ఇక మున్సిపోరు

20 Jun, 2019 14:40 IST|Sakshi

వార్డుల పెంపు పై సందిగ్ధం.. రిజర్వేషన్ల పై ఉత్కంఠ

జిల్లాలో నాలుగు మునిసిపాలిటీలు

పాలక వర్గ సభ్యులకు మిగిలింది 10రోజులే 

సాక్షి, మహబూబాబాద్‌: అసెంబ్లీ, సర్పంచ్, ఎంపీ, పరిషత్‌ ఎన్నికలు విజయవంతంగా పూర్తిచేసిన అధికార యంత్రాంగం త్వరలో మునిసిపల్‌ ఎన్నికలకు రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే వార్డుల వారీగా బీసీ, ఎస్టీ, ఎస్సీ జనభా గణన పూర్తిచేసి ఉన్నాతాధికారులకు నివేదికలు పంపారు. సోమవారం జరిగిన కేబినేట్‌ మీటింగ్‌ అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్‌ జూలై నెలలోనే  ఎన్నికలు నిర్వహించి పూర్తిచేస్తాం అని ప్రకటించటంతో పట్టణాల్లో ఎన్నికల సందడి నెలకొంది. జిల్లాలో మహబూబాబాద్‌తో పాటు కొత్తగా ఏర్పాటైన మరిపెడ, డోర్నకల్, తొర్రూర్‌ పురపాలక సంఘాలు ఉన్నాయి. గ్రామాలు, తండాల విలీనాల నేపథ్యంలో వార్డుల విభజన, రిజర్వేషన్లకు సంబంధించి ఉన్నతాధికారుల మార్గదర్శకాల కోసం అధికారులు ఎదురుచూస్తున్నారు. కొత్త పురపాలక సంఘాల్లో ఇదివరకే వార్డుల విభజన జరిగినా మళ్లీ స్పల్ప మార్పులు, చేర్పులు చేపట్టే అవకాశం ఉంది.

వార్డుల పునర్విభజన తప్పదా..
పురపాలక చట్టం మారితే వార్డులు పునర్విభజన చేసే అవకాశం ఉంది. అలాగే రిజర్వేషన్లు సైతం మారనున్నాయి. ప్రస్తుతం కొత్తగా ఏర్పడిన మునిసిపాలిటీల్లో తక్కువగా 9 వార్డులే ఉన్నాయి. మహబూబాబాద్‌లో 28 వార్డులు ఉన్నాయి. కొత్త చట్టం అమలైతే ఎన్నికలు జూలై నెలలో నిర్వహించటం  కష్టమవుతుందని, దానికి చాలా సమయం తీసుకుంటుందని అధికారులు చెబుతున్నారు. ఒక వేళ జూలై నెలలోనే ఎన్నికలు పూర్తిచేయాలంటే ప్రస్తుతం ఉన్న వార్డుల ప్రకారమే ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. అలా అయితే కొత్త మునిసిపాలిటీల్లో 9వార్డులే ఉండటం వల్ల అక్కడ పోటీ తీవ్రంగా ఉండనుంది. అక్కడ వార్డుల సంఖ్య పెంచాలని డిమాండ్‌ వినిపిస్తోంది. 

శాస్త్రీయ పద్ధతిలో..
పురపాలక ఎన్నికల నిర్వహణకు ముందు వార్డుల విభజన కీలకం కానుంది. వార్డుల విభజన సరిగా నిర్వహించకపోవడంతో వివిధ పురపాలక సంఘాల పరిధిలోని వార్డుల్లో ఓటర్ల సంఖ్యలో హెచ్చుతగ్గులు ఉన్నాయి. ఒక వార్డులో దాదాపు మూడు వేల మంది ఓటర్లు ఉంటే, మరో చోట వెయ్యి లోపే ఉన్నారు. కొత్త చట్టం అమలులోకి వస్తే అన్ని వార్డుల్లో కొంచెం అటు ఇటు సమానంగా ఓటర్లు ఉండేలా శాస్త్రీయ పద్ధతిలో వార్డుల విభజన చేపట్టాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

రిజర్వేషన్లపై నేతల దృష్టి
రాష్ట్రంలో కొత్త పురపాలకలు ఏర్పాటు కావటంతో గతంలో ఉన్న రిజర్వేషన్లనే రోటేషన్‌ పద్ధతిలో కొనసాగిస్తారా, లేక పంచాయతీ, ప్రాదేశిక ఎన్నికల వలే మొత్తం పురపాలకలను పరిగణలోకి తీసుకుని మళ్లీ రిజర్వేషన్లు ప్రకటిస్తారా అనే ఆంశం ఎన్నికల్లో పోటీచేసే ఆశవాహుల్లో ఉత్కంఠను రేపుతుంది. మునిసిపల్‌ చైర్మెన్‌ పదవికి గతంలో మాదిరి  ప్రరోక్ష పద్ధతిలో నిర్వహిస్తారా, లేక కొత్త చట్టం ఆమోదం పొందితే ప్రత్యక్ష పద్ధతిలో నిర్వహించే అవకాశం లేకపోలేదని నేతలు గుబులు పడుతున్నారు. ప్రత్యక్ష పద్ధతిలో నిర్వహిస్తే ఎన్నికల బరిలో నిలవటానికి  బడా నేతలు సిద్ధమవుతున్నారు. 

సిద్ధమవుతున్న ఆశావహులు
జిల్లాలోని నాలుగు మునిసిపాలిటీల్లో ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో ఆయా మునిసిపాలిటీల్లో వార్డుల నుంచి కౌన్సిలర్లుగా పోటీచేయాలనుకుంటున్న ఆశావహులు తమతమ వార్డుల్లో జనాన్ని మచ్చిక చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. వార్డుల్లో పర్యటిస్తూ ప్రజలకు అవసరమైన పనులు చేసి పెడుతూ మద్దతు కూడగట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. 
తమ పార్టీలకు చెందిన నేతలతో ఇప్పటికే తాను అభ్యర్థిగా పోటీలో ఉంటూననే సంకేతాలు అందిస్తున్నారు. ఇప్పటి దాకా రిజర్వేషన్లు అనుకూలిస్తే చాలని వారు అనుకున్నారు. వార్డుల విభజన పరిధి, ఓటర్ల సంఖ్యలో మార్పులు జరగుతాయని తెలిసి ఒకింత అయోమయానికి గురవుతున్నారు.  ఇది ఎంత వరకు అనుకూలిస్తుందో, ఇబ్బందికరంగా మారుతుందోనని లోలోన ఆందోళన చెందుతున్నారు. 

మరిన్ని వార్తలు