కీ‘లక్‌’ ఓటర్లు.. 

18 Jan, 2020 02:07 IST|Sakshi

‘పుర’పోరులో సెటిలర్లను ప్రసన్నంచేసుకునేందుకు పార్టీల పాట్లు 

సాక్షి, హైదరాబాద్‌ : ఎన్నికలలో..ఎన్ని‘కళ’లో.. ఓట్లకోసం ఎన్ని వలలో అన్న చందంగా మారింది పురపోరు. వృత్తి, విద్య, వ్యాపార, ఉద్యోగ, ఉపాధిరీత్యా వివిధ రాష్ట్రాల నుంచి వలస వచ్చిన ఓటర్లు అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేయనున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ శివార్లలోని నగర/పురపాలక సంస్థల్లో ఈ పరిస్థితి కనిపిస్తోంది. ఇతర జిల్లాలోను పలు మున్సిపాలిటీల్లో సెటిలర్లు కీలకంగా మారారు. వారి ఓట్లను గంపగుత్తగా సాధించేందుకు రాజకీయపార్టీలు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. హామీల వర్షం కురిపిస్తున్నాయి.  

ఐటీ కారిడార్‌లో వారిదే హవా! 
రాజధానికి మణిహారంగా నిలిచిన ఐటీ కారిడార్, ఔటర్‌రింగ్‌రోడ్డు పరిధిలోకి వచ్చే పలు నగర, పురపాలక సంస్థల్లో ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల నుంచి వలస వచ్చిన ఓటర్లు అత్యధికంగా ఉన్నారు. ప్రధానంగా మణికొండ మున్సిపాలిటీలో 30 వేల మంది సెటిలర్లు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. మొత్తం ఓటర్లలో మూడోవంతు వీరే ఉండటంతో అభ్యర్థుల దృష్టి వారిమీదే కేంద్రీకరించారు. బండ్లగూడ, బడంగ్‌పేట, మీర్‌పేట, జవహర్‌నగర్, బోడుప్పల్, ఫీర్జాదిగూడ, నిజాంపేట నగరపాలక సంస్థల పరిధిలో సెటిలర్లు అత్యధికంగా ఉన్నారు. వీరి ఓట్లే పార్టీల భవితవ్యాన్ని తేల్చనున్నాయి. ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాలతోపాటు సీమాంధ్ర ఓటర్లు కూడా ఈ ప్రాంతంలో భారీగా ఉన్నారు... దీనికితోడు మన రాష్ట్రంలోని వివిధ జిల్లాల ఓటర్లు కూడా ఇక్కడ కొలువుదీరడంతో స్థానిక తీర్పులో వీరే కీలకం కానున్నారు. మణికొండ, నార్సింగి, శంషాబాద్, కొంపల్లి, గుండ్లపోచంపల్లి, మేడ్చల్, తుర్కయాంజాల్‌లో వలస ఓటర్లు విజయావకాశాలను ప్రభావితం చేయనున్నారు. కేవలం హైదరాబాద్‌ శివారు పురపాలికలే గాకుండా...మిర్యాలగూడ, కోదాడ, నందికొండ, మధిర, సత్తుపల్లి నిజామాబాద్, బాన్సువాడ, మంచిర్యాల, ఆదిలాబాద్, బోధన్, గద్వాలలోను సెటిలర్ల ప్రభావం గణనీయంగా ఉండనుంది.  

హామీలవర్షంలో తడిసిముద్దవుతున్న వైనం 
బల్క్‌ డ్రగ్, ఫార్మా అనుబంధ పరిశ్రమలు, నిర్మాణరంగంలో పనిచేస్తున్న ఉపాధి కూలీలపై అభ్యర్థుల హామీల వర్షం కురిపిస్తున్నారు. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు, ఆరోగ్య శ్రీ కార్డుల, పింఛన్‌ ఆశలు చూపుతూ ప్రచారపర్వంలో దూసుకెళుతున్నారు. పలు రాజకీయపక్షాలు పురపోరుకు ముందే ముందుచూపుతో వ్యవహరించి.. వీరందరికి ఓటర్ల జాబితాలో పేర్లు నమోదు చేయించడం గమనార్హం. స్థానికేతరులను గుర్తించి ఇలా జాబితాలోకెక్కించడంలో అభ్యర్థులు పోటీపడగా.. ఓటర్లు కూడా తమ పేర్లను నమోదుకు ఉత్సాహంగా ముందుకొచ్చారు. ఎన్నికల వేళ తాయిలాలు, నగదు భారీగా ముడుతుందనే గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఓటు నమోదుకు కొందరు మొగ్గు చూపారు. పలువురికి ఓటు హక్కు లభించినా ఎవరి ఓటు ఏ వార్డులో ఉందనే అంశంపై ఇటు ఓటర్లు..అటు నమోదు చేసిన అభ్యర్థులకు సైతం అంతుబట్టకపోవడం మున్సి‘పోల్‌’లో వైచిత్రి. ఇదే కోవలో జవహర్‌నగర్‌ నగర పాలక సంస్థలో ఇలాంటి పరిణామం చోటుచేసుకోవడంతో అభ్యర్థులు తలలుపట్టుకుంటున్నారు. బతుకు బరువై..ఉపాధి కరువై నగరానికి వలస వచ్చిన బడుగుజీవులకు మందు, ముక్క ఆశచూపుతూ తమవైపునకు తిప్పుకునేందుకు శతావిధాలా ప్రయత్నిస్తున్నారు.  

మరిన్ని వార్తలు