోవడంతో వైల్డ్‌ కార్డు ద్వారా షోకు సెలెక్ట్‌ అయ్యాడు. ఏప్రిల్‌ 29న షోలో పాల్గొని అందరి  మన్ననలు అందుకున్నాడు. అతడి టాలెంట్‌ చూసి మోడలింగ్, ఫ్యాషన్‌ రంగంలో రాణిస్తాడని న్యాయనిర్ణేతలు అభినందించారు. అప్పటి నుంచి ఇంట్లోనే మోడలింగ్, ఫ్యాషన్‌ మెళకువలు నేర్చుకుంటున్నాడు. ఆపిల్, అమెజాన్, ఇంటీరియర్‌ డెకరేషన్‌ తదితర యాడ్స్‌లో చేసి మెప్పించాడు. నగరంలో జరిగిన ఫ్యాషన్‌ షోలలో పాల్గొని ప్రథమ స్థానంలో నిలిచాడు. సెప్టెంబర్‌లో జరిగిన ‘అల్మోరా ఫ్యాషన్‌ మోడల్‌ అండ్‌ ఫర్‌ ఆలేజ్‌ ఫ్యాషన్‌ షో’లో అవార్డు అందుకున్నాడు. ముంబైలో క్యాలెండర్‌ యాడ్స్‌ చేసేందుకు అవకాశం పొందాడు. షణ్ముఖ్‌ టాలెంట్‌కు అనేక అవకాశాలు వస్తున్నాయని తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
 

 

ఇనిస్టిట్యూట్‌ ఏర్పాటు చేస్తా...  
మోడలింగ్, యాక్టింగ్‌లో రాణించి భవిష్యత్తులో ఇనిస్టిట్యూట్‌ ఏర్పాటు చేయాలని ఉంది. ఈ రంగంలోకి వచ్చేందుకు నా తల్లిదండ్రులు, గురువులు కష్‌కష్‌ ఫాతిమా, అంబర్‌ పాతర్, సలీమ్‌ ఇలాయి, అమీద్‌ అరోరా, ఖాసిం ఖాన్‌లు ఎల్లప్పుడూ మెళకువలు అందిస్తున్నారు. మెడలింగ్‌లో ఎంపికైనందుకు స్కూల్‌ ప్రిన్సిపాల్‌ సర్టిఫికెట్, గోల్డ్‌మెడల్‌ అందించారు. రానున్న కాలంలో సినిమాల్లో నటించాలని ఉంది.       
– షణ్ముఖ్‌  

మరిన్ని వార్తలు