‘పెళ్లి’ పేరుతో మహిళలకు వల

19 Sep, 2019 11:06 IST|Sakshi

మ్యాట్రిమోనియల్‌ ఫ్రాడ్‌లో బంజారాహిల్స్‌వాసి 

ముంబైకి చెందిన మహిళకు డాక్టర్‌నంటూ టోకరా 

గత వారం అరెస్టు చేసి తీసుకువెళ్లిన అక్కడి పోలీసులు 

గతంలో ఇదే తరహా కేసులో విశాఖపట్నంలో కటకటాల్లోకి.. 

సాక్షి, సిటీబ్యూరో: పెళ్లి పేరుతో ఎరవేసి ఎదుటి వారి నుంచి అందినకాడికి దండుకుని మోసం చేయడంలో ఉత్తరాదికి చెందిన ముఠాలు దిట్ట. కొందరు నైజీరియన్లు సైతం అక్కడి మెట్రో నగరాలకు అడ్డాగా చేసుకుని ఈ తరహా మాట్రిమోనియల్‌ ఫ్రాడ్స్‌కు పాల్పడుతున్నారు. అయితే, ఇక్కడ సీన్‌ రివర్స్‌ అయింది. నగరంలోని బంజారాహిల్స్‌ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి.. కచ్చితంగా చెప్పాలంటే 53 ఏళ్ల వృద్ధుడు వరుసపెట్టి మాట్రిమోనియల్‌ ఫ్రాడ్స్‌ చేస్తున్నాడు. గత ఏడాది వైజాగ్‌కు చెందిన మహిళను వంచించి అక్కడ అరెస్టయి జైలుకెళ్లగా.. తాజాగా ముంబైకి చెందిన వితంతువును నిండా ముంచి మళ్లీ కటకటాల పాలయ్యాడు. గత వారం చోటు చేసుకున్న ఈ అరెస్టు అలస్యంగా వెలుగులోకి వచ్చింది.
 
ఏసీబీ జేడీగా వైజాగ్‌లో మోసం 
నగరంలోని బంజారాహిల్స్‌ ప్రాంతానికి చెందిన మాచర్ల శ్యాంమోహన్‌ గతంలో ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగిగా పనిచేశాడు. వివాహితుడైన ఇతడికి ఇద్దరు సంతానం కూడా ఉన్నారు. అయితే, కొన్నాళ్లుగా మాట్రిమోనియల్‌ సైట్స్‌ను వేదికగా చేసుకుని మోసాలకు తెర లేపాడు. వివిధ పేర్లు, హోదాలతో రిజిస్టర్‌ చేసుకునే ఇతగాడు ప్రధానంగా విడాకులు తీసుకున్న, వితంతువులైన మహిళలను టార్గెట్‌ చేసుకుంటున్నాడు. గత ఏడాది విశాఖపట్నంకు చెందిన 35 ఏళ్ల డాక్టర్‌ను మాట్రిమోనియల్‌ సైట్‌ ద్వారా ఎంచుకున్నాడు. భర్త నుంచి వేరుపడిన ఈ బాధితురాలితో తాను అవినీతి నిరోధక శాఖలో జాయింట్‌ డైరెక్టర్‌ అని, నెలకు రూ.50 వేల జీతం వస్తుందని నమ్మబలికాడు.

వివాహం చేసుకుంటానని చెప్పిన శ్యామ్‌ మోహన్‌ ఆపై ఆమెను తన మాటలతో గారడిలో పడేశాడు. మన కోసం బెంగళూరులో ఓ ఇల్లు ఖరీదు చేశానని, అందులో ఏర్పాటు చేయడానికి రెండు ఏసీలు పంపాలని కోరాడు. ఈ మాటలు నమ్మిన బాధితురాలు రూ.లక్ష వెచ్చించి వాటిని పంపగా అందుకున్న తర్వాత మాట్లాడటం మానేశాడు. చివరకు అసలు విషయం తెలుసుకున్న బాధితురాలు అక్కడి సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న అధికారులు గత ఏడాది సెప్టెంబర్‌లో అరెస్టు చేశారు. 

డాక్టర్‌ని అంటూ ముంబై మహిళకి.. 
విశాఖపట్నం కేసులో బెయిల్‌పై వచ్చిన శ్యాంమోహన్‌ తన పంథా మార్చుకోలేదు. మరో మాట్రిమోనియల్‌ సైట్‌లో డాక్టర్‌గా నమోదు చేసుకున్నాడు. ఆ సైట్‌ ద్వారా ముంబైలోని నెహ్రూనగర్‌కు చెందిన మహిళకు ఎర వేశాడు. భర్త నుంచి వేరుపడిన ఆమె మరో వివాహం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. తాను హైదరాబాద్‌కు చెందిన వైద్యుడినని ఈ ఏడాది జూలై 1న పరిచయం చేసుకున్న శ్యామ్‌ తన తల్లిదండ్రుల్ని కలవడానికి సిటీకి రమ్మన్నాడు. బాధితురాలు ముంబై నుంచి హైదరాబాద్‌ చేరుకోగా ఆమెను బంజారాహిల్స్‌లోని ఓ ఫైవ్‌ స్టార్‌ హోటల్‌కు తీసుకెళ్లాడు. అక్కడే ఆమెకు మత్తుమందు ఇచ్చి అఘాయిత్యానికి పాల్పడటంతో పాటు ఆమె నుంచి రూ.4 లక్షలు తీసుకుని మోసం చేశాడు.

స్వస్థలానికి తిరిగి వెళ్లిన బాధితురాలు అక్కడి నెహ్రూనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. దర్యాప్తు చేసిన అధికారులు శ్యామ్‌ను అక్కడకు రప్పించి అరెస్టు చేయాలని నిర్ణయించారు. దీంతో ఆ మహిళ మరికొన్నాళ్లు శ్యామ్‌తో మాటలు కొనసాగించేలా చేశారు. చివరకు అతడు మరో రూ.6.5 లక్షలు ఇవ్వాలంటూ ఆమెను కోరాడు. ఈ మొత్తం ఇస్తానంటూ ఆమెతో చెప్పించిన పోలీసులు తీసుకోవడానికి ముంబై రమ్మన్నారు. ఆదివారం అక్కడకు వెళ్లిన శ్యామ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇతగాడు ఇంకా అనేక మందిని ఇదే పంథాలో మోసం చేశాడని, అయితే వారు ఫిర్యాదు చేయకపోవడంతో ఇతడి మోసాలు కొనసాగుతున్నాయని నెహ్రూనగర్‌ పోలీసులు చెబుతున్నారు.    

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా