పుర‘పాలన’లో సంస్కరణలు! 

21 Oct, 2019 12:52 IST|Sakshi
తొర్రూరు పట్టణం ముఖచిత్రం

సాక్షి, తొర్రూరు: మునిసిపాలిటీల్లో భారీ సంస్కరణలు చోటు చేసుకోనున్నాయి. మునిసిపాలిటీల్లో అవినీతికి అడ్డుకట్ట వేసేందుకు, పారదర్శక పాలన అందించేందుకు నూతన మునిసిపల్‌ చట్టాన్ని ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. తాజాగా జరిగిన బడ్జెట్‌ సమావేశాల్లో  మునిసిపల్‌ నూతన చట్ట సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది. నూతన మునిసిపల్‌ చట్టంపై అవగాహన కల్పించడంతో పాటు వారి సలహాలు, సూచనలు తీసుకునేందుకు రెండు రోజుల పాటు కమిషనర్లతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. 

స్టాండింగ్‌ కమిటీ రద్దు
కలెక్టర్లకు కూడా మునిసిపాలిటీలపై ప్రత్యేకాధికారాలు కట్టబెట్టారు. కార్పొరేషన్లలో స్టాండింగ్‌ కౌన్సిల్‌ను రద్దు చేసి పాలకవర్గానికే అధికారాలు కట్టబెడుతున్నారు. ప్రతి¯నెలా విధిగా సమావేశాలు నిర్వహించాలని, సమావేశంలో చేసిన తీర్మానాలను 24 గంటల్లోనే చైర్మన్లు, మేయర్లు సంతకాలు చేసి ఆమోదించాలని, లేని పక్షంలో కమిషనర్లు తీర్మానాలపై సంతకాలు చేసే అధికారాన్ని ప్రభుత్వం కల్పించింది. 

ప్రతినెలా సమావేశం
ప్రతినెలా సర్వసభ్య సమావేశం నిర్వహించి అందులోనే కౌన్సిల్‌ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కౌన్సిల్‌ అనుమతి లేకుండా ఏ పని చేయడానికి వీలుండదు. ఒక్కసారి కౌన్సిల్‌ అభివృద్ధి పనుల టెండర్లకు పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తే ఇకపై కమిషనర్లే ఆ టెండర్‌ ప్రక్రియ పూర్తి చేస్తారు. దీంతో టెండర్ల నిర్వహణలో జరిగే జాప్యం కొంత మేరకు తగ్గుతుందని, తద్వారా పనులు వేగంగా సాగే అవకాశాలున్నాయి.

పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి
పారిశుద్ధ్య నిర్వహణను మెరుగుపరిచేందుకు చట్టంలో పలు అంశాలను పొందుపరిచారు. తెలంగాణ హరితహారంలో భాగంగా మొక్కలను పెంచడంతో పాటు వాటిని పరిరక్షించేందుకు మునిసిపాలిటీ జనరల్‌ ఫండ్‌ నుంచి ఏడాదికి 10 శాతం నిధులు కేటాయించనున్నారు. ఆన్‌లైన్‌లో ఇళ్ల నిర్మాణాలకు దరఖాస్తు చేసుకుంటున్నప్పటికీ రకరకాల కారణాలతో అనుమతి ఇవ్వడంలో జాప్యం జరుగుతుంది. డబ్బులు ఇవ్వనిదే అనుమతి ఇవ్వడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఆరోపణలకు చెక్‌ పెడుతూ చట్టంలో రూపొందించిన నిబంధనల మేరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వారికి విధిగా 21 రోజుల్లోనే అనుమతి ఇవ్వాలి.

లేని పక్షంలో దరఖాస్తు చేసుకున్న వారికి అనుమతి ఇచ్చినట్లుగానే భావించవచ్చు. ఆస్తిపన్ను మదింపు కోసం ప్రత్యేక యాప్‌ను రూపొందించి ఎవరికి వారుగా పన్నులను మదింపు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు తెలిసింది. ఇలా ఓ వైపు పరిపాలనలో మార్పులు, మౌళిక వసతులు మెరుగుపరచడం, అవినీతికి అడ్డుకట్ట వేయడం కోసం ప్రభుత్వం రూపొందించిన కొత్త మునిసిపల్‌ చట్టం అమలుతో ప్రజలకు మేలు జరుగుతుందని ప్రజలు భావిస్తున్నారు. 
 

మరిన్ని వార్తలు