ఏసీబీ వలలో మున్సిపల్‌ ఉద్యోగులు

22 Aug, 2018 11:33 IST|Sakshi
డబ్బుతో పట్టుబడిన ఇన్‌చార్జ్‌ ఆర్‌ఐ వెంకటేశ్వర్లు, ఉద్యోగిని నిర్మల 

ఇంటి పొజిషన్‌ సర్టిఫికెట్‌కు రూ.6 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన వైనం..

మధిర ఖమ్మం : లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు ఉద్యోగులు పట్టుబడిన సంఘటన మంగళవారం మధిర మున్సిపాల్టీలో జరిగింది. బాధితుడు కోదాటి వేణుగోపాల్‌ తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని అంబేడ్కర్‌ సెంటర్‌ సమీపంలో కోదాటి రాజమౌళికి 6-90, 91 ఇంటి నంబర్లలో రెండు ఇళ్లు ఉన్నాయి. ఆయనకు ఇద్దరు కుమారులు వేణుగోపాల్, వెంకటేశ్వరరావు ఉన్నారు. రాజమౌళి చనిపోయిన తరువాత ఆ ఇళ్లను చిన్నకుమారుడు వెంకటేశ్వరరావుకు అప్పట్లో బదిలీచేశారు. ఈ విషయంపై 2014లో ఒక న్యాయవాదిని వెంటబెట్టుకుని వేణుగోపాల్‌ మధిర మున్సిపాల్టీకి వచ్చాడు. ఇద్దరు కుమారులకు చెందిన ఆస్తిని ఒకరి పేరుమీద ఎలా బదిలీ చేశారని ప్రశ్నించగా పొరపాటు జరిగిందని, తిరిగి ఆ ఇళ్లను రాజమౌళి పేరుమీదకు బదిలీచేశారు.

ఖమ్మంలో నివసిస్తున్న వేణుగోపాల్‌కు వాటర్‌ప్లాంట్‌ ఉంది. ప్లాంట్‌ను మధిరకు షిఫ్ట్‌ చేసేందుకు అనుమతి ఇవ్వాలని ఈనెల 8న దరఖాస్తు చేసుకున్నాడు. రూ.30 వేలు ఇస్తేనే ఫైలు కదులుతుందని బిల్‌ కలెక్టర్, ఇన్‌చార్జ్‌ ఆర్‌ఐ పి.వెంకటేశ్వర్లు చెప్పాడు. చివరకు రూ. 6 వేలు ఇస్తేనే పొజిషన్‌ సర్టిఫికెట్‌ ఇస్తానన్నాడు. విసిగిపోయిన వేణుగోపాల్‌ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. పొజిషన్‌ సర్టిఫికెట్‌ పూర్తయిందని, రూ.6 వేలు ఇచ్చి తీసుకెళ్లాలని వేణుగోపాల్‌కు ఇన్‌చార్జ్‌ ఆర్‌ఐ తెలుపగా పక్కా ప్రణాళికతో ఏసీబీ అధికారులు మంగళవారం మున్సిపల్‌ కార్యాలయానికి చేరుకున్నారు. ఉదయం వెళ్లి సర్టిఫికెట్‌ అడగ్గా లంచ్‌ తరువాత రమ్మని తెలిపాడు. ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగిని నిర్మలకు డబ్బులు ఇవ్వమని వెంకటేశ్వర్లు చెప్పగా ఇచ్చాడు.

ఆమె డబ్బును హ్యాండ్‌బ్యాగ్‌లో పెట్టుకుంది. అక్కడే సిద్ధంగా ఉన్న ఏసీబీ డీఎస్పీ  ఆధ్వర్యంలో దాడిచేసి రూ.6 వేలను స్వాధీనం చేసుకున్నారు. పరీక్షలు చేసి ఇన్‌చార్జ్‌ ఆర్‌ఐ వెంకటేశ్వర్లు, నిర్మలను నిందితులుగా గుర్తించి కేసు నమోదు చేశారు. కార్యాలయంలోని పలు ఫైళ్లను పరిశీలించారు. ఇన్‌చార్జ్‌ ఆర్‌ఐ వెంకటేశ్వర్లు, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగిని నిర్మలపై కేసు నమోదుచేసి కోర్టుకు రిమాండ్‌ చేస్తామని ఏసీబీ డీఎస్పీ కిరణ్‌కుమార్‌ తెలిపారు. దాడిలో ఖమ్మం ఏసీబీ సీఐ రమణమూర్తి, వరంగల్‌ సీఐలు వెంకట్, క్రాంతి, ఏసీబీ సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు