మన్యంలో ముందే క్లోజ్‌

8 Apr, 2019 12:28 IST|Sakshi

 సాయంత్రం నాలుగు గంటల వరకే పోలింగ్‌ 

ములుగు, భూపాలపల్లి గోదావరి తీర ప్రాంతాల్లో అమలు 

వరుసగా మావోయిస్టుల బ్యానర్లతో అప్రమత్తం  

సాక్షి,ములుగు: మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో 11వ తేదీన జరగనున్న లోక్‌సభ ఎన్నికలను సాయంత్రం 4గంటల వరకు మాత్రమే నిర్వహించడానికి ఎన్నికల కమిషన్‌ నిర్ణయం తీసుకుంది. గత అసంబ్లీ ఎన్నికల్లో సైతం ఇదే విధానాన్ని అమలు చేశారు. ఇప్పటికే జిల్లా యంత్రాంగం 64 సమస్యాత్మక, 112 నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాలను గుర్తించారు.  దీంతో పాటు జిల్లా సువిశాలంగా ఉండడం, మారుమూల ప్రాంతాలు మండల కేంద్రాలకు సుదూరంగా ఉండడం, అటవీ ప్రాంతాల్లో ఎక్కువ గ్రామాలు ఉండడంతో ఎక్కడా ఎలాం టి ఇబ్బంది కలగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరపడానికి యంత్రాంగం సిద్ధమవుతోంది. 

గోదావరి తీర ప్రాంతాల్లో..  
భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో గోదా వరి తీర ప్రాంతాల్లో ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్‌ నిర్వహిస్తారు.  ఈ సమయంలోనే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుకోవాల్సి ఉంటుంది. భూపాలపల్లి, ములుగు నియోజకవర్గా ల్లో పూర్తిగా, మంథని, భద్రాచలం నియోజకవర్గాల నుంచి పునర్విభజనలో జిల్లాలో కలిసిన కాటారం, మహదేవపూర్, పలిమెల, మహాముత్తారం, మల్హర్, వాజేడు, వెంకటాపురం(కె) మండలాల్లో నిబంధన అమలు కానుంది. భద్రత, రక్షణ అంశాలను ప్రధానంగా పరిగణలోకి తీసుకుని అధికారులు, పోలీసు బలగాలను అవసరం ఉన్నంత మేర అందుబాటులో ఉండేలా రాష్ట్ర ఉన్నత అధికారులకు నివేదికను అందించింది.  

వాటితో అప్రమత్తం .. 
ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన అనంతరం  భూపాలపల్లి, ములుగు జిల్లాలోని వెంకటాపురం(కె), ఏటూరునాగారం, వెంకటాపురం(ఎం)  మండలాల్లో మావోయిస్టుల బ్యానర్లు, పోస్టర్లు కలకలం సృష్టించాయి. లోకసభ భూటకపు ఎన్నికలను బహిష్కరించాలని, కేంద్ర పార్టీలు కాంగ్రెస్, బీజేపీలను ఓడించాలని కరపత్రాల్లో మావోయిస్టులు పేర్కొన్నారు.  దీంతో  రెవెన్యూ, పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఆయా మండలాలతో పాటు ఏజెన్సీ ప్రాంతాలపై దృష్టి కేంద్రీకరించింది.  ప్రస్తుతం రహదారులు, బ్రిడ్జిలు అందుబాటులోకి రావడంతో ఏ సమయంలోనూ నిర్లక్ష్యం వహించకుండా చీకటిపడే లోపే పోలింగ్‌ సామగ్రి, ఈవీఎంలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులు భావిస్తున్నారు.  

భద్రత కట్టుదిట్టం  
ములుగు జిల్లాలో 302 , భూపాలపల్లిలో 317  పోలింగ్‌ బూత్‌లలో భద్రతను కట్టుదిట్టం చేయనున్నారు. 8 కంపెనీల కేంద్ర పారామిలటరీ బలగాలలతో పాటు సుమారు 2వేల మంది స్థానిక పోలీసులతో భద్రత  కల్పించనున్నారు. ఇప్పటికే నాలుగు కంపెనీల భద్రత బలగాలు జిల్లాకు చేరాయి. ఒక్కో కంపెనీలో 120 మంది సీఆర్‌పీఎఫ్‌ అధికారులు ఉంటారు.  సమస్యాత్మక, అతి సమస్యాత్మక, నక్సల్‌ ప్రభావిత ప్రాంతాలను గుర్తించి పోలీసులు ఉన్నత అధికారులు గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలకు తగిన అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి  రోజు ఉదయం సాయంత్రం గ్రామాలకు చేరుకొని కార్డన్‌ సెర్చ్‌ నిర్వహిస్తున్నారు.

ఇబ్బందులు కలగకుండా భద్రత ఏర్పాటు.. 
ఓటు వేయడానికి పోలింగ్‌ కేంద్రాలకు వచ్చే ప్రతి ఓటరు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భద్రత కట్టుదిట్టం చేస్తున్నాం. జిల్లాలోని అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూస్తాం. ఇప్పటికే శాఖ తరఫునన తగిన చర్యలు తీసుకుంటున్నాం. ప్రతి రోజు ఆయా  మండలాల పోలీసులు  గ్రామాలకు వెళ్లి  కార్డెన్‌ సెర్చ్‌తో పాటు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. గత శాసనసభ ఎన్నికల్లో పాటించిన భద్రతా విధానాన్ని అమలు చేస్తాం. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకొని ప్రశాంతంగా ఇంటికి చేరుకునేలా చూస్తాం. 
 – సురేశ్‌కుమార్, ఓఎస్డీ, ములుగు        

మరిన్ని వార్తలు