ముంబైలో సరికొత్త ప్రయోగం.. కేటీఆర్‌ ఆసక్తి

31 Jan, 2020 15:58 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : జల, వాయు, శబ్ద, నేల కాలుష్యానికి కేరాఫ్‌గా మారిన ముంబైలో ట్రాఫిక్‌ ఇబ్బందులకు కొదవే ఉండదు. లక్షలాది వాహనాలు, ఫ్యాక్టరీల నుంచి వెలువడే పొగ పర్యావరణానికి తూట్లు పొడుస్తుండగా.. అదేపనిగా మోగించే వాహనాల హారన్లు శబ్ద కాలుష్యానికి కారణమవుతున్నాయి. ముఖ్యంగా కూడళ్ల వద్ద రెడ్‌ సిగ్నల్‌ పడినా కూడా కొందరు హారన్లతో హోరెత్తిస్తుంటారు. దాంతో అక్కడ పనిచేసే ట్రాఫిక్‌ సిబ్బందికి చెవిపోటు ఖాయం. అందుకే దీనికో పరిష్కారం కనుగొన్నారు ముంబై పోలీసులు.

కొన్ని భారీ కూడళ్ల వద్ద డెసిబెల్స్‌ మెషీన్లతో సిగ్నలింగ్‌ వ్యవస్థను అనుసంధానం చేశారు. వాహనదారుల హారన్‌ మోతలకు కళ్లెం వేశారు. హారన్‌ శబ్దాలు డెసిబెల్స్‌ మీటర్‌లో 85 కంటే ఎక్కువ నమోదైందంటే మళ్లీ రెడ్‌ సిగ్నల్‌ పడుతుంది. దాంతో కథ మళ్లీ మొదటికొస్తుంది. ఎవరిదారిన వారు.. సైలెంట్‌గా వెళ్లి పోతే సమస్యే లేదు. కాదూ కూడదు అని.. హారన్‌పై చెయ్యి పడిందో ఇక అంతే..! గ్రీన్‌ సిగ్నల్‌ పడినా వెంటనే రెడ్‌ సిగ్నల్‌కు జంప్‌ అవుతుంది. ఈ ప్రయోగం ముంబైలో సత్ఫలితాలనిస్తోంది. దీనిపట్ల తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ ఆసక్తి కనబరిచారు. మన రాష్ట్రంలో కూడా ఇలాంటి విధానాన్ని తీసుకొద్దామని ట్విటర్‌లో వెల్లడించారు.

>
మరిన్ని వార్తలు