పురపాలనలో సొంత ముద్ర

27 Feb, 2015 02:19 IST|Sakshi
పురపాలనలో సొంత ముద్ర

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మున్సిపల్ ఉద్యోగులందరికీ ఏకీకృత సర్వీసు రూల్స్ అమలుకు రంగం సిద్ధమైంది. ప్రస్తుతం మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల ఉద్యోగులకు వేర్వేరు సర్వీసు రూల్స్ ఉండడంతో కార్పొరేషన్లు, మున్సిపాలిటీల మధ్య ఉద్యోగుల పరస్పర బదిలీలకు సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి.

ఈ నేపథ్యంలో మున్సిపల్ ఉద్యోగులందరినీ ఏకీకృత సర్వీసు రూల్స్ పరిధిలోకి తీసుకురావాలని మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు నేతృత్వంలోని మంత్రివర్గ ఉప సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేయనుంది. పురపాలన, పట్టణాభివృద్ధికి సంబంధించిన అంశాలపై అధ్యయనం కోసం ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం గురువారం ఇక్కడ మూడోసారి సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
 
 అలాగే ఆంగ్లేయుల కాలం నాటి ఏపీ మున్సిపల్, టౌన్ ప్లానింగ్ చట్టాలకు బూజు దులిపి తాజా అవసరాలకు అనుగుణంగా తెలంగాణ ముద్రతో కొత్త చట్టాలను రూపొందించాలని నిర్ణయించింది. పాత నిబంధనలను సరళీకరించడం ద్వారా ప్రజలకు ఉపశమనం కలిగించేలా కొత్త చట్టాలు ఉండాలని ప్రభుత్వానికి సిఫారసు చేయనుంది.

ఈ సమావేశంలో మంత్రులు జోగు రామన్న, పట్నం మహేందర్ రెడ్డి, పార్లమెంటరీ కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, ప్రభుత్వ సలహాదారులు పాపారావు, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి ఎం.జి గోపాల్, శాఖ డెరైక్టర్ జనార్దన్‌రెడ్డితోపాటు పలు నగరాలు, పట్టణాల మేయర్లు, చైర్మన్లు, కమిషనర్లు పాల్గొన్నారు. పురపాలన, పట్టణాభివృద్ధికి సంబంధించి అమలు చేయాల్సిన స్వల్ప కాలిక ప్రణాళికలపై గత సమావేశంలో నిర్ణయం తీసుకోగా తాజా సమావేశంలో పలు మధ్యకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాలు, సిఫారసులపై రెండు మూడు రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు.
 
 సమావేశంలో తీసుకున్న మరికొన్ని నిర్ణయాలు..
 రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన 25 నగర పంచాయతీల్లో అవసరమైన 306 పోస్టులకుగానూ రానున్న 3నెలల్లో కనీసం 100 పోస్టుల భర్తీ.  ఆధునిక హంగులతో శాకాహార, మాంసాహార మార్కెట్లు, పార్కులు, శ్మశానవాటికల అభివృద్ధి. ఒకే రీతిలో డిజైన్లు. ప్రతి పట్టణంలో రెండు మార్కెట్ల ఏర్పాటు  జాతీయ పట్టణ జీవనోపాధి పథకం కింద కేంద్రం లక్ష జనాభా ఉన్న పట్టణాలకే నిధులిస్తున్న నేపథ్యంలో మిగిలిన పట్టణాల్లో ‘మెప్మా’ కార్యక్రమాల అమలుకు రాష్ట్ర ప్రభుత్వమే నిధులు కేటాయించాలి.
 ఉపగ్రహ సమాచార వ్యవస్థ (జీఐఎస్) సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా నగరాలు, పట్టణాల్లో ఆస్తి పన్నుల గణన.
 మహబూబ్‌నగర్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం నగరాలకు హైదరాబాద్ తరహాలో ఔటర్ రింగ్ రోడ్ల నిర్మాణం.
 మున్సిపల్ పనుల్లో నాణ్యత పరిశీలనకు ప్రజారోగ్య ఇంజనీరింగ్ విభాగంలో క్వాలిటీ కంట్రోల్ విభాగం ఏర్పాటు.
 
 
 లే అవుట్లు, భవన నిర్మాణ నియమావళి ఏకీకృతమే
 లే అవుట్లు, భవన నిర్మాణాల అనుమతుల విషయంలో కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలలో ఒకే తరహా నిబంధనలు పాటించాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. ఇందు కోసం ల్యాండ్ డెవలప్‌మెంట్ కోడ్, కామన్ బిల్డింగ్ కోడ్‌లను రూపొందించాలని ప్రభుత్వానికి సూచించింది. అక్రమ లే అవుట్ల క్రమబద్ధీకరణకు నిర్ణీత గడువుతో మళ్లీ ఎల్‌ఆర్‌ఎస్‌ను అమలు చేయాలని, దీన్ని వినియోగించుకోని అక్రమ లే అవు ట్లలో భవన నిర్మాణాలకు అనుమతులు ఇవ్వరాదని పేర్కొంది. అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణకు మళ్లీ బీపీఎస్‌ను అమలు చేసేందుకు న్యాయ నిపుణుల సలహాను బట్టి చర్యలు తీసుకోవాలని సూచించింది.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా