జోరు చల్లారింది 

27 Jul, 2019 10:09 IST|Sakshi

పట్టణాల్లో రాజకీయ స్తబ్ధత.. 

మున్సిపల్‌ ఎన్నికల్లో హైకోర్టు జోక్యంతో తగ్గిన  వేడి  

అందరి దృష్టి 29వ తేదీపైనే..   

సాక్షి, పెద్దపల్లి :  మున్సిపల్‌ పోరుకు యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు జరుగుతున్నప్పుడు రాజకీయ పార్టీల్లో ఉత్సాహం, పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల వాతావరణం కనిపించింది. ప్రభుత్వ యంత్రాంగం సైతం ఏర్పాట్లపై హడావుడి చేసింది.  న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వటంతో అంతా చల్లబడ్డారు. రేపో మాపో రిజర్వేషన్లు ఖరారవుతాయని ఉత్కంఠగా ఎదురుచూసిన వారు కాస్త నెమ్మదించారు. అభ్యంతరాలు పరిష్కరించే వరకూ ఎన్నికలకు వెళ్లమంటూ తమకు ఈసీ హామీ ఇచ్చిందని, పిటిషన్ల విచారణ సమయంలో హైకోర్టు పేర్కొంది. ఈ పరిణామంతో మున్సిపాలిటీల్లో ఒక్కసారిగా రాజకీయాలు స్తబ్ధుగా మారాయి.. మున్సిపాలిటీల్లో పాలకవర్గాలను ఎన్నుకొనేందుకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు గత నెల 21 నుంచి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళా ఓటర్ల గణన చేపట్టింది. ఇది జరుగుతున్న సమయంలోనే వార్డుల సంఖ్యను ఖరారు చేస్తూ ప్రభుత్వం అర్డినెన్స్‌ జారీ చేయడంతో వార్డుల పునర్విభజనకు శ్రీకారం చుట్టింది.

ఈ మేరకు పెద్దపల్లి జిల్లాలోని రామగుండం కార్పొరేషన్, పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని మున్సిపాలిటీల్లో అధికారులు ఓటర్ల జాబితాను సిద్ధం చేశారు. ఒక్కో అంశానికి మొదట పేర్కొన్న తేదీలను ఎప్పటికప్పుడు కుదిస్తూ తుది జాబితాలను సిద్ధం చేయడంతో ఆయా అంశాలపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. వా టి పరిష్కారానికి చర్యలు చేపట్టినట్లు అధికారులు పేర్కొంటు న్నారు. దీంతో ఎన్నికలకు హడావుడిగా జరుగుతున్న ఏర్పాట్లను చూసి రాజకీయ పార్టీల్లోను వేడిపుట్టింది. వెంటనే సమావేశాలు ఏర్పాటు చేసుకున్నాయి. అధిష్టానాలు జిల్లా నాయకత్వాలకు మున్సిపల్‌ పోరుకు సన్నద్ధతపై కొన్ని సూచనలు చేశాయి. టీఆర్‌ఎస్, బీజేపీలు ఇదే సందర్భంలో సభ్యత్వ కార్యక్రమాలు తెరపైకి తెచ్చాయి. వరుస ఓటమిలతో డీలా పడ్డ కాం గ్రెస్‌ సైతం వ్యూహాలకు పదును పెడుతోంది. 

కోర్టు ఉత్తర్వులతో.. 
వార్డుల విభజనలో గందరగోళంపై స్థానిక అధికారులు తీసుకున్న చర్యలకు సంతృప్తి చెందని వారు న్యాయస్థానాలను ఆశ్రయించారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో పలుచోట్ల న్యాయస్థానానికి వెళ్లడంతో ఎన్నికల నిర్వహణపై అనుమానాలు మొదలయ్యాయి. జిల్లాలో సుల్తానాబాద్‌ మున్సిపాలిటీగా వార్డుల విభజన సక్రమంగా జరుగలేదని, పెద్దపల్లిలో సైతం ముస్లిం ఓటర్లకు అన్యాయం జరిగిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు ఇష్టానుసారంగా వార్డులను విభజించారని మాజీ వార్డు కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు.  

29న కీలక నిర్ణయం.. 
పలు చోట్ల పిటిషనర్ల నుంచి వ్యక్తమైన అభ్యంతరాలను సరిచేసే వరకు ఎన్నికలకు వెళ్లమంటూ ఈసీ తమకు తెలిపిందని సోమవారం జరిపిన విచారణ సందర్భంలో హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసు విచారణను 29కి వాయిదా వేసింది. 29న హైకోర్టు తీసుకునే నిర్ణయం మున్సిపోల్స్‌పై ప్రభావం చూపనుంది. కొందరు ఇప్పటికే నెల నుంచి రెండునెలలు వాయిదాపడవచ్చని, మరికొందరు 3 నెలలు వాయిదా పడవచ్చని అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో తదుపరి విచారణలో కోర్టు నిర్ణయం ఏముంటుంది.. ఎన్నికల ప్రక్రియలో ఎంత ఆలస్యం జరుగనుందనేది 29న తేలనుంది.  

మరిన్ని వార్తలు