ప్రలోభాలు షురూ! 

21 Jan, 2020 02:43 IST|Sakshi

ముగిసిన మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం 

భారీగా నగదు, మద్యం పంపిణీ 

రేపే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎన్నికలు 

భైంసాలోనూ ఎన్నిక యథాతథం.. 

ఉదయం 7 నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్‌ 

సాక్షి, హైదరాబాద్‌ : మున్సిపల్‌ ఎన్నికల ప్రచారానికి తెరపడటంతో ప్రలోభాలు మొదలయ్యాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు ప్రలోభాలకు తెర లేపారు. హంగూ, ఆర్భాటాల్లేకుండా ఇంటింటికీ వెళ్లి నగదు, మద్యంతో పాటు గిఫ్టులు ఇస్తూ వారిని ఆకర్షించే పనిలో పడ్డారు. నగదు పంపిణీ చేస్తూ పెద్దపల్లి, సత్తుపల్లి మున్సిపాలిటీల్లోని అభ్యర్థులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఈ రెండు మున్సిపాలిటీలే కాకుండా 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లలో ప్రలోభాలు పెద్ద ఎత్తున మొదలయ్యాయి. మద్యం, మాంసం పంపిణీ ఇప్పటికే ప్రారంభం కాగా, నగదు, చీరలు, కుర్చీలు, వాచీలు, బంగారు ఆభరణాలు కూడా పంపిణీ చేసే పనిలో పడ్డట్లు తెలుస్తోంది. అభ్యర్థులు భారీగా కొనుగోళ్లు చేయడంతో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలోని దుకాణాల్లో మద్యం నిండుకుంది.

దీంతో మద్యం కావాలంటూ మద్యం డిపోలకు శని, ఆదివారాల్లో భారీగా ఆర్డర్లు వచ్చాయి. కాగా, పోలింగ్‌ గడువు సమీపిస్తుండటంతో రాష్ట్రఎన్నికల కమిషన్‌ కూడా ఏర్పాట్లలో నిమగ్నమయింది. మొత్తం 7,961 కేంద్రాల్లో బ్యాలెట్‌ ద్వారా ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది. పోలీసులు కూడా బందోబస్తు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఎప్పటిలాగే ప్రచారం ముగిసిన రోజే వైన్‌షాపులు, బార్లు కూడా బంద్‌ కాగా, ఎన్నికలు జరిగే చోట్ల 22వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు వాటిని మూసి ఉంచాలని ఎక్సైజ్‌ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కౌంటింగ్‌ రోజున కూడా కౌంటింగ్‌ జరిగే ప్రాంతాల్లోని మద్యం దుకాణాలను మూసేయనున్నారు. 

మైకులు మూగబోయినట్టే.. 
సోమవారం సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచారం ముగిసిన (కరీంనగర్‌ కార్పొరేషన్‌ మినహా) నేపథ్యంలో మైకులు మూగబోగా, అన్నిరకాల ప్రచారాలకు తెరపడింది. 120 మున్సిపాలిటీల పరిధిలోని 2,648 వార్డులు, 9 కార్పొరేషన్ల పరిధిలో 324 డివిజన్ల పరిధిలో (ఏకగ్రీవాలు మినహాయించి), జీహెచ్‌ఎంసీలోని డబీర్‌పురా డివిజన్‌ ఉప ఎన్నికతో సహా తెలుపు రంగు బ్యాలెట్‌పత్రాలతో బుధవారం ఉదయం 7 నుంచి 5 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. ఇటీవల ఇరువర్గాల మధ్య ఘర్షణల కారణంగాఏర్పడిన ఉద్రిక్తతలతో భైంసా మున్సిపాలిటీలో ఈ నెల 22న ఎన్నికలు ఉంటాయా లేదా మీమాంస కొనసాగగా, చివరకు జిల్లా కలెక్టర్, ఎన్నికల పరిశీలకుడి నివేదిక ఆధారంగా అక్కడ యథాతథంగా ఎన్నికలు నిర్వహించాలని ఎస్‌ఈసీ నిర్ణయించింది.

ఓటింగ్‌ ముగిసే 48 గంటల లోగా ఎలాంటి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించొద్దన్న ఎస్‌ఈసీ హెచ్చరికల నేపథ్యంలో.. ప్రలోభాల పర్వం ఊపందుకోకుండా దానికి అడ్డుకట్ట వేయడంపై ఎస్‌ఈసీ దృష్టి కేంద్రీకరించింది. 120 మున్సిపాలిటీల పరిధిలో 6325, కార్పొరేషన్ల పరిధిలో 1586 పోలింగ్‌ కేంద్రాలను ఎస్‌ఈసీ ఏర్పాటు చేసింది. శుక్రవారం కరీంనగర్‌ కార్పొరేషన్‌లో 58 వార్డుల్లో జరిగే ఎన్నికలకు 385 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎన్నికలు జరగనున్న మొత్తం వార్డుల్లోని 7,961 పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాటయ్యాయి. పోలింగ్‌ సిబ్బంది 52,757 మందికి ర్యాండమైజ్‌ చేసి శిక్షణనిచ్చారు. వారిలో 40 వేల మంది విధులు నిర్వహిస్తారు. కౌంటింగ్‌కు 5 వేల మంది సిబ్బంది ఉంటారు.  

మాక్‌ పోలింగ్‌ నిర్వహణ..
సోమవారం ఈ వార్డుల్లోని కొంతమంది ఓటర్లతో ఆయా పోలింగ్‌ స్టేషన్లలో మాక్‌ పోలింగ్‌ చేపట్టారు. అయితే మాక్‌ పోలింగ్‌ సందర్భంగా ఓటు ఎవరికి వేశారనే విషయం తెలుస్తుందని గుర్తించి, యాప్‌లో ఓటరు పేరు, సీరియల్‌ నంబర్‌ మాత్రమే కనిపించేలా చర్యలు తీసుకున్నారు. ఒక్కో పోలింగ్‌ కేంద్రాలో దీని కోసం ప్రత్యేకంగా పోలింగ్‌ అధికారిని నియమించారు. మంగళవారం సాయంత్రం నుంచి పోలింగ్‌ కేంద్రాలకు బ్యాలెట్‌ పత్రాలను తరలిస్తారు. పోలింగ్‌ కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, పోలింగ్‌ ప్రక్రియను వీడియో రికార్డింగ్‌ చేస్తున్నారు. పోలింగ్‌ సరళిని తెలుసుకునేందుకు 2,355 పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్‌ ఏర్పాటు చేశారు.

సోమవారం రాత్రి నుంచి పోలింగ్‌ కేంద్రాల పరిధిలో 144 సెక్షన్‌ అమలు చేస్తున్నారు. ఇక ఎన్నికలు జరుగుతున్న ప్రాతాల్లో ఈ నెల 22న లోకల్‌ హాలిడే ప్రకటిస్తూ సంబంధిత జిల్లా కలెక్టర్లు ఆదేశాలిచ్చారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా సివిల్, ఏఆర్, టీఎస్‌ ఎస్‌పీ, ఫైర్‌ పోలీసులు ఎన్నికల విధుల్లో పాల్గొంటారు. వీరికి అదనంగా ఇతర విభాగాలైన ఎక్సైజ్, ఫారెస్ట్‌ విభాగాలకు చెందిన ఉద్యోగులు కూడా విధుల్లో పాల్గొంటున్నారు. వాహన తనిఖీలు ముమ్మరం చేశారు. సున్నిత ప్రాంతాల్లో నిఘా పెంచారు. భైంసా అల్లర్ల నేపథ్యంలో సమస్యాత్మక, సున్నిత, అతిసున్నిత ప్రాంతాలు, రౌడీషీటర్లపై ప్రత్యేక దృష్టి సారించారు. 

అటు మేడారం, ఇటు ఎన్నికలు 
మేడారం జాతరకు వచ్చే భక్తులు కూడా రోజురోజుకూ పెరుగుతున్నారు. వాస్తవానికి అసలు పండుగ ఫిబ్రవరి మొదటివారంలో ఉండగా, దూరప్రాంతాల భక్తులు ముందే వచ్చి దేవతలను దర్శనం చేసుకుంటున్నారు. దీంతో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో పోలీసులకు మేడారం జాతర విధులు అదనంగా మారాయి. ఓవైపు మున్సిపల్‌ ఎన్నికలు, మరోవైపు జాతరకు ఒకేసారి విధులు నిర్వహించాల్సి రావడంతో అన్ని విభాగాలను సమన్వయం చేసుకుంటూ పకడ్బందీగా ముందుకు సాగుతున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన ఉమ్మడి ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్‌ జిల్లాల్లో కూంబింగ్‌ పెంచారు. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర దండకారణ్యాల నుంచి రాష్ట్రంలోకి చొరబాట్లు లేకుండా ఏజెన్సీ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించారు.  

తొలిసారిగా ఫేస్‌ రికగ్నిషన్‌ టెక్నాలజీ.. 
దేశంలోనే తొలిసారిగా మున్సిపల్‌ ఎన్నికల్లో పైలట్‌ ప్రాజెక్టు కింద ఫేస్‌  రికగ్నిషన్‌ టెక్నాలజీని ఎస్‌ఈసీ వినియోగిస్తోంది. కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 10 వార్డుల్లో స్మార్ట్‌ఫోన్లలో ఫొటో తీసి ఓటర్లను ఫేస్‌ రికగ్నిషన్‌ యాప్‌ ద్వారా ఆ వార్డుల్లోని ఓటర్ల జాబితాతో సరిపోలితేనే ఓటింగ్‌కు అనుమతిస్తారు. 

మరిన్ని వార్తలు