బహుభాషా సమ్మేళనం 3 కుటుంబాల ఆధిపత్యం

5 Nov, 2018 14:04 IST|Sakshi

 ఖేడ్‌ నియోజకవర్గంలో ఎన్నో విశిష్టతలు

తెలుగు, కన్నడ, మరాఠ మాట్లాడే ప్రజల నివాసం

ఒక్క సారి మినహా షెట్కార్, మహారెడ్డి, పటోళ్ల కుటుంబీకులదే పైచేయి

ఒక్క సారి కూడా మంత్రి పదవి వరించని వైనం 

ఖేడ్‌ అసెంబ్లీ నియోజకర్గం మూడు భాషలు మాట్లాడే ప్రజల సమ్మేళనంగా రాష్ట్రంలోనే ప్రత్యేకతను సంతరించుకుంది. మంజీరా నది ఇక్కడి రైతుల కన్నతల్లి వంటింది. పరిశ్రమలు, ఉపాధి లేక ఇక్కడ నెలకొన్న వలసల సమస్య అపరిష్కృతంగానే మిగిలింది. 1952 నుంచి నేటి వరకు ఒక్క సారి మినహా  ప్రతీ ఎన్నికల్లో అప్పారావు షెట్కార్, మహారెడ్డి వెంకట్‌రెడ్డి, పటోళ్ల కృష్ణారెడ్డి కుటుంబీకులే గెలుస్తూ వస్తున్నారు. ఈ ఎన్నికల్లో సైతం ఆ కుటుంబాల నుంచి పోటీ చేసే అభ్యర్థుల నడుమే ప్రధాన పోటీ ఉండే అవకాశం ఉంది. టీఆర్‌ఎస్‌ తరపున వెంకట్‌రెడ్డి కుమారుడు మహిపాల్‌రెడ్డి పోటీలో ఉండగా.. కాంగ్రెస్‌ నుంచి సురేశ్‌షెట్కార్, పటోళ్ల సంజీవరెడ్డి టికెట్‌ కోసం తీవ్రంగా యత్నిస్తున్నారు. 

సాక్షి,నారాయణఖేడ్‌: కర్ణాటక, మహారాష్ట్రల సరిహద్దుగా ఉన్న నియోజకవర్గం నారాయణఖేడ్‌. ఈ ప్రాంతానికి ఓ ప్రత్యేకత ఉంది. కర్ణాటక, మహారాష్ట్రల సరిహద్దు కావడంతో తెలుగుతోపాటు, ఉమ్మడి జిల్లాలోనే గ్రామాలతో సమంగా గిరిజన తండాలతో నియోజకవర్గం ఉంటుంది. జిల్లాలోని సుప్రసిద్ధ బోరంచ నల్లపోచమ్మ ఆలయం, ప్రధాన నీటి వనరు అయిన నల్లవాగు ప్రాజెక్టు ఈ నియోజకవర్గంలోనే ఉన్నాయి. జీవనది అయిన మంజీరా నది కర్ణాటక రాష్ట్రం నుండి ఈ నియోజకవర్గంలోని గౌడ్‌గాం జన్‌వాడ వద్ద తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించి జిల్లాలోనే అత్యధికంగా ఈ నియోజకవర్గంలోనే మంజీరా 40 కిలోమీటర్ల మేర ప్రవహిస్తోంది. 

బౌగోళిక చరిత్ర.. 
1956వ సంవత్సరంలో భాషాప్రయుక్త రాష్ట్రాల పునర్వవస్థీకరణ సందర్భంగా అప్పటి వరకు కర్ణాటక రాష్ట్రంలోని బీదర్‌ జిల్లాలో ఉన్న నారాయణఖేడ్‌ ప్రాంతాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని మెదక్‌ జిల్లాలో చేర్చారు. అనంతరం 1957లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అప్పారావు షెట్కార్‌ మొట్టమొదటి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. ఈ నియోజకవర్గంలో అప్పట్లో న్యాల్‌కల్‌ మండలం పూర్తిగా ఉండగా రాయికోడ్‌ మండలంలోని 11 గ్రామాలు నారాయణఖేడ్‌ నియోజకవర్గంలో కొనసాగాయి. 2009లో నియోజకవర్గాల పునర్యవస్థీకరణలో బాగంగా న్యాల్‌కల్, రాయికోడ్‌ మండలాలు పూర్తిగా జహీరాబాద్‌ నియోజకవర్గంలోకి వెళ్లగా మెదక్‌ నియోజకవర్గంలో ఉన్న పెద్దశంకరంపేట మండలం ఖేడ్‌ నియోజకవర్గంలో చేరింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలను పునర్వవస్థీకరించాక పెద్దశంకరంపేట మండలం మెదక్‌ జిల్లాలోకి వెళ్లింది. నియోజకవర్గం లెక్కలో మాత్రం పెద్దశకంరంపేట ఖేడ్‌లోనే ఉంది. ఈ నియోజకవర్గంలో ప్రస్తుతం నారాయణఖేడ్, మనూరు, నాగల్‌గిద్ద, కల్హేర్, కంగ్టి, సిర్గాపూర్, పెద్దశంకరంపేట మండలాలు ఉన్నాయి. 

మంత్రి పదవి ఎరగని ఖేడ్‌.. 
ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో ఇక్కడి నుంచి శాసన సభ్యులుగా గెలిచిన వారెవ్వరు మంత్రులు కాలేదు. అప్పారావు షెట్కార్‌ రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నిక కాగా ఆయన సోదరుడు శివరావుషెట్కార్‌ మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మహారెడ్డి వెంకట్‌రెడ్డి రెండు పర్యాయాలు, పీ.కృష్ణారెడ్డి నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయినా వీరెవరికీ మంత్రి పదవులు వరించలేవు. 

రెండు పర్యాయాలు పీఏసీ చైర్మన్‌గా కృష్ణారెడ్డి మంత్రి పదవిపై ఆశ పెట్టుకున్న దివంగత ఎమ్మెల్యే పి.కృష్ణారెడ్డి గెలుపొందిన ఓ పర్యాయం రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం రావడంతో ఈయన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా ఉండడంతో మంత్రి పదవి దక్కలేదు. కాగా ఈయన రెండు పర్యాయాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 2009లో రాష్ట్ర పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ (పీఏసీ) చైర్మన్‌గా పనిచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యాక సైతం పీఏసీ చైర్మన్‌గా కొంతకాలం పనిచేశారు. 


ఎంపీ అయిన సురేశ్‌ షెట్కార్‌.. 
నియోజకవర్గం నుండి ఎంపీగా ఎన్నికైన ఏకైన వ్యక్తి సురేష్‌ షెట్కార్‌. స్వాతంత్ర సమరయోధులు స్వర్గీయ శివరావుషెట్కార్‌ పెద్దకుమారుడు ఇతను. 2004లో మొట్టమొదటి సారిగా శాసన సభకు ఎన్నికైన సురేశ్‌షెట్కార్‌ 2009లో వైఎస్‌ ప్రోద్భలంతో నూతన పార్లమెంట్‌ నియోజకవర్గంగా ఏర్పడిన జహీరాబాద్‌ నుంచి పోటీచేసి  పార్లమెంట్‌లోకి అడుగు పెట్టారు.


మూడు కుంటుంబాల పాలనే.. 
ఈ నియోజకవర్గంలో అత్యధికంగా మూడు కుటుంబాలకు చెందిన వారే శాసన సభ్యులుగా ఎన్నికయ్యారు. అప్పారావుషెట్కార్‌ ఈయన సోదరుడు శివరావుషెట్కార్, ఈయన కుమారుడు సురేష్‌ షెట్కార్‌లు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. మహారెడ్డి వెంకట్‌రెడ్డి, ఈయన కుమారులు మహారెడ్డి విజయపాల్‌రెడ్డి, మహారెడ్డి భూపాల్‌రెడ్డి ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. కృష్ణారెడ్డి నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యే అయ్యారు. 


ఇప్పటివరకు గెలిచిన ఎమ్మెల్యేలు.. 
సంవత్సరం     గెలిచిన వారు               పార్టీ          
1952    అప్పారావుషెట్కార్‌              కాంగ్రెస్‌     
1957    అప్పారావు షెట్కార్‌             కాంగ్రెస్‌     
1962    రాంచెందర్‌రావు దేశ్‌పాండే    స్వతంత్ర   
1967    శివరావుషెట్కార్‌                 కాంగ్రెస్‌     
1972    ఎం. వెంకట్‌రెడ్డి                  స్వతంత్ర     
1978    శివరావుషెట్కార్‌                 కాంగ్రెస్‌     
1983    ఎం.వెంకట్‌రెడ్డి                    టీడీపీ        
1985     శివరావుషెట్కార్‌                కాంగ్రెస్‌      
1989     పి.కృష్ణారెడ్డి                      కాంగ్రెస్‌       
1994    ఎం.విజయపాల్‌రెడ్డి             టీడీపీ         
1999     కృష్ణారెడ్డి                         కాంగ్రెస్‌        
2004     సురేష్‌ షెట్కార్‌                 కాంగ్రెస్‌        
2009     కృష్ణారెడ్డి                         కాంగ్రెస్‌        
2014     కృష్ణారెడ్డి                         కాంగ్రెస్‌        
2016     ఎం.భూపాల్‌రెడ్డి                టీఆర్‌ఎస్‌     

మరిన్ని వార్తలు