ప్రొటెం స్పీకర్‌గా ముంతాజ్‌ అహ్మద్‌ ప్రమాణ స్వీకారం

16 Jan, 2019 17:09 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎంఐఎం పార్టీ సీనియర్‌ ఎమ్మెల్యే ముంతాజ్‌ అహ్మద్‌ఖాన్‌ తెలంగాణ అసెంబ్లీకి ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ అహ్మద్‌ ఖాన్‌తో బుధవారం సాయంత్రం  5 గంటలకు రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయించారు. అసెంబ్లీలో సీనియర్‌ ఎమ్మెల్యేను ప్రొటెం స్పీకర్‌గా నియమించడం ఆనవాయితీగా వస్తోంది. ఆ సంప్రదాయాన్ని పాటిస్తూ.. చార్మినార్‌ నియోజకవర్గం నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన ముంతాజ్‌ అహ్మద్‌ ఖాన్‌ను సీఎం కేసీఆర్‌ ప్రొటెం స్పీకర్‌గా ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. జనవరి 17 నుంచి నాలుగు రోజుల పాటు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌, మాజీ స్పీకర్‌ మధుసూధనాచారి, ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ తదితరులు పాల్గొన్నారు. (ఎంఐఎం ఎమ్మెల్యేకు అరుదైన చాన్స్‌.. కేసీఆర్‌కు ఒవైసీ థాంక్స్‌)

కాగా, నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్‌ ముంతాజ్‌ అహ్మద్‌ ఖాన్‌ రేపు (గురువారం) ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారానికి ముందు ఉదయం 11 గంటలకు గన్‌పార్క్‌ అమరవీరుల స్థూపం వద్ద కేసీఆర్‌ నివాళులు అర్పిస్తారు. కేసీఆర్‌తో పాటు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం అసెంబ్లీలో జరిగే కార్యక్రమాల్లో కేసీఆర్‌ పాల్గొంటారు. రేపు స్పీకర్‌ ఎన్నికల షెడ్యుల్‌ ప్రకటన విడుదల చేస్తారు. ఎల్లుండి స్పీకర్‌ను ఎన్నుకుంటారు. 19వ తేదీన తెలంగాణ అసెంబ్లీని ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగిస్తారు. గవర్నర్‌ ప్రసంగంపై 20 తేదీన అసెంబ్లీలో ధన్యవాద తీర్మానం ప్రవేశపెడతారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు