ముంచుకొస్తున్న మున్సి‘పోల్స్‌’

9 Jul, 2019 11:07 IST|Sakshi

సాక్షి, కరీంనగర్‌ : మున్సిపాలిటీలకు ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. ప్రభుత్వం ఈ నెల మూడో వారంలో ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేసి, నెలాఖరున ఎన్నికలు నిర్వహించాలని భావిస్తుండడంతో అధికారులు ఏర్పాట్లను వేగవంతం చేశారు. జిల్లాలోని కరీంనగర్‌ కార్పొరేషన్‌తోపాటు హుజూరాబాద్, జమ్మికుంట, చొప్పదండి, కొత్తపల్లి మున్సిపాలిటీల్లో డివిజన్లు, వార్డుల విభజన, ఓటర్ల గణన వంటి అంశాలను ఖరారు చేయడంలో అధికారులు తలమునకలు అవుతున్నారు. ప్రతీ రోజు అర్ధరాత్రి వరకు పనులు చేస్తూ ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు.

ప్రస్తుతం ఫొటో ఓటర్ల జాబితాను డివిజన్ల వారీగా తయారు చేస్తున్నారు. 10న ముసాయిదా జాబితా ప్రకటించి అభ్యంతరాలను స్వీకరించి 14న తుది జాబితా వెలువరించనున్నారు. అదే రోజు రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. దీంతో పోటీ చేయడానికి ఆశావహులు, తాజా మాజీ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు సన్నద్ధం అవుతుండగా... మున్సిపాలిటీలపై పట్టు సాధించడానికి రాజకీయ పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. డివిజన్లు, వార్డుల పునర్విభజన, ఓటర్ల గణన సిద్ధమవుతుండడంతో రిజర్వేషన్లపై ఆశావహుల్లో టెన్షన్‌ మొదలైంది. ఏ డివిజన్‌ అనుకూలంగా వస్తుందోననే ఆందోళన  నెలకొంది.

దీంతో పక్కపక్కనే ఉన్న రెండు, మూడు డివిజన్లపై దృష్టి సారించి ఆయా డివిజన్లు, వార్డుల ప్రజలతో ఇప్పటికే తాను పోటీలో ఉంటున్నానని, తనకు మద్దతు తెలపాలని కోరుతూ అందరినీ కలుస్తున్నారు. మొత్తంమీద పట్టణప్రాంతాల్లో ఎన్నికల వేడి రాజుకుంటోంది. రిజర్వేషన్లు ఖరారైతే ఇక నోటిఫికేషన్‌ రాకున్నా ప్రచారం ఊపందుకునే పరిస్థితులే కనిపిస్తున్నాయి. ప్రచారానికి ఎక్కువగా సమయం ఉండదనే భావన నాయకుల్లో ఇప్పటికే చోటుచేసుకుంది. దీంతో ఒక్క రోజు కూడా వృథా చేయకుండా కాలనీల్లోనే  గడుపుతున్నారు. 

పట్టణాల్లో వేడెక్కిన రాజకీయం...
మున్సిపల్‌ ఎన్నికలు ముంచుకొస్తుండడంతో పట్టణాల్లో రాజకీయ సందడి ప్రారంభమైంది. డివిజన్లు, వార్డుల విభజన, రిజర్వేషన్ల ఖరారు ఏ మేరకు తమకు అనుకూలిస్తుందనే ఉత్కంఠ నెలకొంది. మేయర్‌/చైర్మన్, కార్పొరేటర్‌/కౌన్సిలర్లుగా పోటీ చేయాలని భావిస్తున్న ఆశావహులు తమ తమ ప్రయత్నాలను ప్రారంభించారు. ఆయా పార్టీల నేతల చుట్టు ప్రదక్షిణలు చేస్తూ టికెట్ల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మరో వైపు స్థానికంగా ఓటర్లను ఆకట్టుకోవడానికి యత్నాలు ప్రారంభించారు.

కొంతమంది ఎన్నికల ఖర్చు కోసం నిధుల వేటను ప్రారంభించగా, మరికొందరు ఓటర్లకు అడ్వాన్స్‌గా తాయిలాల హామీలను కూడా ఇస్తున్నారు. ఇక రాజకీయ పార్టీలు మున్సిపాలిటీల్లో పట్టు సాధించడానికి వ్యూహాల్లో నిమగ్నమయ్యాయి. జిల్లా అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలతోపాటు మున్సిపల్‌ ఎన్నికలపై పట్టు కోల్పొకుండా ఉండేందుకు ప్రత్యేక దృష్టి సారించింది. బీజేపీ సైతం సభ్యత్వ నమోదును ప్రారంభించి డివిజన్ల వారీగా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఈసారి తమకు అవకాశం కల్పించాలని కోరుతోంది. కాంగ్రెస్‌ పార్టీ అంతర్గత సమావేశాలతో మున్సిపల్‌ ఎన్నికల బరిలో దిగడానికి ప్రణాళికలు రూపొందిస్తోంది. అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి గట్టి పోటీ ఇవ్వడానికి స్థానికగా అర్ధబలం, ప్రజాబలం ఉన్న నేతల కోసం దృష్టి సారిస్తున్నారు. 

బ్యాలెట్‌తోనే ఎన్నికలు..
2014లో మున్సిపల్‌ ఎన్నికలను ఈవీఎంలతో నిర్వహించిన ఎన్నికల సంఘం ఈసారి బ్యాలెట్‌తో నిర్వహించాలని నిర్ణయించింది. డివిజన్లు, వార్డుల వారీగా ఓటర్ల జాబితా ముసాయిదాను ఈ నెల 14న ప్రకటించి, వెంటనే రిజర్వేషన్లు ప్రకటించే అవకాశం ఉంది. జిల్లాలో కార్పొరేషన్‌తోపాటు నాలుగు మున్సిపాలిటీలకు ఒకే విడతలో ఎన్నికలు జరపనుండడంతో పోలింగ్‌ కేంద్రాల వారీగా బ్యాలెట్‌ బాక్సులను సిద్ధం చేస్తున్నారు.

కరీంనగర్‌ కార్పొరేషన్‌లో 60 డివిజన్లు, హుజూరాబాద్‌ మున్సిపాలిటీలో 30 వార్డులు, జమ్మికుంటలో 30, చొప్పదండిలో 14, కొత్తపల్లిలో 12 వార్డులుగా విభజించారు. ఆయా డివిజన్లు, వార్డుల వారీగా ఓటర్ల జాబితాను తయారు చేసిన పోలింగ్‌స్టేషన్ల వారీగా బ్యాలెట్‌ పత్రాల ముద్రణ చేపట్టనున్నారు. ఓటర్ల జాబితా ప్రచురణతోపాటు ఎన్నికల నిర్వహణలో పాలుపంచుకునే అధికారులు, సహాయ అధికారులు, సిబ్బంది నియామకం చేపట్టాలని ఇప్పటికే ఆదేశాలు అందాయి. 

నేడో, రేపో పునర్విభజన గెజిట్‌..
డివిజన్లు, వార్డుల పునర్విభజన గెజిట్‌ నేడో, రేపో ప్రభుత్వ వెలువరించే అవకాశం ఉంది. మొదట ప్రకటించిన ముసాయిదా పునర్విభజన జాబితాలో స్వల్ప మార్పులు, చేర్పులు జరిగినట్లు తెలిసింది. డివిజన్ల పునర్విభజనలో ఆనవాళ్లు కోల్పోయిన వార్డులకు సంబంధించి అభ్యంతరాలు స్వీకరించిన అధికారులు న్యాయబద్ధంగా ఉన్నవాటిని పరిష్కరించి ప్రభుత్వానికి పంపించారు. ప్రభుత్వం గెజిట్‌ రూపంలో డివిజన్ల తుది స్వరూపాన్ని వెలువరించనుంది.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా